KCR Plan: కేటీఆర్ ను సీఎం చేయడానికే.. కేసీఆర్ దేశ్ కీ నేత అవుతున్నారా?

కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అంటే తెలంగాణలో సెగ తగలుతోందా లేక తెలంగాణతో పాటు జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలగాలనా?

  • Written By:
  • Publish Date - June 19, 2022 / 11:00 AM IST

కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అంటే తెలంగాణలో సెగ తగలుతోందా లేక తెలంగాణతో పాటు జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలగాలనా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. నేషనల్ లీడర్అ నిపించుకోవాలనుకున్నప్పుడు.. మమత నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎందుకు డుమ్మా కొట్టారు? అదేమంటే కాంగ్రెస్ ను ఆహ్వానించినప్పుడు తామెలా వెళ్తామని చెబుతున్నారు టీఆర్ఎస్ లీడర్లు. మరి దేశ్ కీ నేతా అనిపించుకోవాలంటే ఎలా? దానికోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. జాతీయ పార్టీపై ఆయన ప్లీనరీలోనే స్పష్టత ఇచ్చారు. భారతీయ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ పెట్టి.. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని.. వాటిని ప్రక్షాళన చేయాలంటూ సలహాలు ఇస్తున్నారన్నారు. దానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా తోడయ్యాయి. అసలు కేసీఆర్ ఆలోచనేంటి?

తెలంగాణలో ఉన్నవి 17 ఎంపీ సీట్లు. వచ్చే ఎన్నికల్లో అన్ని ఎంపీ సీట్లను గెలుచుకున్నా వాటితో కేంద్రంలో చేసేదేం ఉండదు. మరి కేసీఆర్ ఏం స్ట్రాటజీతో ముందుకెళుతున్నారు. కేటీఆర్ ను సీఎం చేయడానికే కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ గేమ్ ఆడుతున్నారంటున్నాయి ప్రతిపక్షాలు. అదే నిజమైతే.. ఆమాత్రం దానికి జాతీయ స్థాయిలో ఆయన వేరే పార్టీలను కలుపుతూ.. కాంగ్రెస్, బీజేపీలతో వైరం పెట్టుకోవలసిన అవసరమేముంది? ఎందుకంటే తెలంగాణ బండి సాఫీగా సాగడానికి తొలిదశలో కేంద్రంతో సఖ్యతగానే ఉన్నారు కేసీఆర్. కానీ రెండో దఫా గెలిచిన తరువాతే కేంద్రంలో బీజేపీతో వైరం పెరిగింది. రాష్ట్రంలోనూ అది తీవ్రమైంది.

తెలంగాణలో 2014లో టీఆర్ఎస్ గెలిచింది. కొత్తగా ఏర్పాటు అయిన రాష్ట్రం కావడం, రాష్ట్రాన్ని తెచ్చిన నేతగా గుర్తింపు ఉండడంతో కారు సులభంగానే దూసుకుపోయింది. రెండోసారి .. అంటే 2018లో.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తో కలవడంతో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రగిలించారు. దీంతో అది పనిచేసింది. అభివృద్ధి పనులు సగంలో ఉన్నాయని.. ప్రతిపక్షాల్లో సమర్థుడైన నాయకుడు ఎక్కడ అనేసరికీ.. జనం మళ్లీ టీఆర్ఎస్ కే పట్టం కట్టారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు దూకుడు పెంచాయి. లెఫ్ట్ నుంచి బీజేపీ, రైట్ నుంచి కాంగ్రెస్ పార్టీలు దూసుకొస్తున్నాయి. అందుకే తెలంగాణలో తమ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించడానికే కేసీఆర్ ఈ కొత్త ఎత్తుగడ వేశారంటున్నాయి విపక్షాలు. దీనికోసమే దేశ్ కీ నేతగా మారడానికి ప్రయత్నిస్తున్నారంటున్నాయి.

కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే వచ్చే ఓట్లు, సీట్లు ఎన్ని? దక్షిణాదివారికి ఉత్తరాదిలో ఆదరణ దక్కదు. సౌత్ లో నే ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా గ్రిప్ కష్టమే. అందుకే ఎన్టీఆర్, పీవీ నరసింహారావు బొమ్మలతో జనం ముందుకు వెళ్లేలా ప్లాన్ చేశారంటున్నారు. దీనికోసమే.. ఆ మధ్య ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన జయంతి రోజున టీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించారు. పార్టీ పెడితే.. అటు ఏపీలో కూడా అవకాశాలు ఎంతమేర ఉన్నాయో తెలుసుకోవడానికే ఏపీ నేత ఉండవల్లితో లంచ్ మీటింగ్ కూడా పెట్టారు. పైగా తన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఇప్పటికే చాలాసార్లు భేటీ అయ్యారు.

పొరుగునున్న కర్ణాటకలో చూస్తే.. అక్కడ బీజేపీని, కాంగ్రెస్ ని, జేడీఎస్ ను కాదని కేసీఆర్ పెట్టే కొత్త పార్టీకి ఓట్లేస్తారా? తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేను కాదని.. కేసీఆర్ కు పట్టం కట్టే సీనుందా? కేరళలో లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ ను కాదని వేరే పార్టీకి చోటేది? తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే.. తెలంగాణలో టీఆర్ఎస్ దే పవర్. ఏపీలో చూస్తే.. అక్కడ పవర్ కోసం ఇప్పటికే వైసీపీ, టీడీపీ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. పైగా రాజకీయం పీక్ స్టేజ్ లో ఉన్న రాష్ట్రమది. అలాంటప్పుడు కేసీఆర్ పార్టీకి ఓట్లేసే అవకాశాలు తక్కువ. ఇక్కడ ఒక్క విషయం మరిచిపోకూడదు. ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. ఇక బెంగాల్ లో మమతను కాదని ఓట్లు వేస్తారా? యూపీలో ఎస్పీ, బీఎస్పీ, బీజేపీని దాటుకుని గెలవగలరా? మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీని కాదని ఓట్లు రాబట్టగలరా? మోదీలా కేసీఆర్ కూడా ప్రసంగాలను దంచేస్తారు. కానీ ఉత్తరాది ప్రజలను ఆకట్టుకోవడం అంత సులభం కాదు.

ఇప్పుడు తెలంగాణలో ఉన్న 17 సీట్లలో ఒకటి ఎలాగూ ఎంఐఎం సొంతం చేసుకుంటుంది. సో, మిగిలిన సీట్లు 16. ఇప్పటికీ వీటిలో బీజేపీకి 4, కాంగ్రెస్ కు 3 సీట్లు ఉన్నాయి. అంటే మిగిలిన 9 స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. అలాంటప్పుడు 9 సీట్లు ఉన్న టీఆర్ఎస్ అధినేత జాతీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తారని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకున్న తరువాత హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దాదాపు 29 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కోసం పీకే సర్వే చేశారని సమాచారం. వాటి ప్రకారం చూస్తే.. టీఆర్ఎస్ కు ప్రతికూల పవనాలు వీచినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో ఈ తేడా కనిపించిందంటున్నాయి.

2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు.. టీఆర్ఎస్ 63 స్థానాల్లో గెలిచింది. టీడీపీ 15, బీజేపీ 5 స్థానాల్లో నెగ్గాయి. తెలంగాణ సెంటిమెంట్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడూ.. ఇక్కడ సీమాంధ్ర ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదు. 2019 ఎన్నికల్లో కేసీఆర్ ను నమ్మి ఓట్లు వేశారు. కానీ అలాంటి సమయంలోనూ ఖమ్మంలో టీడీపీకి 2 సీట్లు వచ్చాయి. బీజేపీకి ఒక సీట్లు వచ్చింది. అంటే సీమాంధ్ర ఓటు బ్యాంకు కొంత టర్న్ అయినా.. అప్పటికీ పదిలంగానే ఉందని టీఆర్ఎస్ కు స్పష్టత వచ్చింది.

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితుల వల్ల ఇక్కడ కేసీఆర్ కు లబ్ది చేకూరుతుందన్న భావనలో సీమాంధ్ర సెటిలర్స్ ఉన్నారంటున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా రాకుండా చేసిందని బీజేపీపైనా ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. ఇలాంటి సమయంలో వారి ఓట్లను మళ్లీ పొందడానికి కేసీఆర్ కొత్త స్కెచ్ వేశారంటున్నాయి విపక్షాలు. అందుకే సీమాంధ్రులను ప్రసన్నం చేసుకోవడానికి.. అక్కడ జగన్ ప్రభుత్వంపై.. టీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు గుప్పిస్తోంది. అలా జాతీయస్థాయి నేతగా ఎదగడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.

(This article was written by an independent political analyst)