Site icon HashtagU Telugu

Indian Flag Code : ఇళ్లపై జాతీయ జెండా.. ఈ రూల్స్ గుర్తుంచుకోండి!!

Tricolour Rules

Indian Flag

గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరంగా రెపరెపలతో కళకళ లాడుతున్నాయి. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. “హర్ ఘర్ పే తిరంగా” అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేసేందుకు రంగం సిద్ధమైంది. ఈనేపథ్యంలో
జెండా ఎగరేసే సమయంలో.. ఆ తర్వాత పాటించాల్సిన “ఫ్లాగ్ కోడ్” గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2002 జనవరి 26న…

2002 సంవత్సరం జనవరి 26న మన దేశంలో ఫ్లాగ్ కోడ్ అమల్లోకి వచ్చింది. 2021 డిసెంబర్ 30న మోదీ సర్కారు దాన్ని సవరించింది. ప్రయివేట్, పబ్లిక్, ప్రభుత్వ సంస్థలపై జాతీయ జెండా ఎగరేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో పొందుపర్చారు.

* జాతీయ పతాకాన్ని పాలిస్టర్, కాటన్, ఉన్ని, సిల్క్, ఖాదీ వస్త్రాలతో రూపొందించొచ్చు. చేతితోనూ, మెషీన్‌తోనూ జెండాను తయారు చేయొచ్చు.
* 2021 డిసెంబర్ 30 నాటి సవరణకు ముందు పాలిస్టర్, మెషీన్ తయారీ జెండాలకు అనుమతి లేదు.
* ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలకు చెందిన సభ్యులు, విద్యాసంస్థలు అన్ని రోజుల్లోనూ జాతీయజెండా ఎగరేయొచ్చు. జాతీయ జెండా గౌరవానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించొద్దు.
* ఇంతకు ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు జాతీయ జెండాను ఎగరేసేవారు. కానీ 2022, జులై 20 నాటి సవరణ ప్రకారం పగలు, రాత్రి కూడా త్రివర్ణ పతకాన్ని ఎగరేయొచ్చు.
* జాతీయ జెండా ఏ పరిమాణంలోనైనా ఉండొచ్చు. కానీ అది దీర్ఘచతురస్రాకారంలో.. పొడవు, వెడల్పుల నిష్పత్తి 3:2గా ఉండాలి.
* జాతీయ జెండాను గౌరవనీయ ప్రదేశంలోనే ఎగరేయాలి. జెండాలోని కాషాయ భాగం కచ్చితంగా పైన ఉండాలి. తలకిందులుగా జెండాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగరేయొద్దు.
* చిరిగిపోయిన, పాడైపోయిన, వెలిసిపోయిన జాతీయ జెండాను ఎగరేయొద్దు. త్రివర్ణ పతకాన్ని మరే ఇతర అవసరాల కోసం ఉపయోగించొద్దు.
* సాధారణ పౌరులు జాతీయ జెండాను తమ వాహనాలపై ఉంచుకోవడం కుదరదు.
* కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు మాత్రమే తమ వాహనాలపై జాతీయ జెండాను ఉంచుకునేందుకు అనుమతి ఉంది. * రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్టు జడ్జిలు, హైకోర్టు ప్రధాన న్యాయయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు, ఇండియన్ మిషన్స్ అధినేతలు, కేబినెట్ మంత్రులు, సహాయక మంత్రులు, డిప్యూటీ మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్, శాసన మండలి చైర్మన్లు, రాష్ట్ర అసెంబ్లీల స్పీకర్లు, మండలి డిప్యూటీ స్పీకర్లు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్లు మాత్రమే తమ వాహనాలపై జాతీయ జెండాను ప్రదర్శించొచ్చు.
* ఒక వేళ జాతీయ జెండా దెబ్బతింటే.. దాని గౌరవానికి భంగం వాటిల్లకుండా ప్రయివేట్‌గా కాల్చివేయాలి.
* కాగితంతో చేసిన జాతీయ జెండాలను ఉపయోగించిన తర్వాత వాటిని పడేయొద్దు. కాగితపు జాతీయ జెండాలను కూడా గౌరవ రీతిలో కాల్చేయాలి. ఆ సమయంలో వీడియోలు, ఫొటోలు తీయడం లాంటి పనులు చేయొద్దు.

జాతీయ జెండాతో ఇవి చేయొద్దు..

ప్రివేన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971లోని సెక్షన్ 2 ప్రకారం.. జాతీయ జెండాను అవమానించొద్దంటే త్రివర్ణ పతాకాన్ని అలంకరణ కోసం ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. ప్రయివేట్ వ్యక్తుల అంత్యక్రియల సమయంలో వాడొద్దు. త్రివర్ణ పతాకంపై చెత్త వేయొద్దు. వస్తువులను చుట్టడానికి, వస్తువులను డెలివరీ చేయడానికి జాతీయ జెండాను వాడొద్దు.