Minister Roja : తిరుమ‌ల‌పై మొన్న మంత్రి ఉషాశ్రీ నేడు రోజా హ‌ల్ చ‌ల్‌

`తిరుమ‌ల వెంక‌న్న‌తో పెట్టుకుంటే ఎవ‌రైరా మ‌టాష్‌. శ్రీవారు అన్నీ చూస్తుంటారు. చంద్ర‌బాబును వ‌దిలిపెట్ట‌డు. `

  • Written By:
  • Updated On - August 18, 2022 / 07:24 PM IST

`తిరుమ‌ల వెంక‌న్న‌తో పెట్టుకుంటే ఎవ‌రైరా మ‌టాష్‌. శ్రీవారు అన్నీ చూస్తుంటారు. చంద్ర‌బాబును వ‌దిలిపెట్ట‌డు. ` ఇలాంటి డైలాగులు 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నేత‌లు ప‌దేప‌దే చెప్పేవాళ్లు. ఇప్పుడే అదే శ్రీవారి కొండ పై బ్రేక్ ద‌ర్శ‌నాల కోసం మంత్రులు చేస్తోన్న హ‌ల్ చ‌ల్ సామాన్య భ‌క్తుల‌కు విసుగుపుట్టిస్తోంది.

భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌డంతో బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. అయిన‌ప్ప‌టికీ మంత్రి రోజా గురువారంనాడు 20 మందికి ప్రోటోకాల్ ద‌ర్శ‌నం ఇవ్వాల్సి వ‌చ్చింది. మ‌రో 20 మందికి సాధార‌ణ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను అనుమ‌తిని టీటీడీ ఇవ్వ‌డం విమర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. మంత్రి రోజా మాదిరిగానే మ‌రో మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ ఈనెల 15వ తేదీన సుమారు 50 అనుచ‌రుల‌తో ప్రోటోకాల్ ద‌ర్శ‌నాల‌తో హ‌ల్ చ‌ల్ చేశారు. ఆ సంద‌ర్భంగా భ‌క్తులు తిర‌గ‌బ‌డ్డారు. భక్తుల కష్టాలపై ప్రశ్నించిన మీడియాపై మంత్రి గన్‌మెన్లు దురుసుగా ప్రవర్తించారు. ఆ సంద‌ర్భంగా జర్నలిస్టును నెట్టేసిని వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

మంత్రి ఉషాశ్రీ చ‌ర‌త్ చేసిన హ‌ల్ చ‌ల్ మ‌రువ‌కముందే మంత్రి రోజా 40 మందికి గురువారంనాడు బ్రేక్ ద‌ర్శ‌నాలు ఇప్పించ‌డం వివాదంగా మారింది. దర్శనం అయ్యేవరకు రోజా 2 గంటల పాటు ఆలయంలోనే ఉన్నార‌ని తెలుస్తోంది. కానీ, రోజా మాత్రం తమవారు జనరల్ దర్శనం చేసుకనున్నారని వివ‌ర‌ణ ఇస్తున్నారు. ‘‘టీటీడీ నిర్ణయాన్ని గౌరవించి బ్రేక్ దర్శనం 21 వరకు ఇవ్వ‌డాని లేద‌ని అన్నారు. నగిరి నియోజకవర్గ లీడర్లతో క‌లిసి జనరల్‌లో దర్శనం చేసుకుని వెళ్తున్నామ‌ని మంత్రి రోజా చెప్ప‌డం ఔరా అనేలా ఉంది. సామాన్య భ‌క్తులు మంత్రి రోజా వాల‌కాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆమె సుమారు 40 మంది అనుచ‌రుల‌తో క‌లిసి బ్రేక్ ద‌ర్శ‌నం తీసుకున్నార‌ని భ‌క్తులు నిల‌దీస్తున్నారు.

వీకెండ్‌, వరుస సెలవులతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అందుకే, ఆగస్టు 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. రద్దీ పెరిగిందున‌ భక్తులు తొందరపడి తిరుమల రావొద్దని కూడా టీటీడీ సూచించింది. అయితే ఇవేమి పట్టించుకోకుండా కొందరు వీఐపీలు తిరుమలకు క్యూ కడుతున్నారు. టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి బ్రేక్ ద‌ర్శనం చేయిస్తున్నారు. ఈ నెల 15న మంత్రి ఉషాశ్రీ చరణ్ తన అనుచరులతో కలిసి బ్రేక్ దర్శనం చేసుకుని సామాన్య భ‌క్తుల‌కు ఇబ్బంది క‌లిగించారు.

ప్ర‌స్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. బుధవారం శ్రీవారిని 83,880 మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. ఈ నెల 21వ తేదీ వరకు అన్ని బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ సిఫారసులను కూడా రద్దు చేసింది. ఈ నిబంధనలను పక్కనపెట్టి మంత్రి రోజా గురువారంనాడు 40మందికి పైగా అనుచరులకు బ్రేక్ దర్శనం చేయించారు. దీంతో గంటల కొద్దీ భక్తులు ఇబ్బందులు పడ్డారు. మంత్రుల తీరుపై భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా టీటీడీ మంత్రుల ప్రోటోకాల్ ద‌ర్శ‌నాల‌ను నియంత్రించాల‌ని భ‌క్తులు కోరుతున్నారు.