Site icon HashtagU Telugu

Pv Narasimha Rao Explained : ప్రధాని పోస్టు దాకా పీవీ జర్నీలో ఉత్కంఠభరిత మలుపులు

Pv Narasimha Rao Pm Post

Pv Narasimha Rao Pm Post

Pv Narasimha Rao Explained  : 32 ఏళ్ల క్రితం.. అంటే 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్య జరిగింది.. 

ఈ ఘటన జరిగిన సరిగ్గా నెల తర్వాత 1991 జూన్ 21న కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు భారత ప్రధానమంత్రి అయ్యారు.

నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో హోం మంత్రి, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. 

అయితే పీవీ నరసింహారావు ప్రధాని అయ్యే వరకు సాగిన మజిలీపై ఎన్నో బుక్స్ వచ్చాయి.. ఎన్నో ఆసక్తికర విశ్లేషణలు చేశాయి..     

మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ తన స్వీయ చరిత్ర (auto biography) పుస్తకం  “One Life is Not Enough”లో ఇలా రాశారు.. “1990లో నరసింహారావుకు రాజ్యసభ సీటు ఇవ్వడానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నిరాకరించారు. ఈ నిర్ణయం గురించి తెలిసి పీవీ చాలా బాధపడ్డారు. వెంటనే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. సైలెంట్ గా తిరిగి హైదరాబాద్ కు వెళ్లేందుకు కు రెడీ అయ్యారు. చాలా పటిష్టమైన రిటైర్‌మెంట్ ప్లాన్ ను రెడీ చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఢిల్లీకి వచ్చినప్పుడు ఉండడానికి ఏర్పాట్ల కోసం ఈ దరఖాస్తు చేశారు” అని తన బుక్ లో నట్వర్ సింగ్ ప్రస్తావించారు. అయితే 1991లో పదవీ విరమణ నిర్ణయాన్ని పీవీ స్వయంగా తీసుకున్నారా ? బలవంతంగా అలా చేయబడ్డారా ? అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. రాజకీయ శాస్త్రవేత్త  వినయ్ సీతాపతి తన పుస్తకం “Half Lion: How P.V. Narasimha Rao Transformed India” లో  ఇంకో రకమైన వాదన వినిపించారు. “తాను ఎన్నికల్లో పోటీ చేయనని పీవీ నర్సింహారావు స్వయంగా రాజీవ్ గాంధీకి చెప్పారు. తన లోక్‌సభ స్థానాన్ని వేరొకరికి ఇవ్వాలని అభ్యర్థించారు. అప్పటికి పీవీ ఆరోగ్యం క్షీణించడమే ఆ నిర్ణయానికి కారణం. ఆ తర్వాత ట్రక్కు నిండా పుస్తకాలతో  ఢిల్లీలోని తన నివాసం నుంచి హైదరాబాద్‌కు పీవీ బయలుదేరారు. అయితే పీవీని(Pv Narasimha Rao Explained) వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధం కాలేదు”  అని వినయ్ సీతాపతి బుక్ లో ఉంది.

1991 మే 21న ..

1991 మే 21న  లోక్‌సభ ఎన్నికల రెండో దశ ప్రచారం జోరందుకుంది. పీవీ నరసింహారావు నాగ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.  రాత్రి బస చేసేందుకు తన సహచర కాంగ్రెస్ నాయకుడు ఎన్‌కెపీ సాల్వే ఇంటికి పీవీ వెళ్లారు. అదే సమయంలో మరోవైపు తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. రాత్రి 10.21 గంటలకు రాజీవ్‌కు పూలమాలలు వేస్తాననే నెపంతో ధను అనే ఆత్మాహుతి బాంబర్ అక్కడికి చేరుకున్నాడు. రాజీవ్ కు పూలమాల వేసి పాదాలను తాకడానికి.. ఆ ఆత్మాహుతి బాంబర్ వంగగానే శరీరానికి అమర్చి ఉన్న పేలుడు పదార్ధాలలో భారీ పేలుడు సంభవించింది. రాజీవ్ గాంధీని శ్రీలంక వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈ హత్య చేయించిందని ఆ తర్వాత దర్యాప్తులో తేలింది. ఈ దాడిలో మరో 14 మంది కూడా చనిపోయారు. రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజు  రాత్రి తనకు రెండు గంటలు నిద్ర పట్టలేదని పీవీ నరసింహారావు తన వ్యక్తిగత డైరీలో రాసుకున్నారు.

Also read : PM Modi-NewYork hotel : న్యూయార్క్ లో మోడీ బస చేస్తున్న హోటల్ విశేషాలు

ప్రధాని కుర్చీకి పోటీ.. పీవీ వర్సెస్ మరో నలుగురు  

1991 మే 24న రాజీవ్ గాంధీ అంత్యక్రియలు జరిగాయి. పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను సోనియా గాంధీ మే 25 నుంచి ప్రారంభించారు. రాజీవ్‌ హత్య తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై సానుభూతి వెల్లువెత్తింది. ఇంకా రెండు దశల ఎన్నికలు జరగాల్సి ఉండగా కాంగ్రెస్‌ విజయం సాధించే అవకాశం ఉంది. విజయం సాధిస్తే కాంగ్రెస్ అధ్యక్షుడే ప్రధాని అవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన మంత్రి పదవికి కాంగ్రెస్ నేతలు పోటీ పడడం సహజమే. ఈ రేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్ (అప్పుడు కాంగ్రెస్ నేత),  ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌డి తివారీ, అర్జున్ సింగ్, మాధవరావ్ సింధియాల పేర్లు ఉన్నాయనే చర్చ జరిగింది.  1991లో మహారాష్ట్ర సీఎంగా ఉన్న శరద్ పవార్ కాంగ్రెస్ అధ్యక్షుడిని రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాలని కోరారు.

ప్రధాని పోస్ట్ ను రిజెక్ట్ చేసిన శంకర్ దయాళ్ శర్మ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేసే అంశంపై గతంలో ఇందిరా గాంధీకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన  పీఎన్ హక్సర్‌తో మాట్లాడాలని సోనియాకు సూచించానని నట్వర్ సింగ్ తన స్వీయ చరిత్ర పుస్తకంలో రాశారు. 10 జనపథ్‌లో సోనియాతో జరిగిన సమావేశంలో అప్పటి ఉపరాష్ట్రపతి, సీనియర్ కాంగ్రెస్ నేత శంకర్ దయాళ్ శర్మను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలని హక్సర్ సూచించారని బుక్ లో ప్రస్తావించారు. వినయ్ సీతాపతి పుస్తకంలో.. “కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టే విషయంపై అభిప్రాయాన్ని సేకరించేందుకు నట్వర్ సింగ్, అరుణా అసఫ్ అలీలను శంకర్ దయాళ్ శర్మ దగ్గరికి సోనియా గాంధీ పంపారు. అయితే ఆ ప్రతిపాదనను శంకర్ దయాళ్ శర్మ రిజెక్ట్ చేశారు. తనకు వయసు పైబడిన రీత్యా ప్రధానమంత్రి పదవికి న్యాయం చేయలేనని శర్మ చెప్పారు” అని  ఉంది.

పీవీ నరసింహారావు పేరును ప్రతిపాదించిన పీఎన్ హక్సర్

ఆ తర్వాత సోనియా గాంధీతో భేటీ అయిన పీఎన్ హక్సర్ పీవీ నరసింహారావు పేరును కాంగ్రెస్ అధ్యక్ష పదవికి  సూచించారు. రాజీవ్ గాంధీ ఆప్త మిత్రుడు సతీష్ శర్మ కూడా పీవీ పేరును సోనియాకు రికమెండ్ చేశారు. గాంధీ కుటుంబంపై ఎన్నడూ తిరుగుబాటు వైఖరిని ప్రదర్శించని.. గొప్ప విశ్వాసపాత్ర వైఖరి కారణంగా కాంగ్రెస్ లోని నాటి సీనియర్ నేతలు అందరూ పీవీ పేరును సమర్ధించారు. 1991 మే 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశమైంది. దీనిలో PV నరసింహారావు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న శరద్ పవార్.. పార్టీ అధ్యక్ష, ప్రధాని పదవులను వేరుగా ఉంచాలని డిమాండ్ చేశారు. రహస్య ఓటింగ్ ద్వారా ప్రధాని పదవిని ఖరారు చేయాలని కోరారు. ఈక్రమంలో  పవార్‌ను అదుపు చేసేందుకు పార్టీ నాయకత్వం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించింది. ఫలితాలకు ఒకరోజు ముందు కాంగ్రెస్ పెద్ద నాయకులు ఢిల్లీలోని పీవీ నివాసానికి చేరుకోవడం ప్రారంభించారు. తద్వారా పార్టీ పీవీకి అండగా నిలుస్తోందనే సందేశం ఇచ్చారు.

పీవీకి పోటీ ఇచ్చిన శరద్ పవార్‌

పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాక..  శరద్ పవార్‌ను రక్షణ మంత్రిగా, మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా, అర్జున్ సింగ్‌ను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. 1991 జూన్ 18న ఫలితాలు వెలువడినప్పుడు కాంగ్రెస్ 232 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నరసింహారావుకు పెరుగుతున్న మద్దతు దృష్ట్యా శరద్ పవార్ చివరకు జూన్ 20న ప్రధానమంత్రి పదవికి తన ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నారు. అదే రోజు సాయంత్రం పార్లమెంట్ హౌస్ లో కొత్త ఎంపీల పరేడ్ నిర్వహించారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పీవీ నరసింహారావు పేరును అర్జున్ సింగ్ ప్రతిపాదించారు. దీంతో మన పీవీ  ప్రధాని కావడం ఖాయమైంది. దేశ 10వ ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 12.53 గంటలకు రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ చేత ప్రమాణ స్వీకారం చేశారు.

Exit mobile version