Delhi Politics : ఢిల్లీలో తెలుగు నేత‌ల‌కు భంగ‌పాటు!

ఢిల్లీ పెద్ద‌ల అపాయిట్మెంట్ కోసం వెళ్లి భంగ‌ప‌డ్డ జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, ప‌వ‌న్ జాబితాలో ఇప్పుడు కేసీఆర్ కూడా చేరాడు

  • Written By:
  • Updated On - November 25, 2021 / 02:51 PM IST

ఢిల్లీ పెద్ద‌ల అపాయిట్మెంట్ కోసం వెళ్లి భంగ‌ప‌డ్డ జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, ప‌వ‌న్ జాబితాలో ఇప్పుడు కేసీఆర్ కూడా చేరాడు. రెండు రోజులు పాటు ప్ర‌ధాని మోడీని క‌ల‌వ‌డానికి హ‌స్తిన‌లో టీఆర్ఎస్ చీఫ్ ప‌డిగాపులు కాచాడు. ప‌లు మార్గాల ద్వారా లైజ‌నింగ్ చేశాడ‌ట‌. కానీ, మోడీ అపాయిట్మెంట్ ల‌భించ‌క‌పోవ‌డంతో ఆయ‌న వెనుతిరిగి వచ్చాడు. ఇదే అంశాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లి పొలిటికల్ ఇష్యూ చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నాడ‌ని తెలిసింది. ఢిల్లీలో భంగ‌ప‌డిన మిగిలిన లీడ‌ర్ల మాదిరిగా కాకుండా కేసీఆర్ అంటే ఏమిటో ఢిల్లీ బీజేపీ నేత‌ల‌కు రుచి చూపించ‌డానికి సిద్దం అవుతున్నాడ‌ని గులాబీ శ్రేణుల్లోని టాక్‌.

తెలంగాణ‌లోని వ‌రి ధాన్యం కొనుగోలు అంశం రాష్ట్ర వాప్తంగా రాజ‌కీయాన్ని సంత‌రించుకుంది. పోటాపోటీగా బీజేపీ, టీఆర్ఎస్ ధ‌ర్నాల‌కు దిగిన విష‌యం విదిత‌మే. ధాన్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేయ‌డంలేద‌ని తెలంగాణ స‌ర్కార్ బ‌ద్నాం చేసింది. బాయిల్డ్ రైస్ మిన‌హా మిగిలిన బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేయ‌డానికి సిద్ధంగా ఉంద‌ని బీజేపీ తెలంగాణ‌శాఖ చెబుతోంది. ఆ విధంగా కేంద్రం ఎందుకు నిర్ణ‌యం తీసుకుందో కూడా వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకు భిన్నంగా టీఆర్ఎస్ మాత్రం కేంద్ర సర్కార్ ధాన్యం కొనుగోలు చేయ‌లేమ‌ని చెప్పింద‌ని రైతుల‌కు విడ‌మ‌రిచి చెబుతోంది. అందుకే, వ‌రి పంట వేయొద్ద‌ని కేసీఆర్ స‌ర్కార్ రైతుల‌ను ఆదేశిస్తోంది.కేంద్రం యాసంగి, వ‌చ్చే ఖ‌రీఫ్ సీజ‌న్లో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తుందో..చెప్పాల‌ని ప్ర‌ధానంగా కేసీఆర్ డిమాండ్ చేస్తున్నాడు. అక్క‌డ నుంచి వ‌చ్చే స‌మాధానం త‌రువాత వ‌రి పంట విస్తీర్ణం నిర్ణ‌యించాల‌ని భావిస్తున్నాడు. కానీ, కేంద్రం నుంచి ఎలాంటి సంకేతం లేక‌పోవ‌డంతో నేరుగా ప్ర‌ధాన మంత్రిని క‌లిసి తాడోపేడో తేల్చుకోవాల‌ని సీఎం ఢిల్లీ వెళ్లాడు. రెండు రోజుల పాటు ప్ర‌ధాని మోడీ అపాయిట్మెంట్ కోసం ప్ర‌య‌త్నం చేసి విఫ‌లం అయ్యాడు.

కేసీఆర్ భంగ‌ప‌డిన‌ట్టే, ఇటీవ‌ల చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి వెనుతిరిగి వ‌చ్చాడు. వైసీపీ క్యాడ‌ర్ కు బీపీ పెర‌గ‌డంతో టీడీపీ కార్యాల‌యాల మీద దాడుల‌కు దిగిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆ సంద‌ర్బంగా గ‌వ‌ర్న‌ర్ కు, రాష్ట్ర‌ప‌తికి జ‌రిగిన దాడుల గురించి టీడీపీ ఫిర్యాదు చేసింది. జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు తీసుకెళ్లాల‌ని బాబు భావించాడు. అందుకే, ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను క‌లిసి మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నం చేశాడు. రెండు రోజుల పాటు హ‌స్తిన‌లో ప‌లు మార్గాల ద్వారా షాను క‌లిసేందుకు లైజ‌నింగ్ చేసి విఫ‌లం అయ్యాడు. చంద్ర‌బాబు ప‌డిన భంగ‌పాటుపై ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌లు గుప్పించారు.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ప‌లు మార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను క‌లవ‌డానికి ప్ర‌య‌త్నం చేశాడు. ముఖ్య‌మంత్రి హోదాలో వెళ్లిన‌ప్ప‌టికీ షా అపాయిట్మెంట్ ల‌భించ‌క‌పోవ‌డంతో రెండుసార్లు జ‌గ‌న్ భంగ‌ప‌డ్డాడు. ఆ త‌రువాత ప‌లు మార్గాల ద్వారా లైజ‌నింగ్ చేయ‌డంతో ఒక‌సారి మాత్ర‌మే షా అపాయిట్మెంట్ ఆయ‌న‌కు ల‌భించింది. ద‌క్షిణ భార‌త రాష్ట్రాల స‌దస్సు సంద‌ర్భంగా మాత్ర‌మే షాతో మాట్లాడే అవ‌కాశం జ‌గ‌న్ కు ల‌భించింది.

బీజేపీతో పొత్తుపెట్టుకుని వెళుతోన్న జ‌న‌సేనాని ప‌వ‌న్ కు కూడా ఢిల్లీ పెద్ద‌ల నుంచి భంగ‌పాటు ఎదురైన సంద‌ర్భాలు అనేకం. కేవ‌లం బీజేపీ అధ్య‌క్షుడు నడ్డాను మాత్ర‌మే క‌లుసుకుని వెనుతిరిగిన అనుభ‌వాలు ప‌వ‌న్ కు తెలుసు. ప‌లుమార్లు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, మోడీని క‌ల‌వాల‌ని భావించాడు. కానీ, ప‌వ‌న్ కు ముఖాముఖి క‌లిసేందుకు అవ‌కాశం ల‌భించ‌లేద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇలా తెలుగు రాష్ట్రాల సీఎంలు , వివిధ పార్టీల‌కు చెందిన అధిప‌తులు ఢిల్లీ పెద్ద‌ల అపాయిట్మెంట్ విష‌యంలో త‌ర‌చూ భంగ‌ప‌డుతూనే ఉన్నారు. తాజాగా కేసీఆర్ మాత్రం ఢిల్లీ పెద్ద‌ల మెడ‌ల వంచ‌డానికి క్షేత్ర‌స్థాయి రాజ‌కీయానికి బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నాడ‌ట‌. తెలుగోడి ఆత్మ‌గౌర‌వం అంటే ఎన్టీఆర్ శిష్యునిగా కేసీఆర్ ఢిల్లీ పెద్ద‌ల‌కు ఎలా రుచి చూపిస్తాడో..చూద్దాం!