TS Booster: తెలంగాణలో బూస్టర్ డోస్ సంగతేంటి? 2 రోజులకు సరిపడా మాత్రమే వ్యాక్సిన్ నిల్వలు

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో చాలామంది బూస్టర్ డోసులు వేసుకోవాలని భావిస్తున్నారు.

  • Written By:
  • Updated On - July 26, 2022 / 12:17 PM IST

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో చాలామంది బూస్టర్ డోసులు వేసుకోవాలని భావిస్తున్నారు. కానీ వ్యాక్సిన్ తీసుకుందామంటే.. దాని స్టాకే లేకుండా పోయింది. ప్రభుత్వం మాత్రం ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోసులు వేయాలని వైద్యఆరోగ్య శాఖకు తేల్చి చెప్పింది. దీనిపై మంత్రుల స్థాయిలో సమీక్షాసమావేశాలు జరిగాయి. ఇదంతా ఓకే.. వ్యాక్సిన్ వేయాలంటే స్టాక్ ఉండాలి కదా. ఆ స్టాక్ ఏమైంది?

అర్హులకు బూస్టర్ డోసు వేయాలంటే తగిన వ్యాక్సిన్ నిల్వలు ఉండాలి. తెలంగాణలో బూస్టర్ డోసుకు అర్హులైన వారు 2 కోట్ల 12 లక్షల మంది ఉన్నారు. కానీ వ్యాక్సిన్ నిల్వలు చూస్తే.. 22.90 లక్షల డోసులే ఉన్నాయి. అందులోనూ కొవిషీల్డ్ వ్యాక్సిన్ 1.59 లక్షలే ఉంది. కొవాగ్జిన్ నిల్వ చూస్తే.. 16.44 లక్షలు ఉంది. కార్బోవ్యాక్స్ లెక్క చూస్తే.. 4.5 లక్షల డోసులు మాత్రమే మిగిలాయి. ఒకవేళ అందరూ బూస్టర్ డోసు తీసుకోవాలనుకుంటే.. వ్యాక్సిన్ నిల్వలు చాలవు. మరి పరిస్థితి ఏమిటి?

18 ఏళ్లు దాటినవారందరికీ బూస్టర్ డోసు వేయాలని కేంద్రం ఆదేశించింది. రెండో డోసు తీసుకుని ఆరు నెలల దాటితే వారంతా బూస్టర్ డోసు తీసుకోవచ్చు. ఆ లెక్కన చూస్తే.. తెలంగాణలో బూస్టర్ డోసు తీసుకునే అర్హత ఉన్నవారు 2.12 కోట్లు. ఇందులో 85 శాతం మంది తీసుకున్నది కొవీషీల్డే. కొవాగ్జిన్ ను తీసుకున్నవారు 15 శాతం మంది. ఇప్పటికే రోజుకు సుమారు 50 వేల నుంచి 60 వేల వరకు ప్రికాషనరీ డోసులు ఇస్తున్నారు. అంటే వీటిని అలాగే ఇస్తే.. కొవిషీల్డ్ నిల్వలు రెండు రోజులుకు మించి రావు. అలాంటప్పుడు ఇంటింటికీ తిరిగి బూస్టర్ డోసులు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది? ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.