Mysuru Princess: నగలు అమ్మి.. లక్షల మంది దాహం తీర్చింది!

చరిత్ర పుటల్లో కొందరి పేరు రాయబడి ఉండకపోవచ్చు. అంత మాత్రాన వారి చరిత్ర మరుగునపడిపోదు. గొప్ప వ్యక్తుల చరిత్ర వేనోళ్ల కీర్తించబడుతూనే ఉంటుంది.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 11:45 AM IST

చరిత్ర పుటల్లో కొందరి పేరు రాయబడి ఉండకపోవచ్చు. అంత మాత్రాన వారి చరిత్ర మరుగునపడిపోదు. గొప్ప వ్యక్తుల చరిత్ర వేనోళ్ల కీర్తించబడుతూనే ఉంటుంది. అలాంటి కథే మైసూరు మహారాణి కెంపనంజమ్మణి వాణి విలాస సన్నిధాన. కాస్త పెద్దగా ఉన్నా పేరు మాత్రం ఇదే. మహారాణి అంటే రాజభోగాలు అనుభవించే వ్యక్తిగానే చూస్తాం. కాని, ఈ మహారాణి మాత్రం ప్రజల కోసం ఆలోచించింది. పౌరులకు అవసరమైన తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్ వంటి సౌకర్యాలు ఏర్పరచడం కోసం తాపత్రయపడింది.

ఈ మైసూరు మహారాణికి 26 ఏళ్ల వయసుప్పుడు జీవితంలో ఓ పెద్ద కుదుపు ఎదురైంది. తన భర్త చామరాజేంద్ర చిన్న వయసులోనే చనిపోవడంతో రెండు రోజుల పాటు ఏడుస్తూనే ఉండిపోయింది. అలా ఏడ్చి ఏడ్చి స్పృహతప్పి పడిపోయింది. కాని, మూడోరోజు కాస్త ధైర్యం తెచ్చుకుని రాజ్య భారాన్ని భుజానికెత్తుకుంది. మైసూర్ రాష్ట్రాన్ని పరిపాలించింది. గత భర్త పాలనను కొనసాగించి అందరి ప్రశంసలు అందుకుంది. మైసూరు కరువులో విలవిలలాడుతున్న సమయంలో డ్యాంలు నిర్మించింది. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణానికి పునాది వేసింది. ఇప్పటికీ బెంగళూరులో ఈ మహారాణి పేరు వినిస్తుంది, కనిపిస్తుంది. కొన్ని ప్రభుత్వ సంస్థలకు ఇప్పటికీ మహారాణి పేరే ఉంది. వాణి విలాస్ సర్కిల్, వాణి విలాసపుర డ్యామ్, వాణి విలాస రోడ్, వాణి విలాస బ్రిడ్జ్ పేర్లు ఇప్పటికీ సుపరిచితాలే. బెంగళూరు వాసులు మంచినీళ్లు తాగుతున్నారంటే అది ఆ మహారాణి చలవే. హెసరఘట్ట రిజర్వాయర్ ద్వారా ప్రస్తుతం బెంగళూరుకు తాగునీరు అందుతోంది.

మహారాణి కెంపనంజమ్మని పుట్టినిల్లు కూడా రాయల్ ఫ్యామిలీనే. బాగా చదువుకుంది కూడా. ఇంగ్లీష్, సంస్కృతం నేర్చుకుంది. కాని, 12 ఏళ్ల వయసులోనే 15 ఏళ్ల వయసున్న చామరాజేంద్ర వడియార్‌తో వివాహం జరిపించారు. ఆ తరువాత మూడేళ్లకు మహారాజు, మహారాణిగా సింహాసనంపై కూర్చోబెట్టారు. అప్పట్లో మైసూర్ మహారాజులు కూడా బ్రిటిష్ వారి పాలన కిందే పనిచేయాల్సి వచ్చింది. అప్పట్లోనే ఏడాదికి 35 లక్షల పన్నులు బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించే వారు. ఏం చేసినా.. ముందుగా బ్రిటిష్ అధికారులకు చెప్పి, వారి అనుమతులతో పనులు చేయాల్సి వచ్చేది. కాని, ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. ప్రజలకు ఏ లోటు లేకుండా పాలన సాగించారు. మహారాజు చామరాజేంద్ర పాలనను దగ్గరుండి చూసి, అప్పుడప్పుడు పాలనలోనూ పాలుపంచుకుంది మహారాణి వాణి. కలకత్తా వెళ్లినప్పుడు మహారాజుకి డిప్తీరియా అటాక్ అయింది. ఆ జబ్బు ముదిరి ప్రాణాలు కోల్పోయారు. మహారాజు చనిపోయే సరికి మహారాణి వాణికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడి వయసు అప్పటికి పదేళ్లే అవడంతో పాలన బాధ్యతలు వాణి స్వీకరించాల్సి వచ్చింది.

శివనసముద్ర హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా కేజీఎఫ్‌కు కరెంట్‌ను అందించిన ఘనత రాణి వాణిదే. ఇక్కడి నుంచే బెంగళూరుకు కరెంట్ సప్లై అయింది. ఇక కావేరీ నది మీద నిర్మించిన కృష్ణ రాజ సాగర డ్యాం కోసం ఏకంగా తన నగలనే అమ్మింది. ఈ ప్రాజెక్టు వల్ల బెంగళూరుకే కాదు మొత్తం కర్నాటక, తమిళనాడుకు మంచి జరిగింది. ఇక బాలికల విద్య కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అప్పట్లోనే 235 స్కూళ్లలో 12వేల మంది అమ్మాయిలు చదువుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కాలేజీకి 372 ఎకరాలు ఇచ్చింది కూడా మహారాణి వాణి విలాసనే. మైరుగైన వైద్యం కోసం ఆస్పత్రులు నెలకొల్పింది. ముఖ్యంగా ప్రసూతి ఆస్పత్రులు నెలకొల్పి ఎందరో తల్లులకు పునర్జన్మనిచ్చింది. మహారాణి పనితీరు చూసి వైస్రాయ్‌గా చేసిన లార్డ్ కర్జన్ సైతం పొగడకుండా ఉండలేకపోయారు. కెంపనంజమ్మని 1934 జులై 7న చనిపోయింది.