Jamili Elections : `జ‌మిలి ` ఎన్నిక‌ల‌ టైమ్ ఇదే!

`ఒకే దేశం ఒకే ఎన్నిక‌` నినాదం ఇంకా బ‌తికే ఉంద‌ని పార్ల‌మెంట్ వేదిక‌గా రుజువు అయింది. నోట్ల ర‌ద్దు, జీఎస్టీ, క‌రోనా లాక్ డౌన్ , ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, సీఏఏ త‌ర‌హాలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు ష‌డ‌న్ గా ముహూర్తం పెడ‌తార‌ని టాక్.

  • Written By:
  • Publish Date - July 23, 2022 / 03:00 PM IST

`ఒకే దేశం ఒకే ఎన్నిక‌` నినాదం ఇంకా బ‌తికే ఉంద‌ని పార్ల‌మెంట్ వేదిక‌గా రుజువు అయింది. నోట్ల ర‌ద్దు, జీఎస్టీ, క‌రోనా లాక్ డౌన్ , ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, సీఏఏ త‌ర‌హాలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు ష‌డ‌న్ గా ముహూర్తం పెడ‌తార‌ని టాక్. అందుకు నిద‌ర్శ‌నంగా పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిరెన్ రిజిజ చెప్పిన మాట‌లు నిలుస్తున్నాయి. లోక్​సభలో ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు ఆ మేరకు ఆయ‌న లిఖితపూర్వక సమాధానం ఇవ్వ‌డం మ‌రోసారి జ‌మిలి వ్య‌వ‌హారం భార‌త ఎన్నిక‌ల తెర‌మీద‌కు వ‌చ్చింది.

వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తోన్న ఎన్నిక‌ల సంఘం జ‌మిలికీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం క‌ష్ట‌మే. కానీ, న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఉభ‌య స‌భ‌ల్లో బ‌లంగా ఉంది. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక కూడా ముగిసింది. బీజేపీకి వెన్నుముక‌గా ఉంటోన్న ఆర్ఎస్ఎస్ కూడా `ఒన్ నేష‌న్ ఒన ఎల‌క్ష‌న్` అనే నినాదాన్ని వినిపిస్తోంది. ఆ క్ర‌మంలో మోడీర సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకునే ఛాన్స్ లేక‌పోలేద‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోన్న మాట‌. తొలి నుంచి ప్రాంతీయ పార్టీల హ‌వాను బీజేపీ వ్య‌తిరేకిస్తోంది. జాతీయ‌వాదానికి ప్రాంతీయ పార్టీలు న‌ష్ట‌చేస్తాయ‌న్న భావ‌న ఆ పార్టీలో తొలి నుంచి ఉన్న భావ‌న‌. అందుకే, ప్రాంతీయ పార్టీలను బ‌ల‌హీనం చేయాలంటే ఒకే ఎన్నిక ను పెట్ట‌డం మార్గంగా అంచ‌నా వేస్తోంది.

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇప్పటివరకు 1952 నుంచి 1967 మధ్యలో నాలుగు సార్లు దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి.1951 నుంచి 1967 వరకు లోక్‌సభకు. శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1968లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం రద్దయింది. 1969లో బీహార్‌, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలు రద్దయ్యాయి. దీంతో ఆ రాష్ర్టాల అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలు జరపవలసి వచ్చింది. 1971లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. దీంతో ఏడాది పొడవునా దేశంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరగడం మొదలైంది. దీంతో జమిలి ఎన్నికల అంశం కనుమరుగు అయ్యింది. కేంద్రంలో ఎన్డీయే రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మళ్లీ జమిలి ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీనిపై చర్చించడానికి 2019 జూన్‌లో ప్రధాని మోదీ అన్ని పార్టీలతో సమావేశం నిర్వ‌హించారు. మొత్తం 40 రాజకీయపార్టీలను ఆహ్వానిస్తే, 21 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కొన్ని పార్టీలు ఈ ప్రతిపాదనకు స్వాగతం పలికితే, మరికొన్ని వ్యతిరేకించాయి. బీజేపీ వంటి జాతీయపార్టీలకు ఈ ప్రతిపాదన లాభమనీ, ప్రాంతీయ పార్టీలకు నష్టమనే వాదనలు వచ్చాయి. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటుచేయాలని అఖిలపక్ష సమావేశం ఆనాడు తీర్మానం చేసింది.

ఎన్నికల సంస్కరణలకు సంబంధించి 1999లో ‘లా కమిషన్‌’ ఇచ్చిన నివేదికలో జమిలి ఎన్నికల ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తమైంది. ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల బోలెడన్ని లాభాలున్నాయని పేర్కొంది. ప్రభుత్వానికి కొన్ని వందల కోట్లు ఆదా అవుతాయని, ఈ మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే మంచి పనులకు ఉపయోగించుకోవచ్చునని పేర్కొన్నది. అలాగే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయన్నది. ఎన్నికల కోసం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించాలి. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఈ ప్రయాస తప్పుతుందని న్యాయ కమిషన్‌ సూచన చేసింది.

కానీ, జమిలి ఎన్నికల ప్రక్రియ అమల్లోకి రావడానికి అనేక అవరోధాలున్నాయి. కొన్ని అసెంబ్లీల కాల పరిమితిని పొడిగించాల్సి ఉంటుంది. మరికొన్ని అసెంబ్లీల కాల పరిమితిని అవసరాలకు తగ్గట్టు కుదించాల్సి ఉంటుంది. ఇది చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. దీనికి పార్లమెంటులో మూడొంతుల మెజారిటీ, అలాగే మొత్తం రాష్ర్టాల్లో సగం రాష్ర్టాల ఆమోదం తప్పనిసరి. దేశమంతా ఎన్నికలంటే అందుకు తగ్గట్టు పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను సమకూర్చుకోవాలి. ఓటు పడిందా, లేదా అనేది తెలుసుకోవడానికి ‘వోటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌’ యంత్రాలను సమకూర్చుకోవాలి. వీటికి రూ.9284 కోట్లు ఖర్చవుతాయన్నది 2015 నాటి అంచనా. పదిహేనేండ్లకోసారి ఈ యంత్రాలను మార్చాలి. ప్రతి మూడు ఎన్నికల తర్వాత ‘వోటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌’ యంత్రాలను కొత్తగా కొనుక్కోవాలి. ఇంత పెద్దమొత్తంలో ధనాన్ని ఎన్నికల పేరిట ఖర్చుపెట్టడం సమంజసమా అనే ప్రశ్న తలెత్తుతున్నది.

జమిలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ కొన్ని సూచనలు చేసింది. లోక్‌సభ కాలపరిమితి ప్రారంభమయ్యే తేదీ, అలాగే ముగిసే తేదీలను ముందుగానే నిర్ణయించుకోవాలన్నది ప్రధాన సూచన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే.. వాళ్లే ఆ తర్వాత ప్రధానిగా ఎవరుంటారో చెప్తూ వారి పేరిట విశ్వాస తీర్మానం పెట్టాలి. ఈ రెండు తీర్మానాలపై సభలో ఒకేసారి ఓటింగ్‌ జరగాలి. రాష్ర్టాల శాసనసభలకూ ఇదే విధానం వర్తింపజేయాలన్నది మరో సూచన. దీనిపై ఎన్డీఏ కూటమితో చర్చించామని తెలిపింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొన్ని మార్పులు చేసిందని, వాటిని లాకమిషన్‌ పరిశీలిస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. త్వరలో ఎన్నికల సాధ్యాసాధ్యాలపై లా కమిషన్‌ నుంచి క్లారిటీ రానుంది. వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని, 2014 నుంచి ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని పార్లమెంట్‌లో తాజాగా వివరించింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నిస్తే జమిలి ఎన్నికల దిశ‌గా మోడీ స‌ర్కార్ అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. పార్లమెంట్‌తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని స్పష్టం చేసింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఈసీతో చర్చించామని వెల్లడించింది. రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన మోజార్టీ ఉభ‌య స‌భ‌ల్లోనూ, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ బీజేపీకి బ‌లం ఉంది. ఫ‌లితంగా జ‌మిలి ఎన్నిక‌ల‌కు మోడీ అక‌స్మాత్తుగా ముహూర్తం పెట్టే అవ‌కాశం ఉంద‌ని శుక్ర‌వారం రోజున లోక్ స‌భ వేదిక‌గా న్యాయ‌శాఖ మంత్రి చెప్పిన మాట‌ల ఆధారంగా స్ప‌ష్టం అవుతోంది.