Swing Seats: కన్నడ వార్.. స్వింగ్ సీట్లలో గెలుపెవరిదో?

Swing Seats.. ఇక్కడ ఎవరు గెలిస్తే రాష్ట్రంలో వారిదే అధికారం. ఇది కర్ణాటకలో దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయం. అందుకే స్వింగ్ స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి ప్రధాన రాజకీయ పక్షాలు.

  • Written By:
  • Updated On - April 29, 2023 / 10:22 AM IST

Swing Seats : స్వింగ్ సీట్స్‌.. ఇక్కడ ఎవరు గెలిస్తే రాష్ట్రంలో వారిదే అధికారం. ఇది కర్ణాటకలో దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయం. అందుకే స్వింగ్ స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి ప్రధాన రాజకీయ పక్షాలు. గాలి తమ వైపు వీచేలా చూసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.224 నియోజకవర్గాలున్న కర్ణాటక అసెంబ్లీలో.. 84 స్వింగ్‌ స్థానాలున్నాయి. ఈ 84లో మెజార్టీ సీట్లు దక్కించుకున్న పార్టీ రాష్ట్రంలో అధికారం దక్కించుకుంటుంది. 1957 నుంచి అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థినే ఎన్నుకుంటూ వస్తున్నారు ఈ నియోజకవర్గాల ఓటర్లు. ఒకే పార్టీని వరుసగా రెండుసార్లు గెలిపించే సంప్రదాయం ఇక్కడ లేదు.

లింగాయత్‌లకు గట్టి పట్టున్న ముంబై కర్ణాటక ప్రాంతంలో 19 స్వింగ్ సీట్లున్నాయి. లింగాయత్, వొక్కలిగలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నా సెంట్రల్ కర్ణాటకలోని 20 స్వింగ్‌ స్థానాల్లో 2018లో బీజేపీ 16 నెగ్గింది. కోస్తా కర్ణాటకలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. 10 స్వింగ్ స్వీట్లుగా (Swing Seats) పేరొందాయి. 2018 ఎన్నికల్లో ఈ స్థానాలను బీజేపీ స్వీప్ చేసింది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 12,దక్షిణ కర్ణాటకలో 14 స్వింగ్ సీట్లున్నాయి. బెంగళూరు నగరంలోనూ రెండు స్వింగ్ సీట్లు బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి.

మొత్తం 84 స్వింగ్ స్థానాల్లో గత ఎన్నికల్లో 56 సీట్లు తన ఖాతాలో వేసుకుంది బీజేపీ. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి కూడా స్వింగ్ సీట్లలో సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తోంది కమలదళం. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, 4 శాతం ముస్లిం కోటా రద్దు, ధర పెరుగుదల వంటి సమస్యలను బీజేపీకి మైనస్‌గా మారాయి. వీటన్నింటినీ మోదీ చరిష్మాతో అధిగమించాలని చూస్తోంది బీజేపీ. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా స్వింగ్ సీట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ స్థానాల్లో పాగా వెయ్యడానికి పకడ్బందీ వ్యూహాలనే రచించింది. 84 స్వింగ్ స్థానాల్లో.. 30 నియోజకవర్గాల్లో లింగాయత్‌లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. స్థానికంగా బలంగా ఉన్న అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో పాటు మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ చేరికతో లింగాయత్ ఓటు బ్యాంకును కొంతవరకైనా కొల్లగొట్టవచ్చన్న ఆశతో ఉంది హస్తం పార్టీ. అలాగే దక్షిణ కర్ణాటకలో వొక్కళిగల అండతో స్వింగ్ సీట్లు దక్కించుకోవాలని భావిస్తోంది జేడీఎస్‌. మరి స్వింగ్‌ స్థానాల స్వింగ్‌ ఎటో తెలియాలంటే.. మే 13 వరకు ఆగాల్సిందే.

Also Read:  Anil Ambani: భారీగా పడిపోయిన అనిల్ అంబానీ సంపాదన.. ప్రస్తుత ఆస్తులు సున్నా అంటూ?