Women’s Bill : మహిళా బిల్లుపై మహా సస్పెన్స్

ళ్ల తరబడి విముక్తికి నోచుకోని మహిళా బిల్లు (Women's Bill) ఎట్టకేలకు చట్టం కాబోతుందన్న వార్త గుప్పమని వ్యాపించడంతో దేశమంతా పార్టీలకు అతీతంగా మహిళలు సంబరం చేసుకున్నారు.

  • Written By:
  • Updated On - September 19, 2023 / 12:42 PM IST

By: డా. ప్రసాదమూర్తి

ఏళ్ల తరబడి విముక్తికి నోచుకోని మహిళా బిల్లు (Women’s Bill) ఎట్టకేలకు చట్టం కాబోతుందన్న వార్త గుప్పమని వ్యాపించడంతో దేశమంతా పార్టీలకు అతీతంగా మహిళలు సంబరం చేసుకున్నారు. సోమవారం నాడు ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్ర కాబినెట్ సమావేశమై కొన్ని కీలక బిల్లుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందులో చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు సోమవారం సాయంత్రం వార్త ప్రచారంలోకి వచ్చింది. దీన్ని ఎవరో కాదు, సాక్షాత్తు కేంద్ర క్యాబినెట్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ స్వయంగా ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేశారు. దీనితో చాలామంది యూట్యూబర్లు, మీడియా సంస్థలు, ఎట్టకేలకు మహిళా బిల్లు (Women’s Bill) పాస్ అయిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విశ్లేషణలు కూడా చేసేశారు. తీరా చూస్తే ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్వీట్ ను కొంతసేపటికి తొలగించారు. దీంతో మహిళా బిల్లుపై ఇన్నేళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు, సస్పెన్షన్ కు ఏమాత్రం తెరపడలేదని తెలుస్తోంది.

యూపీఏ ప్రభుత్వ కాలం నుంచి ఇప్పటివరకు కేంద్రంలో ప్రభుత్వాలు చాలా మారాయి. అనేకసార్లు పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు వెలుగులోకి రావడం.. మళ్ళీ చీకట్లోకి వెళ్లిపోవడం ఇలా దోబూచులాట సాగుతూనే ఉంది. గతంలో ఈ బిల్లును రూపొందించినప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమయింది. పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. 2008లో ఈ బిల్లు ఆమోదముద్ర పొందడానికి అడుగు దూరానికి వచ్చినప్పుడు ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అడ్డం తిరిగారు. వారు పార్లమెంటులో కానీ ఇతర చట్టసభల్లో గాని మహిళలకు 33% రిజర్వేషన్ పట్ల తమకు వ్యతిరేకత లేదని, అయితే ఈ 33% కోటాలో వెనుకబడిన తరగతుల మహిళలకు సబ్ కోటా ఉండాలని పట్టుపట్టారు. వారు ఎదురు తిరగడంతో, యూపీఏ నుంచి తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఏకంగా ప్రభుత్వమే కూలిపోయింది. ఒకప్పుడు బిజెపి మంత్రివర్గంలో ఉన్న ఉమాభారతి కూడా బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండాలని వాదించిన విషయం కూడా గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ మహిళా బిల్లు (Women’s Bill) పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, రాజ్యసభలో ప్రవేశపెట్టడం, మళ్ళీ తిరస్కరణకు గురికావడం ఇలా ఏళ్ళూ పూళ్ళూ గడుస్తున్నా.‌. బిల్లుకు అతీగతీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం లేదు. ఆర్జేడి, ఎస్పి, బీఎస్పీ లాంటి పార్టీల పంతం నెగ్గే అవకాశం లేదు.

బిజెపికి సంపూర్ణ బలం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కాలంలో బిజెపి వారు తీసుకువచ్చే అనేక చట్టాలలో మహిళా బిల్లు కూడా ఒకటి కావచ్చు అని అంచనాలు, ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే నేపథ్యంలో నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మహిళా బిల్లు (Women’s Bill) ఆమోదం లభించినట్లు వచ్చిన వార్త చాలా సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ గా దేశమంతా వ్యాపించింది. కానీ కొన్ని క్షణాల పాటు ఆనందాన్ని ఇచ్చి అంతలోనే అదంతా తుస్సుమనిపించింది.

ఇంతకీ కేంద్రంలో అధికార పార్టీ మనసులో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల ఎలాంటి ఉద్దేశం ఉందో స్పష్టంగా ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఏవేవో పార్టీలు, ఎవరెవరో నాయకులు అడ్డుపడ్డారని అందుకే ఈ బిల్లు చట్టం కాలేదని వ్యాఖ్యలు చేసేవారు, విమర్శలు చేసేవారు ఇప్పుడు ఈ బిల్లును చట్టం చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారో తెలియదు. ఈ బిల్లును చట్టం చేయడానికి పార్లమెంటులో సంపూర్ణ బలం అధికార పార్టీకి ఉంది. పార్లమెంటులో మహిళలకు మూడో వంతు భాగస్వామ్యాన్ని కల్పించాలని బిజెపి వర్గాలు గట్టిగా పట్టుపడితే అది సాధ్యం కానిది కాదు. ఇప్పటికే ఆర్టికల్ 370 కావచ్చు, మరిన్ని ఇతర బిల్లులు కావచ్చు, ప్రతిపక్షాల ఆమోదం లేకుండానే వాటిని అమలులోకి తెచ్చిన బిజెపి తలుచుకుంటే ఈ బిల్లును కూడా పార్లమెంటులో ఆమోదం పొందేలా చేయవచ్చు. అదే ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు.

ఈ ప్రత్యేక సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో మొదలై కొత్త పార్లమెంట్ భవనంలో ముగియనున్నాయి. కేంద్రం తలపెట్టిన ఒకే దేశం ఒకే ఎన్నిక కావచ్చు, దేశం పేరులో ఇండియా తొలగించి భారత్ ను మాత్రమే ఖాయం చేసే చట్టం కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు ఇలాంటి ఎన్నో కీలకమైన నిర్ణయాలను ఈ కొత్త పార్లమెంటు భవనంలో ప్రభుత్వం తీసుకుంటుందని అందరూ ఊహిస్తున్నారు. సెప్టెంబర్ 22 వరకు సాగే ఈ ప్రత్యేక సమావేశాల్లో ఇంతకాలం చీకటి కొట్టంలో పడి ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్ట రూపంలో వెలుగు చూస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ బిల్లులోనే వెనకబడిన వర్గాల మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించారా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్. అది కల్పించకపోయినా బిల్లును పాస్ చేస్తే కనీసం పార్లమెంటులో మూడో వంతు స్థానాన్ని మహిళలు ఆక్రమిస్తారు. ప్రస్తుతం 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఈ బిల్లు పాస్ అయితే కొత్త పార్లమెంట్లో దాదాపు 180 మంది పైగా మహిళా ఎంపీలు ఆశీనులవుతారు. ఇది కూడా ఒక విప్లవమే. కనీసం ఈ దశ దాటితే రానున్న కాలంలో ఇందులో రిజర్వేషన్ అనే లక్ష్యాన్ని కూడా సాధించవచ్చు. మొదటి అడుగులోనే ఆటంకాలు కల్పించకుండా ఈ బిల్లు పాస్ కావడానికి అన్ని వర్గాలూ సంపూర్ణ మద్దతు ఇవ్వడమే మంచిది.

Also Read:  Chandrababu Arrest : చంద్రబాబు కు బండ్ల గణేష్ సపోర్ట్..రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం