Mallikarjun Kharge: “ఇండియా” కూటమికి ఖర్గే సారథ్యం

దేశంలో రాజకీయాలు క్రమక్రమంగా ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకుంటున్నాయి. ప్రతిపక్షాల ఇండియా కూటమికి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఎన్నుకోవడంతో ఈ స్పష్టతకు ఒక సంపూర్ణత వచ్చింది.

డా. ప్రసాదమూర్తి

Mallikarjun Kharge: దేశంలో రాజకీయాలు క్రమక్రమంగా ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకుంటున్నాయి. ప్రతిపక్షాల ఇండియా కూటమికి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఎన్నుకోవడంతో ఈ స్పష్టతకు ఒక సంపూర్ణత వచ్చింది. శనివారం నాడు ప్రతిపక్ష పార్టీలు జరిపిన వర్చువల్ మీటింగ్ లో ప్రతిపక్ష కూటమికి సారథ్యం వహించడానికి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను ఎన్నుకున్నారు. సాధారణంగా వివిధ పార్టీల ఐక్య కూటమికి పార్లమెంటులో అధిక స్థానాలు ఉన్న పార్టీ అధినేతలే సారథ్యం వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమే కాదు, దేశంలో అనేక చోట్ల అధికార బీజేపీని ఏకైక ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది.

దాదాపు 200 స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి, బిజెపికి మధ్య డైరెక్ట్ ఫైట్ ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికే ఇండియా కూటమి సారథ్యం బాధ్యతను అప్పగించడం సమంజసమే అని అనుకోవాలి. ఇంతకుముందే ప్రధాని అభ్యర్థిగా ప్రతిపక్షాల తరఫున మల్లికార్జున ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రతిపాదించారు. అయితే ప్రతిపక్షాల కూటమికి అధ్యక్షత వహించే నాయకుడే ప్రతిపక్షాల తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉండాలన్న నియమం లేదు. తనని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ కొందరు చేసిన సూచనలను మల్లికార్జున ఖర్గే సన్నితంగా పక్కన పెట్టారు. ఐక్యంగా పోటీ చేయడం, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని సమైక్యంగా ఎదుర్కోవడం, వివిధ రాష్ట్రాలలో బలాబలాలకు అనుగుణంగా ప్రతిపక్షాల మధ్య సీట్ల ఒప్పందంలో ఒక అంగీకారానికి రావడం, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక ఉమ్మడి ఎజెండా మీద కలవడం అనేవి కీలకమైన అంశాలని, ఎన్నికల అనంతరం ప్రతిపక్ష పార్టీల కూటమి సాధించే సీట్లను బట్టి ప్రధాని అభ్యర్థి ఎవరు అనేది నిర్ణయించుకోవడం జరుగుతుందని, అప్పటివరకు ఆ ప్రతిపాదనను పక్కన పెట్టడమే మంచిదని మల్లికార్జున ఖర్గే లాంటి పెద్దలు చెప్పడం వారి హుందాతనాన్ని సూచిస్తుంది.

ఇప్పుడు ప్రతిపక్ష ఇండియా కూటమికి ఖర్గే సారథ్యం వహించాలని ప్రతిపక్షాలు కలిసి నిర్ణయించడం ప్రతిపక్షాల మధ్య ఒక కీలకమైన, అత్యంత ముఖ్యమైన విషయంలో సయోధ్య కుదిరినట్టుగా అర్థమవుతుంది. కాకపోతే విపక్షాల కూటమికి కన్వీనర్ గా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరును పలువురు నాయకులు ప్రతిపాదించగా, ఆయన దాని పట్ల తన సుముఖత గాని విముఖత గాని వ్యక్తం చేయలేదు. తనను ప్రధాని అభ్యర్థిగా ఎవరూ ప్రతిపాదించకపోవడం పట్ల నితీష్ కుమార్ కినుక వహించినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే మల్లికార్జున ఖర్గే విషయంలో నితీష్ కుమార్ కు కూడా ఎలాంటి భిన్నాభిప్రాయం లేనట్లు శనివారం జరిగిన మీటింగ్ లో అర్థమైంది. ఇక ప్రధానమంత్రి అభ్యర్థి విషయాన్ని పక్కనపెట్టి, ప్రతిపక్షాలు ఎన్నికల ఎజెండాను తీర్చిదిద్దుకోవడంలో, ఎన్నికల కోసం తమ మధ్య బలమైన ఐక్యతను సాధించడంలో, బిజెపి అనుసరిస్తున్న విభజన విద్వేష రాజకీయాలను తిప్పి కొట్టడానికి సరైన విధానాన్ని అనుసరించడంలో తలమునకలు కావాల్సి ఉంది.
మోడీ వర్సెస్ ఖర్గే:

దశాబ్దాల రాజకీయ అనుభవం, నిజాయితీ, చిత్తశుద్ధి గల నాయకునిగా మంచి పేరు, దళిత బహుజన నేపథ్యం ఉన్న మల్లికార్జున ఖర్గే ప్రతిపక్షాల అధ్యక్షునిగా మోడీని ఢీకొంటారు. ఒక పక్క బిజెపి మత రాజకీయాలు ఎన్ని చేస్తున్నప్పటికీ, తమ నాయకుడు మోడీని ఢీకొనే శక్తి ప్రతిపక్షాలలో ఎవరికి లేదని ప్రచారం సాగించుకుంటున్న నేపథ్యంలో విపక్ష కూటమి ఖర్గేని బరిలోకి దింపడం బిజెపి వర్గాలకు కొంత కలవరం కలిగించే విషయమే. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే భారత జోడో యాత్ర నిర్వహించి తన ఇమేజ్ గణనీయంగా ఎంచుకున్నారు. అలాగే బిజెపి భావిస్తున్న రామ మందిరం రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించారు. రాహుల్ గాంధీ ఎంతో చిత్తశుద్ధితో, నిజాయితీతో ఈ యాత్రను చేస్తూ ఆసేతు హిమాచలాన్ని చుట్టి వివిధ ప్రాంతాల వర్గాల భాషల ప్రజలతో తన రాజకీయ అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా గాంధీని మోడీకి ప్రత్యామ్నాయంగా దింపడానికి కాంగ్రెస్ పార్టీ మాట అటుంచి, ప్రతిపక్షాలలో ఎవరికీ సానుకూలత లేదు. నరేంద్ర మోడీ లాంటి మేరు పర్వతాన్ని ఢీకొనడానికి రాహుల్ గాంధీని బరిలోకి దింపితే మోడీ విజయానికి మార్గం సుగమం చేసినట్టే అవుతుందని ప్రతిపక్షాల భావన. అదీకాక రాహుల్ గాంధీని మోడీకి ప్రత్యర్థిగా రంగంలోకి దింపితే అతని కుటుంబ వారసత్వాన్ని తమ రాజకీయాస్త్రంగా బిజెపి వారు మలుచుకొనే అవకాశం ఉంది. అందుకే దశాబ్దాల అనుభవం, మచ్చలేని వ్యక్తిత్వం, సామాజిక నేపథ్యం ఉన్న మల్లికార్జున ఖర్గేని ప్రతిపక్షాలు రంగంలోకి దింపుతున్నాయి.

బిజెపి వారు బీసీ కార్డు తీస్తే, ప్రతిపక్షాలు ఖర్గే పేరుమీద ఎస్సీ కార్డును ముందుకు తీసుకొచ్చినట్టు అవుతుంది. అంతేకాదు భారత రాజకీయాలు ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య ఒక వైరుధ్యాన్ని, నిత్య సంఘర్షణను కొనసాగిస్తున్న నేపథ్యంలో దక్షిణాది నాయకుడైన ఖర్గేని రంగంలోకి దించడం కూడా ప్రతిపక్షాల మెరుగైన వ్యూహంలో భాగంగానే భావించాలి. జయప్రజయాల మాట ఎలా ఉన్నా, బిజెపి ఎన్ డి ఏ కూటమికి నరేంద్ర మోడీ నాయకుడు అయితే, ప్రతిపక్షాల ఇండియా కూటమికి మల్లికార్జున ఖర్గే నాయకుడు కావడం ఇద్దరు సమఉజ్జీల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని భావించాలి. విపక్షాల కూటమికి ఖర్గే సారథ్యం వహించడం ఖరారు అయిన తర్వాత, మోడీ వర్సెస్ ఖర్గే అనే ఒక విభజన రేఖ స్పష్టపడింది. ఇక ఎన్ డి ఏ కూటమికి ఇండియా కూటమికి మధ్య పోటీ ఇతర అంశాల మీద ఉంటుంది. ఎవరి ఎజెండా ఏమిటి, ఎవరి బలాబలాలు ఏమిటి, అనేవి రానున్న రోజుల్లో తేలిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు మధ్య సీట్ షేరింగ్ వ్యవహారం తేలాల్సి ఉంది. ఈ విషయంలో ప్రతిపక్షాల మధ్య ఒక ఒప్పందం కుదిరితే అది రెండవ అడ్వాంటేజ్ గా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను, ఆయా రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలను సానుకూలంగా పరిష్కరించుకొని ప్రతిపక్షాలు ఎంత ముందుకు వెళితే వారికి ప్రజల్లో అంత అనుకూలమైన స్పందన లభిస్తుంది. లేకుంటే ప్రతిపక్షాల కూటమి ఒక కప్పల తక్కెడగా మారి బిజెపి విజయం నల్లేరుపై బండి నడకగా మారిపోతుంది.

Also Read: Chiranjeevi: మెగాస్టార్ కు ప్రత్యేక అభినందనలు తెలిపిన మోహన్ బాబు.. నెట్టింట ట్వీట్ వైరల్?