Bitcoin Scam Explained : కర్ణాటక ‘బిట్‌ కాయిన్ స్కామ్’ ఏమిటి? అసలేం జరిగింది?

బిట్‌ కాయిన్ స్కాం (Bitcoin Scam).. 2021లో క‌ర్ణాట‌క‌లో బీజేపీ హ‌యాంలో జ‌రిగిన ఈ కుంభ‌కోణంపై ఇప్పుడు హాట్ డిబేట్ జరుగుతోంది.. 

  • Written By:
  • Updated On - July 4, 2023 / 09:58 AM IST

Bitcoin Scam Explained: బిట్‌ కాయిన్ స్కాం.. 

2021లో క‌ర్ణాట‌క‌లో బీజేపీ హ‌యాంలో జ‌రిగిన ఈ కుంభ‌కోణంపై ఇప్పుడు హాట్ డిబేట్ జరుగుతోంది.. 

దీనిపై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేస్తున్న‌ట్లు క‌ర్ణాట‌క‌ హోంశాఖ మంత్రి జి.ప‌ర‌మేశ్వ‌ర తాజాగా  ప్రకటించడంతో  మళ్ళీ డిస్కషన్ మొదలైంది. 

ఇంతకీ ఏమిటీ కుంభకోణం? ఇది ఎలా జరిగింది? ఈ స్కామ్ విలువ ఎంత? 

ఇలా మొదలైంది.. 

బిట్ కాయిన్ స్కామ్ (Bitcoin Scam)లో ప్రధాన నిందితుడు శ్రీకృష్ణ రమేష్‌ అలియాస్ శ్రీకి. ఇతడు  27 ఏళ్ల హ్యాకర్. ఇతడి చుట్టే బిట్ కాయిన్ స్కామ్ అంతా తిరుగుతుంది.  సైబర్ చీటింగ్, డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ వ్యాపారం, క్రిప్టోకరెన్సీ దొంగతనం,  కర్ణాటక ప్రభుత్వ ఈ-గవర్నెన్స్ పోర్టల్ నుంచి డబ్బు దొంగిలించడం వంటి అనేక ఆరోపణలను ఇతడు  ఎదుర్కొంటున్నాడు. తొలిసారిగా 2015లోనే ఇతడి యాక్టివిటీ కర్ణాటక  పోలీసుల దృష్టికి వచ్చింది. ఆ ఏడాది(2015లో) ఒకరి బ్యాంక్ అకౌంట్ ను హ్యాక్ చేసినందుకు  శ్రీకృష్ణ రమేష్‌ అరెస్టయ్యాడు. అయితే త్వరగానే బెయిల్ మంజూరైంది.

2018 ఫిబ్రవరిలో ఏమైందంటే..?

2018 ఫిబ్రవరిలో అప్పటి శాంతినగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్‌ఏ  హారిస్ కుమారుడు మహ్మద్ నలపాడ్ హారిస్ తో కలిసి ఒక పబ్ లో గొడవ చేసిన కేసు నిందితుల్లో శ్రీకృష్ణ రమేష్‌ ఒకడు. మహ్మద్ నలపాడ్ హారిస్ సహాయకులతో కలిసి ఆ పబ్ లో ఒకరిపై హత్యాయత్నం చేశాడనే అభియోగాలు శ్రీకృష్ణ రమేష్‌ పై నమోదయ్యాయి. మిగిలిన నిందితులంతా పోలీసు కస్టడీలోకి వెళ్లగా..  శ్రీకృష్ణ మాత్రం ముందస్తు బెయిల్‌ వచ్చే వరకు పరారీలో ఉన్నాడు. అతను మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడంతో పోలీసులు ఆచూకీని గుర్తించలేకపోయారు. అయితే “పబ్ గొడవల కేసులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకృష్ణ రమేష్‌ ను అరెస్టు చేసి, 2018లోనే  క్షుణ్ణంగా విచారించి ఉంటే చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి వారికి తెలిసి ఉండేది” అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపణలకు సమాధానంగా మాజీ సీఎం బస్వరాజ్  బొమ్మై గతంలో అన్నారు. ఎట్టకేలకు 2020లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక   శ్రీకృష్ణ అరెస్టయ్యాడు. బిట్ కాయిన్ స్కామ్ (Bitcoin Scam)  చిట్టాను పోలీసుల ఎదుట తెరిచాడు.

నోరువిప్పితే చాలామంది బయటికి వస్తారు

“శ్రీకృష్ణ రమేష్‌ కుటుంబానికి దూరంగా ఉండేవాడు. అతనికి ఫ్యామిలీతో ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవు. డబ్బు సంపాదించడం, డ్రగ్స్ తీసుకోవడంపైనే అతడి దృష్టి. సైబర్ క్రైమ్‌లో అతని నైపుణ్యాన్ని చూసి కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళ కోసమే అతడు చాలా చేశాడు. అతడు నోరువిప్పితే చాలామంది పెద్దవాళ్ళు  బయటికి వస్తారు ”అని సైబర్ క్రైమ్ కేసులో శ్రీకృష్ణను విచారించిన ఒక అధికారి గతంలో జాతీయ మీడియాకు చెప్పారు.  

బిట్‌కాయిన్ స్కామ్ (Bitcoin Scam) ఇలా బయటపడింది 

2018 జూన్ నాటికి కర్ణాటకలో ప్రభుత్వం మారింది.  ఎట్టకేలకు 2020 నవంబర్ లో డ్రగ్స్ కేసులో శ్రీకృష్ణ, అతడి సహచరులను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని దర్యాప్తు చేస్తే మొత్తం చిట్టా విప్పాడు.. డార్క్‌నెట్ ద్వారా బిట్‌కాయిన్‌లను ఉపయోగించి డ్రగ్స్‌ను సేకరించి తన హై ప్రొఫైల్‌ ఖాతాదారులకు చేరవేశానని శ్రీకృష్ణ  పోలీసులకు చెప్పాడు. రాన్సమ్‌వేర్ దాడులు, బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజీలను హ్యాకింగ్ చేయడం, క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టడం, మనీలాండరింగ్, సైబర్ మోసాలు వంటివి చేశానని ఒప్పుకున్నాడు. 2019లో కర్ణాటక ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌ను హ్యాకింగ్ చేయడంలోనూ శ్రీకృష్ణ పాల్గొన్నాడని, ఈ పోర్టల్‌ను హ్యాక్ చేసి అనధికారిక  లావాదేవీల ద్వారా సంబంధం లేని ఖాతాలకు అక్రమంగా నిధులను మళ్ళించాడని వెల్లడైంది.

వాస్తవానికి కర్ణాటక ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌ హ్యాకింగ్‌ను మొదటిసారిగా 2019 జూలై లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ SK శైలజ  గుర్తించారు. ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ల (EMD) రీఫండ్‌లను ఆమె వెరిఫై చేస్తుండగా.. రూ. 7.37 కోట్ల అనధికారిక నిధుల బదిలీలు జరిగాయని ఐడెంటిఫై చేశారు. ఆ వెంటనే దీనిపై CIDకి బీజేపీ ప్రభుత్వం  ఫిర్యాదు చేసింది.  మొత్తం రూ. 11.55 కోట్లను కర్ణాటక ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌ నుంచి శ్రీకృష్ణ స్వాహా చేసినట్లు CID దర్యాప్తులో తేలింది.

Also read : Shooting In Philadelphia: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి

31 బిట్‌కాయిన్‌ (Bitcoin)లు దొరికాయన్నారు.. ఆ తర్వాత దొరకలేదన్నారు

2020 నవంబర్ లో బెంగళూరు  సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పక్కా సమాచారంతో డార్క్ వెబ్‌లో డీలర్ల ద్వారా హైడ్రో గంజాయిని కొనుగోలు చేస్తున్న సునీష్ హెగ్డే అనే వ్యక్తిని అరెస్టు చేసింది. అతడిని ఇంటరాగేట్ చేయగా.. డ్రగ్స్‌ కొనుగోలులో రమేష్‌ తనకు సహాయం చేస్తున్నాడని హెగ్డే  చెప్పాడు. దీంతో శ్రీకృష్ణ రమేష్‌ను 2020 నవంబర్ 17న అరెస్టు చేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణ రమేష్‌ను విచారణ చేసి రూ.9 కోట్ల విలువైన 31 బిట్‌కాయిన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) 2020 నవంబర్ లోనే  పేర్కొంది. ఒక బిట్ కాయిన్ (Bitcoin) ధర రూ.25 లక్షలకు  పైనే ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఈ దావాను ఆ  తరువాత సీసీబీ ఉపసంహరించుకుంది. తమను తప్పుదారి పట్టించేందుకే అతడు అలా చెప్పాడని గుర్తించామని వెల్లడించింది.

అయితే 5,000 బిట్‌కాయిన్‌లను వివిధ యూజర్స్ వాలెట్ల నుంచి శ్రీకృష్ణ రమేష్‌  కాజేశాడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈవిషయం ఇన్వెస్టిగేషన్ లో అతడు చెప్పినా.. కొంతమంది పెద్దలను కాపాడేందుకే 5,000 బిట్‌కాయిన్‌ల వ్యవహారాన్ని పోలీసులు అప్పట్లో దాచారని కాంగ్రెస్  అంటోంది. ఒక్కో బిట్‌కాయిన్ విలువ దాదాపు రూ.25 లక్షలపైనే  ఉంటుంది.  ఈ మొత్తం స్కాం విలువ దాదాపు రూ.10వేల కోట్లు అని కర్ణాటక కాంగ్రెస్  ఆరోపిస్తోంది.  “ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం కోరిందని మేము విన్నాము” అని ఒకానొక దశలో కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్  రామలింగారెడ్డి  ఆరోపించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కేసుతో ముడిపడిన మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని 2021 మార్చిలో బొమ్మై నేతృత్వంలోని  బీజేపీ ప్రభుత్వం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED)ని కోరింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 14 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.44 కోట్లను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు ఆగస్టులో ఈడీ అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేసింది. “హ్యాకర్ శ్రీకృష్ణ కర్నాటక సెంటర్ ఫర్ ఇ-గవర్నెన్స్ పోర్టల్‌ను హ్యాక్ చేసి రూ. 11.55 కోట్లను కొల్లగొట్టాడు. అందులో  రూ.10.5 కోట్లను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో రిజిస్టర్ అయి ఉన్న స్వచ్ఛంద సంస్థ  ఉదయ్ గ్రామ వికాస్ కు,  మిగితా  రూ. 1.05 కోట్లను ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ లో ఉన్న నిమ్మి ఎంటర్‌ప్రైజెస్ కు చెందిన బ్యాంకు ఖాతాలకు మళ్ళించాడు” అని ఈడీ తన ప్రకటనలో తెలిపింది.