What happened in Chhattisgarh? : చత్తీస్ గఢ్ లో ఏం జరిగింది?

చత్తీస్ గఢ్ (Chhattisgarh)లో భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ తిరిగి అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలూ చెప్పాయి.

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 12:27 PM IST

By: డా. ప్రసాదమూర్తి

What happened in Chhattisgarh? : రాజస్థాన్, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. రాజస్థాన్ ఛత్తీస్గడ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలు అందరి ఊహలని తారుమారు చేశాయి. ఫ్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అందించిన సమాచారానికి భిన్నంగా ఫలితాలు రావడంతో ఇక ఇప్పుడు ఏం జరిగింది అనే విషయం మీద కూలంకష పరిశోధనలు మొదలయ్యాయి.

చత్తీస్ గఢ్ (Chhattisgarh)లో భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ తిరిగి అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలూ చెప్పాయి. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తొలి దశలోనే తాము చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్లో విజయం సాధిస్తున్నామని, రాజస్థాన్లో గట్టి పోటీ ఉంటుందని, తెలంగాణలో గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు. చాలా సర్వే సంస్థలు కూడా చత్తీస్ గఢ్ (Chhattisgarh)లో కాంగ్రెస్ విజయం తథ్యమనే చెప్పాయి. వివిధ మీడియా సంస్థలు క్షేత్రస్థాయిలో జరిపిన సర్వేలు, నిర్వహించిన పబ్లిక్ టాక్స్, రాజకీయ నిపుణుల వ్యాసాలు, టీవీల్లో చర్చోపచర్చలు ఏం చూసినా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థాయిలో కాకున్నా ఒక మోస్తరు స్థాయిలోనైనా మెజారిటీ వస్తుందని అంచనా వ్యక్తమైంది. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి.

We’re Now on WhatsApp. Click to Join.

మొత్తం 90 సీట్లలో బిజెపి 54 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి 35 ఇతరులకు ఒకటి వచ్చాయి. ఎందుకు ఇలా జరిగిందనే దానిమీద చాలా రకాల శస్త్ర చికిత్సలు సాగుతున్నాయి. భూపేష్ బఘేల్ రైతులకు అనుకూలమైన విధానాలు అమలు చేస్తున్నారని, వారి పంటకు గిట్టుబాటు ధర అందించడంలో ఆయన సఫలమయ్యారని, ప్రజామోదం పొందిన పథకాలు అమలు చేస్తున్నారని, ఆయనకు ప్రజల పట్ల అత్యంత అధికమైన ఆదరణ ఉందని సర్వే సంస్థల ద్వారా మనకు అందిన సమాచారం. కానీ చాప కింద నీరులా అక్కడ జరిగింది ఏమిటి అనేది ఇప్పుడిప్పుడే విషయాలు బయటకు వస్తున్నాయి. చత్తీస్ గఢ్ (Chhattisgarh)లో గిరిజన ఓటర్లు కాంగ్రెస్ కి పూర్తి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నట్టు అర్థమవుతుంది. 2018 ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో, చత్తీస్గఢ్లో బిజెపి 76 ఎస్టీ సీట్లకు గాను 19 మాత్రమే పొందగలిగింది. ఈసారి ఆ సీట్లను 44 కు పెంచుకుంది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కార్డు ప్రయోగిస్తే గిరిజనులు ఆ పార్టీకి ఎదురు తిరిగారని తెలుస్తోంది. అంతేకాదు ఛత్తీస్ గఢ్ లో బిజెపి, క్రిస్టియన్ మిషనరీలు హిందూ గిరిజనుల మతమార్పిడులు చేస్తున్నాయి అన్న ప్రచారానికి ఊపునిచ్చింది.

సంఘ్ పరివార్ శక్తులు వనవాసి కళ్యాణ్ ఆశ్రమం పేరుతో సాగించిన ప్రచారం గిరిజనుల మీద చాలా ప్రభావం చూపించినట్టు కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ ఓబీసీ కార్డు ఆ పార్టీకి రివర్స్ అయినట్టుగా కూడా అర్థమవుతుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుర్మి సామాజిక వర్గానికి చెందిన ఓబీసీ వ్యక్తి. ఇక్కడ కూడా ఇతర బీసీ కులాలను కాంగ్రెస్కు దూరం చేసిన వైనం కూడా కనిపిస్తున్నట్టు పలువురి పరిశీలనలో అర్థమవుతుంది. అక్కడ బలమైన మరో ఓబీసీ కమ్యూనిటీ సాహు ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. అన్నిటికంటే ఎక్కువగా గిరిజనుల మతమార్పిడి విషయాన్ని బిజెపి బలంగా తీసుకురావడంతో ఆ పార్టీ వైపు గణనీయంగా ఆదివాసీ సముదాయం మొగ్గు చూపినట్టు అర్థమవుతుంది. మరో పక్క క్రిస్టియన్ ట్రైబల్స్ తమపై దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని కొంత ఆగ్రహంతో ఉన్నారు. అటూ ఇటూ కూడా గిరిజనులు అంతా కాంగ్రెస్కు పూర్తిస్థాయిలో దూరమైపోయినట్టు తెలుస్తుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం చాప కింద నీరులా చత్తీస్గఢ్లో జరుగుతున్న ఈ పోలరైజేషన్ ని పట్టించుకోలేదు. తమ పథకాలు, తమ పని, ముఖ్యమంత్రి క్లీన్ ఇమేజ్ మరోసారి తాము అధికారంలోకి రావడానికి ఉపయోగపడతాయని భావించారు. కానీ అదృశ్యంగా ఎన్నో శక్తులు అక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంతో ఆ పార్టీ పరాజయం పాలు కావడానికి దారి తీసింది. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పనితీరు పట్ల ప్రజలలో వ్యతిరేకత లేకున్నా, బిజెపి, ఆర్ఎస్ఎస్ సాగించిన మతమార్పిడుల హిందూత్వ కార్డు బలంగా పని చేసిందనే చెప్పాలి.

Also Read:  Mizoram election results: కొనసాగుతోన్న మిజోరాం ఎన్నికల కౌంటింగ్.. కాసేపట్లో ఫలితాలు