Belly Fat: హార్మోన్లను పట్టు.. బెల్లీ ఫ్యాట్ ను తరిమికొట్టు!!

బెల్లీ ఫ్యాట్‌.. ఇది ఇప్పుడు ఎంతోమందిని వేధిస్తున్న సమస్య..

  • Written By:
  • Publish Date - August 11, 2022 / 07:00 PM IST

బెల్లీ ఫ్యాట్‌..

ఇది ఇప్పుడు ఎంతోమందిని వేధిస్తున్న సమస్య..

దీని బారిన పడకుండా ఉండాలన్న.. ఇప్పటికే ముసురుకున్న బెల్లీ ఫ్యాట్‌ ముప్పు నుంచి గట్టెక్కాలన్నా కొన్ని హార్మోన్లను కట్టడి చేస్తే చాలట. ఇందుకోసం ఏం చేయాలి ? ఆ హార్మోన్ల కథేంటి ? అనేది తెలుసుకోవాలంటే ప్రముఖ డైటీషియన్ లవ్లీన్ కౌర్ ఇస్తున్న సూచనలను తెలుసుకోవాల్సిందే. వివరాలు ఆమె మాటల్లోనే…

లెప్టిన్‌, గ్రెలిన్‌ హార్మోన్లు.. ఆకలిపై అదుపు

బెల్లీ ఫ్యాట్ రావడానికి
మానసిక ఒత్తిడి, సరిపడినంత నిద్ర లేకపోవటం అనేవి ముఖ్యమైన కారణాలు. నిద్రలేమి జీవక్రియల వేగాన్ని తగ్గిస్తుంది. ఆకలి హార్మోన్లుగా పరిగణించే లెప్టిన్‌, గ్రెలిన్‌పై ప్రభావం చూపుతుంది. ఆహారం తీసుకుంటున్నప్పుడు లెప్టిన్‌… తినడం ఆపమంటూ మెదడుకి సంకేతాలనిస్తుంది. గ్రెలిన్‌ ఆకలిని క్రమబద్ధీకరిస్తుంది. అధ్యయనాల ప్రకారం నిద్రలేమి వల్ల లెప్టిన్‌ పనితీరు తగ్గుతుంది. అదే బరువు పెరిగేందుకు దారితీస్తుంది. ఘ్రెలిన్ హార్మోన్ ఎలాంటిదంటే మీరు ఎప్పుడు తినాలో చెప్తుంది, నిద్రలేనప్పుడు మరింత ఘ్రెలిన్ ఉత్పత్తి అవుతుంది. మరోవైపు, లెప్టిన్ అనేది తినవద్దు ఆగండని చెప్తుంది. నిద్ర సరిగా లేనప్పుడు, మీ శరీరంలో తక్కువ లెప్టిన్ ఉంటుంది. ఎక్కువ మొత్తాల్లో ఘ్రెలిన్, తక్కువగా లెప్టిన్ ఉండటం వలన బరువు పెరుగుతారు. అందుకే వేళకు నిద్రపోవడం అలవాటుగా మార్చుకోవాలి. మీకు రోజుకి ఎనిమిది గంటల మంచి నిద్ర అవసరం.

గ్లైసెమిక్ ఇండెక్స్ చెక్ చేసుకోండి..

బెల్లీ ఫ్యాట్‌ ఉన్నవాళ్లు కేవలం కార్బోహైడ్రేట్లు తక్కువ తీసుకుంటే సరిపోదు. గ్లైసెమిక్ ఇండెక్స్ ను దృష్టిలో పెట్టుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) రక్తంలో చక్కెర స్థాయిపై వివిధ ఆహారపదార్థాల ప్రభావం సూచిస్తుంది. మీరు తీసుకున్న కొవ్వుని అవయవాల చుట్టూ పేరుకోకుండా ఎలా కదిలిస్తారన్న దానిపై అంతా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారపదార్థాలు తినగానే, రక్తంలో చక్కెర స్థాయి సైతం పెరుగుతుంది. ఎక్కువైన చక్కెర కొవ్వుగా మారి నిల్వ ఉంటుంది. అదే బెల్లీ ఫ్యాట్‌గా మారుతుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారపదార్థాలు ఇలా హఠాత్తుగా చక్కెర స్థాయిలు పెరగనివ్వవు. జీర్ణక్రియను నెమ్మది చేస్తాయి. అలాగే పీచుపదార్థం కూడా ఎక్కువ మొత్తంలో కలిగివుంటాయి. అందుకని ఎక్కువగా పిండిపదార్థం లేని కాయగూరలు, నట్స్, చిక్కుళ్ళు తినండి. ఎంత వీలైతే అంత బంగాళదుంపలు, వైట్ రైస్, వైట్ బ్రెడ్, చక్కెర ఎక్కువ ఉండే డబ్బాలలో పళ్ళరసాల వంటి వాటికి దూరంగా ఉండండి.

ప్రొటీన్స్‌ని తీసుకోవడం అత్యవసరం..

ఎక్కువగా ప్రొటీన్స్‌ ఉండే గుడ్లు, ఓట్స్, బ్రొకొలీ, పౌల్ట్రీ, చేపలు, బాదం, పాలు తీసుకోవడం వల్ల జిఎల్పి-1, పెప్టైడ్ వైవై. ఖోలెసిస్టోకైనిన్ వంటి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. వీటివల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఫలితంగా ఆకలి కలిగించే హార్మోన్ ఘ్రెలిన్ ప్రభావం తగ్గుతుంది. ప్రొటీన్లు జీర్ణమవ్వడానికి ఎక్కువసేపు తీసుకుంటాయి. ఇది కూడా బరువు తగ్గడంలో సాయపడుతుంది.