CDS Anil Chauhan: రెండో సీడీఎస్‌ చీఫ్‌‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్!

Anil Chauhan: జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణంతో దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) పదవిని రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.

  • Written By:
  • Updated On - September 28, 2022 / 11:09 PM IST

Anil Chauhan: జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణంతో దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) పదవిని రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. నూతన సీడీఎస్‌గా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ని నియమించింది. బిపిన్‌ రావత్‌ మరణం తర్వాత సీడీఎస్‌ అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన కేంద్రం అనిల్‌ చౌహాన్‌ను నియ‌మించింది. దీంతో దేశ రెండో సీడీఎస్‌గా చౌహాన్‌ నియమితులయ్యారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ చౌహాన్‌ ఈస్టర్న్‌ కమాండ్‌ చీఫ్‌గా 2021లో పదవీ విరమణ చేశారు. దాదాపు తన 40 ఏళ్ల కెరీర్‌లో అనిల్ చౌహాన్ సైన్యంలోని అనేక హోదాల్లో పనిచేశారు. మిలిటరీ వ్యవహారాల శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శిగా కూడా చౌహాన్ పనిచేస్తారని ఓ ప్రకటనలో పేర్కొంది.

ఎవ‌రీ అనిల్ చౌహ‌న్‌..?

18 మే 1961న జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ పూర్వ విద్యార్థి. ఆయన 1981లో భారత సైన్యం 11 గూర్ఖా రైఫిల్స్‌లో నియమించబడ్డారు. మేజ్ జనరల్ హోదాలో బారాములా సెక్టార్‌లో పదాతిదళ విభాగానికి నాయకత్వం వహించారు. అనిల్ చౌహాన్ సెప్టెంబర్‌ 2019లో తూర్పు కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా మారారు. మే 2021లో సర్వీస్ నుండి పదవీ విరమణ చేసే వరకు ఆయన బాధ్యతలు నిర్వహించారు.

అతని విశిష్టమైన‌ సేవలు అందించినందుకు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్)కు పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేన పతకంతో పాటు విశిష్ట సేవా పతకం లభించాయి. హెలికాప్టర్ ప్రమాదంలో భారత మిలిటరీ చీఫ్ బిపిన్ రావత్, మ‌రో 13 మంది వ్యక్తులు మరణించిన తర్వాత భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ స్థానం తొమ్మిది నెల‌ల‌పాటు ఖాళీగా ఉంది.