Site icon HashtagU Telugu

Internet Restoration in Manipur : మణిపూర్ లో ఇంటర్నెట్ పునరుద్ధరణ

Internet Restoration In Manipur

Internet Restoration In Manipur

By: డా. ప్రసాదమూర్తి

Internet Restoration in Manipur : మణిపూర్ లో చెలరేగిన జాతుల విధ్వంసకాండ దేశాన్ని కుదిపేసింది. ఐదు నెలలుగా మణిపూర్ లోని మైతేయి, కుకీజాతుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం యుద్ధంగా మారి ప్రళయ బీభత్సాన్ని సృష్టించింది. ఈ హింసాకాండ, ఆగని ఈ విధ్వంసకాండ సెగ ఢిల్లీలోని పెద్దల గద్దెలకు కూడా తగిలింది. ప్రతిపక్షాలు మణిపూర్ (Manipur) అల్లర్లను అస్త్రంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన తీవ్రమైన దాడి కొనసాగించారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న బిజెపి ప్రభుత్వానికి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అంతేకాదు ఈ ఐదు నెలల కాలంలో అనేక రకాల విధ్వంసం విలయతాండవం చేసింది. మైతేయి సముదాయం చేతిలో కుకీ జాతి ప్రజలు హత్యలకు గురయ్యారు. లక్షలాదిగా నిర్వాసితులయ్యారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేసి శరణార్థి శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో జరిగిన ఘటనలు దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా కుదిపేశాయి. అయితే మణిపూర్ (Manipur) హింసతో ఏలిన వారికి చీమకుట్టినట్టు కూడా కాలేదు. ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించి అక్కడ ప్రజల్ని పరామర్శించలేదు. హోం మంత్రి అమిత్ షా వెళ్లినా మణిపూర్ మంటలు చల్లారిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడకు వెళ్ళినప్పుడు ఆయన్ని అడ్డుకున్నారు. అయినా సరే రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్లి, మణిపూర్ మంటల్లో దగ్ధమైన జీవితాలను మోసుకుంటూ కృంగిపోతున్న వారిని పరామర్శించి వచ్చాడు. అందరిదీ ఒకటే మాట. మణిపూర్లో శాంతి భద్రతలు పునరుద్ధరించాలి. అంటే అక్కడి బిజెపి ప్రభుత్వం కొనసాగకూడదు. తక్షణం అక్కడున్న బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. ఈ విషయాన్ని కేంద్రం పట్టించుకోలేదు. సరి కదా మణిపూర్లో ఏం జరుగుతుందో లోకానికి తెలియకుండా ఉండడం కోసం అక్కడ ఇంటర్నెట్ బ్యాన్ చేశారు. సెప్టెంబర్ 23 తేదీన ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు.

దాదాపు 5 నెలల పాటు మణిపూర్లో (Manipur) ఇంటర్నెట్ నిషేధం అమలులో ఉంది. అక్కడ ఏం జరుగుతుందో.. ఎవరు ఏ అమానుషత్వానికి, ఏ అరాచకానికి బలవుతున్నారో.. బయట ప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ జాగ్రత్తల్లో ఇంటర్నెట్ బందు ఒకటి. మణిపూర్ లో జరుగుతున్నటువంటి విషయాన్ని వక్రీకరించి, బయట ప్రపంచానికి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడానికి ఇంటర్నెట్ ను కొందరు దుర్వినియోగం చేసుకుంటారని, అందుకే తాము ఇంటర్నెట్ ని బంద్ చేశామని ప్రభుత్వం చెబుతుంది.

ఉదాహరణకు కుకీ మహిళలు కొందరిని నగ్నంగా ఊరేగించి మైతేయి సముదాయం క్రూరంగా ప్రవర్తించిన ఘోర ఆటవిక చర్య బయట ప్రపంచానికి చాన్నాళ్లకు తెలిసింది. ఇది దేశాన్ని మొత్తం దావానలంలా చుట్టేసింది. ఈ ఘటన మే 4వ తేదీన జరిగితే జూలై మూడో వారంలో గాని సోషల్ మీడియాలో వెలుగు చూడలేదు. ఇది కేవలం ఒక ఘటన మాత్రమే ఇలాంటి వందలాది వేలాది ఘటనలు అక్కడ జరుగుతున్నాయి. ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ఆ వివరాలు బయటి వారికి తెలియడం లేదు. కాబట్టి మణిపూర్ (Manipur) లో ఇంటర్నెట్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని ఎన్నో స్వచ్ఛంద సంస్థలు మణిపూర్ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎవరు ఏం గొడవ చేసినా, ఎంత అరిచి గీపెట్టినా కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఈ విషయంలో తొణకలేదు బెణక లేదు. ఇంటర్నెట్ నిషేధం సుదీర్ఘంగా మణిపూర్లో కొనసాగింది.

దేశంలో ఇంటర్నెట్ నిషేధం ఇంత దీర్ఘకాలం కొనసాగింది మణిపూర్లోనేనని చెబుతున్నారు. ఎట్టకేలకు ఐదు నెలలుగా మణిపూర్లో (Manipur) కొనసాగుతున్న ఇంటర్నెట్ సేవల నిషేధం ఎత్తివేస్తున్నట్టు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించడం ఆ రాష్ట్ర ప్రజలకే కాదు, దేశవ్యాప్తంగా సత్యాన్వేషకులకు కొంత ఊరట కలిగించింది. కేవలం మణిపూర్ లోనే కాదు ఎక్కడ అల్లర్లు చెలరేగినా విధ్వంసాలు పెచ్చరిల్లినా, ప్రభుత్వం తీసుకునే మొదటి చర్య ఇంటర్నెట్ నిషేధం. ఇది ఇలా చేయడం ప్రభుత్వానికి సులువైన పనే. ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ విలువలు పతనమైపోయి, ప్రజలు అలకల్లోలానికి గురైనప్పుడు, ఆ వార్తలు ప్రపంచానికి తెలియకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. అసలు అలాంటి ఘటనలు జరగకుండా, ఆ ఘటనల వెనుకున్న శక్తులను నియంత్రించి నిషేధించే నిజాయితీని, శక్తియుక్తుల్ని ప్రభుత్వం ప్రదర్శించాలి. మణిపూర్లో చెలరేగిన, ఇంకా కొనసాగుతున్న మారణకాండకు మానవీయ పరిష్కారం కనుగొనడమే ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం. ఇంటర్నెట్ పునరుద్ధరించినట్టే ఆ మార్గంలో పయనించి తమ పట్ల ప్రజలు కోల్పోయిన విశ్వాసాన్ని కూడా పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉంది.

Also Read:  AP : ముగిసిన చంద్రబాబు కస్టడీ విచారణ

Exit mobile version