అంతరించిపోతున్న అరుదైన కళను కాపాడుతున్న కేరళ యువతి

  • Written By:
  • Updated On - November 6, 2021 / 11:45 AM IST

కేరళ అనగానే ఎన్నో సంప్రదాయాలు కనిపిస్తాయి. ఎన్నో కళలకు పుట్టినిల్లు కూడా. అలాంటి అంతరించిపోతున్న కళలలో ఒకటి నొక్కువిద్య పవక్కలీ. పై పెదవి మీద కర్రను నిలిపి, దాని మీద బొమ్మలను ఆడించే అతి క్లిష్టమైన ఆట ఇది. నొక్కు అంటే చూపు, విద్య అంటే తెలిసిందే, ఇక పవక్కలీ అంటే బొమ్మలాట అని అర్ధం. అంటే కేవలం ధ్యాసతో ఈ కళను ప్రదర్శించాల్సి ఉంటుంది. చూపు ఏ కాస్త ఏమారినా కథ, కళ మొత్తం చెదిరిపోతుంది. ముక్కు, పైపెదవి మధ్య కర్రను నిలిపి ఆడించే ఈ ఆటను పూర్తి ధ్యాసతో పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కళను బతికిస్తున్నది కేవలం ఒకే ఒక్క అమ్మాయి. ఆమే ఈ కళకు చివరి వారసురాలు. ఈ 20 ఏళ్ల వారసురాలి పేరు కే.ఎస్.రెంజినీ. పద్మశ్రీ అవార్డు గ్రహీత మూలిక్కల్ పంకజాక్షి తన తాతల కాలం నుంచి వస్తున్న కళను కాపాడుకుంటూ వచ్చింది. కాని, వయసు సహకరించని కారణంగా ఇక ఆ కళను ప్రదర్శించడం లేదు. తలనొప్పి, కళ్లు మసకబారడం వంటి కారణాలతో పారిస్‌లో జరిగిన తన చివరి ప్రదర్శనతో ఇక ఈ కళను ఆపేసింది. అయితే, నొక్కువిద్య పవక్కలీని బతికించుకోవాలనే ఆశ మాత్రం అలాగే సజీవంగా ఉంది. అందుకే, ఈ కళను తన మనవరాలు అయిన రెంజినీకి నేర్పించింది. ఇప్పుడీ కళకు చివరి వారసురాలిగా రెంజినీనే మిగిలింది.

ఈ అరుదైన కళను ప్రదర్శించడం తన వంశానికే దక్కిందనే ఆనందం కంటే.. నొక్కువిద్య పవక్కలీ ఇక తనతోనే అంతరించిపోతుందనే దిగులుతోనే ఎక్కువ కాలం గడిపారు పంకజాక్షి. తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న కళను కాపాడుకోవడం కోసం మనవడు, మనవరాళ్లు ముందుకొచ్చారు. కళను నేర్చుకోడానికి చాలా కష్టపడ్డారు. అయితే, ఇందులోకి దిగిన తరువాత ఈ కళ ప్రదర్శించడం ఎంత కష్టమో తెలుసుకుని ఒక్కొక్కరుగా వెనుదిరిగారు. కాని, ఒక్క మనవరాలు మాత్రమే పట్టుబట్టి మరీ నొక్కువిద్య పవక్కలీని నేర్చుకున్నారు. పంకజాక్షి కూడా కె.ఎస్. రెంజినీతోనే ఉంటూ ఇందులోని మెళకువలను నేర్పించింది.

ఎన్నో ఏళ్ల శిక్షణ తరువాత రెంజినీ ఈ కళలో నైపుణ్యం సాధించింది. వేదికపై నొక్కువిద్య పవక్కలీని ప్రదర్శిస్తున్న ప్రతిసారి.. రెంజినీలో తననను తాను చూసుకుని మురిసిపోయారు పంకజాక్షి. తన పెదవుల మీద దేవుని బొమ్మలు నృత్యం చేస్తుంటే చూసి ఆనందబాష్పాలు కార్చిన సందర్భాలు కోకొల్లలు అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేరళలోని ఓ మారుమూల గ్రామం అయిన మోనిపల్లిలో నివాసం ఉంటూ నొక్కువిద్య పవక్కలీని బతికిస్తోంది ఈ కుటుంబం.

పంకజాక్షి 12 ఏళ్ల ప్రాయంలోనే ఈ కళను నేర్చుకున్నారు. 20వ ఏట వివాహం జరిగినా సరే కళను మాత్రం వదిలిపెట్టలేదు. పైగా భర్తే స్వయంగా దీనికి సంబంధించిన బొమ్మలు తయారుచేసి ఇచ్చే వారు. అత్తగారు సైతం పంకజాక్షి వెంటే నడిచారు. సంగీతానికి అనుగుణంగా బొమ్మలను ఆడించడం నిజంగా అద్భుతమైన కళ అంటుంటారు పంకజాక్షి. కాని, దురదృష్టం ఏంటంటే.. ఈ కళ ఈ ఒక్క కుటుంబానికి మాత్రమే వచ్చు. కాలం గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కరుగా ఈ కళ నుంచి దూరంగా జరిగారు. తన కూతురికి నేర్పించాలన్న ఆశ కూడా అడియాసగానే మిగిలింది. అయితే, తన మనవరాలి రూపంలో అదృష్టం నడిచిరావడంతో.. కళలో ఉన్న మెళకువలన్నీ నేర్పించి తన వారసురాలిని తయారుచేసుకున్నారు పంకజాక్షి.

పై పెదవిపై కర్రను నిలిపి, దాని మీద బొమ్మలను ఆడించడం చూసినంత, చెప్పినంత సులభం కాదని ఈ కళను నేర్చుకున్న రెంజిని చెబుతున్నారు. మహాభారత, రామాయణ ఘట్టాలను ఈ బొమ్మలాట రూపంలో చూపించాల్సి ఉంటుంది. కొద్దిగా పట్టు తప్పినా, ధ్యాస కోల్పోయినా మొత్తం సర్వ నాశనం అవుతుంది. అందుకే, చాలా జాగ్రత్తగా కళను ప్రదర్శించాలని చెబుతోంది. కర్రను పెదాలపై బ్యాలెన్స్ చేయడానికే తనకు ఏడాదికి పైగా పట్టిందంటే ఈ కళ ఎంత కఠినమైనదో అర్ధం చేసుకోవచ్చు. పైగా శిక్షణలో భాగంగా బొమ్మలను ఆడిస్తున్న సమయంలో ఎన్నో దెబ్బలు తగులుతాయి కూడా. వాటినన్నింటినీ ఓర్పుతో భరిస్తూ కళను నేర్చుకుంది రెంజిని.