బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై దాడులు- భార‌త్ మౌనం వెనుక అస‌లు క‌థ‌!

బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. గ‌తంలో కూడా జ‌రిగాయి. అయితే, అప్ప‌ట్లో వెంట‌నే స్పందించిన భార‌త ప్ర‌భుత్వం ఇప్పుడు మౌనంగా ఉండ‌టానికి కార‌ణ‌మేంటి? అస‌లు దీని వెనుక తెలుసుకోవాల్సిన చ‌రిత్ర ఏమిటి? చ‌దవండి..

  • Written By:
  • Updated On - October 24, 2021 / 12:05 PM IST

బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై, హిందూ దేవుళ్ల‌పై దాడులు జ‌ర‌గ‌డం ఈ మ‌ధ్య కాలంలో స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. కోటికిపైగా హిందువులు ఉండ‌టంతో మ‌న‌దేశంలో బెంగాల్ త‌ర్వాత‌.. బంగ్లాదేశ్‌లోనే దుర్గాపూజ ఎంతో వైభ‌వంగా, అట్ట‌హాసంగా జ‌రుగుతుంది. దాదాపుగా దుర్గాపూజ అక్క‌డ అన‌ధికారిక జాతీయ పండుగ అనే చెప్పుకోవ‌చ్చు. ప్ర‌తీ ఏటా పండుగ ఎలా జ‌రుగుతుందో.. ఆ స‌మ‌యంలో హిందువుల‌పై దాడులు కూడా అక్క‌డ అంతే సాధార‌ణంగా మారిపోయాయి.

హిందూ దేవాల‌యం ద‌గ్గ‌ర్లో ఖురాన్ దొర‌క‌డం ఈ ఏడాది గొడ‌వ‌ల‌కు మ‌రింత ఆజ్యం పోసింది. ఒక్క‌మాట‌లో ఈ సంఘ‌ట‌న‌..రాడిక‌లిజాన్ని ఎంత ఈజీగా ప్రేరేపించ‌వ‌చ్చ‌నే విష‌యాన్ని తెలియ‌జెప్పిన‌ట్టు అయింది. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యుడితో పాటు దానితో సంబంధమున్న 500మందిని అరెస్ట్ చేశారు అక్క‌డి పోలీసులు. త్వ‌ర‌లో వారిపై చ‌ర్య‌లూ ఉంటాయని బంగ్లాదేశ్ హోం మంత్రి ఖాన్ క‌మ‌ల్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

మార్పుకు శ్రీకారం చుట్టిన షేక్ హ‌సీనా

ప్ర‌ధాని షేక్ హ‌సీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌.. 20 ఏళ్లుగా బంగ్లాదేశ్‌లో అధికారంలో కొన‌సాగుతోంది. హిందూవ్య‌తిరేక, ఇస్లామిక్ సంస్ధ‌ల‌తో మొద‌ట్నుంచి ఆమె పోరాటం చేస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్ స్వ‌తంత్ర‌పోరాటాన్ని ముందుండి న‌డిపించిన షేక్‌ముజీబుర్ రెహ్మాన్‌.. మొద‌ట్నుంచి దేశాన్ని ఇస్లామిక్ చ‌ట్టాల‌కు అనుగుణంగానే ఉంటూ లౌకిక ఉదార‌వాద దేశంగా చెప్తూ వ‌చ్చారు. అయితే, అనూహ్యంగా 1973లో దేశంలో క్షామం రావ‌డం, ముజీబ్‌., అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌ను మిల‌ట‌రీ అధికారులు కాల్చివేయ‌డంతో.. 1975 నవంబరు 7లో దేశంలో సైనికాధికారం వచ్చింది. అప్ప‌ట్నుంచి దేశంలో లౌకికవాదం అనే ప‌ద‌మే వినిపించ‌కుండా పోయింది.

కొంత‌కాలం పాటు లౌకిక‌వాదం జాడ లేకుండా ఇస్లామాబాద్ ఆదేశాలు, చ‌ట్టాల మేర‌కే కొత్త దేశం న‌డ‌ప‌బ‌డుతుంద‌నే అభిప్రాయం అక్కడి ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌యింది. అయితే, బంగ్లాదేశ్ నేష‌న‌లిస్ట్ పార్టీ ఈ అభిప్రాయాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ ఇస్లామిక్ భావాల‌ను అతిజాగ్ర‌త్త‌గా అమ‌లుచేస్తూ దాన్ని అవామీలీగ్‌కు వ్య‌తిరేకంగా పొలిటిక‌ల్ టూల్‌గా వాడుకోవ‌డంలో స‌క్సెస్ సాధించింది. అదే స‌మ‌యంలో కొన్ని గ్రామాల్లోని హిందువుల‌ను చంప‌డం, దేవాల‌యాల‌ను ధ్వంసం చేయ‌డం, మైనార్టీల‌పై దాడులు జ‌ర‌గ‌డంలాంటి ఎన్నో సంఘ‌ట‌న‌లు దేశంలో ఇస్లామిక్ గ్రూపుల ఆధిప‌త్యాన్ని బయ‌ట‌పెట్టాయి. ఈ ప‌రిస్ధితే త‌ర్వాత త‌ర్వాత దేశంలో శాంతిభ‌ద్ర‌త‌లు చేజారిపోయే వ‌ర‌కు వెళ్లింది. ఎంత‌గా అంటే ఒకానొక స‌మ‌యంలో పాకిస్తాన్‌లోని ఐఎస్ఐ స‌హ‌కారంతో ఈశాన్య స‌రిహ‌ద్దులో భార‌త్‌కు వ్య‌తిరేకంగా స్లీప‌ర్‌సెల్స్ కూడా ఏర్పాట‌య్యేంత‌.

అయితే, షేక్ హ‌సీనా ప్ర‌భుత్వం ఒక‌వైపు సొంత దేశంలోని హిందువుల‌కు, మ‌రోవైపు వారికోసం పోరాడుతున్న భార‌త్‌కు వ‌రంలా మారింది. దేశంలోని హిందూ ఓటుబ్యాంకును కాపాడుకుంటూనే పొలిటిక‌ల్‌గా స‌ర్వైవ్ అవ్వ‌డానికి అవామీ లీగ్ ఇస్లామిక్ తీవ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా పెద్ద పోరాటమే చేసింది.

చాలాకాలం త‌ర్వాత మ‌ళ్లీ యాక్టివ్ అయిన రాడిక‌ల్ మూక‌లు

ఈ మ‌ధ్య‌కాలంలో దేశ రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో మార్పులు రావాల‌నే డిమాండ్‌తో ఇస్లామిక్ రాడిక‌ల్ గ్రూపులు హ‌సీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌పై ఒత్తిడి తీసుకువ‌స్తున్నాయి. కొంత‌కాలం క్రితం ప్ర‌ధాని మోదీ బంగ్లాదేశ్ వెళ్లిన స‌మ‌యంలో కూడా ఢాకాలో విప‌రీత‌మైన ఆందోళ‌న‌లు జ‌రిగాయి. ఈ ఆందోళ‌న‌ల‌కు నాయ‌క‌త్వం వహించిన‌ హ‌ఫీజ‌త్ ఈ ఇస్లామ్ అనే రాడిక‌ల్ సంస్ధ 13 పాయింట్ల‌తో షేక్ హ‌సీనా ప్ర‌భుత్వానికి ఒక డిమాండ్ ప‌త్రం అందించింది.

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ దేశాల్లో ఇస్లామిక్ టెర్ర‌రిజాన్ని ప్రోత్స‌హిస్తున్న తెహ్రీక్ ఈ ల‌బ్బైక్ అనే సంస్ధ‌కు, హ‌ఫీజ‌త్ ఈ ఇస్లామ్ సంస్ధ‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయ‌న్న‌ది అంద‌రికీ తెలిసిన‌ వాస్త‌వ‌మే. ఈ నేప‌ధ్యంలోనే బంగ్లాదేశ్‌లో లైకిక‌వాదం జాడ క్ర‌మంగా క‌నుమ‌రుగ‌వుతున్న‌ది. 2017లో నాన్ ముస్లిమ్స్‌(హిందువులు) రాసిన 17 ప‌ద్యాలు, క‌థ‌ల‌ను పాఠ్యాంశాల నుంచి ప్ర‌భుత్వం తొల‌గించాల్సి వ‌చ్చింది. దేశ అత్యున్న‌త న్యాయ‌స్ధానం ముందు ఉన్న ఒక మ‌హిళ విగ్ర‌హాన్ని కూడ ఇస్లామ్‌కు వ్య‌తిరేక‌మంటూ తొల‌గించారు.

ప‌రిస్ధితుల‌ను అంచ‌నా వేసి ఢాకాతో జాగ్ర‌త్త‌గా డీల్ చేస్తున్న భార‌త్‌

హిందువుల‌పై, హిందూ దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల విష‌యంలో ఈ సారి భార‌త్ మాత్రం ఆచితూచి అడుగేస్తోంది. చాలామంది బిజేపీ నాయ‌కులు ట్విట్ట‌ర్‌లో, త‌మ వ్య‌క్తిగ‌త మాధ్య‌మాల్లో దీనిపై స్పందిస్తున్న‌ప్ప‌టికీ కూడా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఇప్ప‌టివ‌ర‌కు దీనిపై ఒక స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు. బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనాతో దేశానికి ఉన్న స‌న్నిహిత సంబంధాలే ఇందుకు కార‌ణ‌మ‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం.

అయితే, ఇస్లామిక్ టెర్ర‌రిజాన్ని ఎదుర్కోవ‌డంలో హ‌సీనా ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం భార‌త్‌కు ఎంతైనా ఉంది. స‌రిహ‌ద్దుల్లో రోజురోజుకీ పేట్రేగిపోతున్న ఉగ్ర‌వాదం, టెర్ర‌ర్ ఫైనాన్సింగ్‌, డ్ర‌గ్స్‌, మ‌నుషుల అక్ర‌మ‌ర‌వాణాలాంటి అంశాల‌పై రెండు దేశాలు ఒక స‌మగ్ర‌మైన పోరాట‌విధానాన్ని రూపొందించాలి.

– KP