Karnataka CM: కర్ణాటకలో పేసీఎం ప్రకంపనలు

పేసీఎం ప్రకంపనలు కర్నాటకను కుదిపేస్తున్నాయి. బెంగళూరులో ఎక్కడ చూసినా ఈ పోస్టర్లే దర్శనమిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 10:30 PM IST

పేసీఎం ప్రకంపనలు కర్నాటకను కుదిపేస్తున్నాయి. బెంగళూరులో ఎక్కడ చూసినా ఈ పోస్టర్లే దర్శనమిస్తున్నాయి.
వీటిని రాష్ట్రవ్యాప్తంగా అంటించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది విపక్ష కాంగ్రెస్‌. ఈ వివాదంలో 8మందిని అరెస్ట్‌ చేయడంపై.. కాంగ్రెస్ కస్సుమంది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ రణదీప్‌సింగ్ సుర్జేవాలా సహా 100మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పేసీఎం పోస్టర్లు పట్టుకుని రోడ్డెక్కారు. కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. రాజకీయ విమర్శలను కూడా జీర్ణించుకోలేక పోతోందని మండిపడ్డారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా.

ఎంతమందిని అరెస్ట్ చేసినా తగ్గేదేలేదని.. రాష్ట్రవ్యాప్తంగా పేసీఎం పోస్టర్లు అంటిస్తామని స్పష్టంచేశారు.బొమ్మై ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా.. పాలకులకు 40శాతం కమీషన్ తప్పనిసరి అనే విమర్శలు చానాళ్లుగా వినిపిస్తున్నాయి. కాంట్రాక్టులు, ఫ్యాక్టరీలు.. ఆఖరికి మఠాలకు ఇచ్చే నిధుల్లోనూ 40శాతం కోత పడుతోందనే ఆరోపణలున్నాయి. దీనిని హైలైట్ చేస్తూ పేసీఎం క్యాంపెయిన్‌ డిజైన్ చేసింది కాంగ్రెస్‌. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చిత్రాలతో పేసీఎం పోస్టర్లు ఏర్పాటుచేసింది. దీనిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. 40శాతం కమీషన్‌ గవర్నమెంట్‌ అనే వెబ్‌సైట్‌ ఓపెన్ అవుతుంది. ఆ సైట్ ద్వారా.. ప్రభుత్వ అవినీతిపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు.
కాంగ్రెస్ PayCM ప్రచారానికి బీజేపీ కౌంటర్‌ అటాక్ చేసింది. సిద్ధరామయ్య ప్రభుత్వంలో జరిగిన అవినీతిని
ఎండగడుతూ స్కామ్ రామయ్య పుస్తకాన్ని విడుదలచేసింది. ముందు వీటిని సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
తనపై కాంగ్రెస్ కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. ఆరోపణలు చేయడం కాదని.. ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ చేశారు.