Agnipath : “అగ్నిపథ్” ఆలోచనకు అంకురార్పణ ఎక్కడ పడిందంటే..

ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ఐడియా ఉంటుంది. ప్రతి ఐడియా వెనుక ఒక ప్రేరణ ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన స్వల్పకాలిక (నాలుగేళ్ళ) సైనిక నియామక పథకం "అగ్నిపథ్" వెనుక కూడా ఒక ప్రేరణ ఉంది.

  • Written By:
  • Publish Date - June 24, 2022 / 09:00 AM IST

ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ఐడియా ఉంటుంది. ప్రతి ఐడియా వెనుక ఒక ప్రేరణ ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన స్వల్పకాలిక (నాలుగేళ్ళ) సైనిక నియామక పథకం “అగ్నిపథ్” వెనుక కూడా ఒక ప్రేరణ ఉంది. ఒక ఐడియా ఉంది. ఎప్పటిది అంటే.. 2019 సంవత్సరం నాటిది!! అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవనే తొలిసారిగా అగ్నిపథ్ తరహా స్వల్పకాలిక సైనిక నియామక ప్రక్రియ గురించి బహిరంగంగా మాట్లాడారు. దాన్ని “టూర్ ఆఫ్ డ్యూటీ” అనే పేరుతో ఆయన ఆనాడు పిలిచారు.

ఎం.ఎం.నరవనే ఒకే మాట..

స్కూళ్ళు, కాలేజీలు, ఆర్మీ ఆఫీసర్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రతిసారీ ఎం.ఎం.నరవనే ఒకే మాట చెప్పేవారు.. “విద్యార్థులకు ఆర్మీ లో ఉండే వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆతురుత చాలా ఎక్కువ. అయితే అది పూర్తి స్థాయి కెరీర్ గా ఉండటాన్ని స్టూడెంట్స్ ఇష్టపడే వాళ్ళు కాదు” అని ఎం.ఎం.నరవనే పేర్కొనేవారు. “విద్యార్థుల మదిలో ఉన్న ఈవిధమైన అభిప్రాయాల నుంచే స్వల్పకాలిక సైనిక సర్వీసు కు సంబంధించిన ఆలోచన కు అంకురార్పణ చేసింది. మన యువత కు స్వల్ప కాలం పాటు సైన్యంలో పనిచేసే అవకాశాన్ని కల్పించాలనే ఐడియా కు ప్రాణం పోసింది.ఆ తరహా సైనిక సర్వీసు కు రూపకల్పన చేయాలని భావిస్తున్నాం. 3 సంవత్సరాల కాల పరిమితి కోసం ఏటా 1000 మందిని తీసుకుంటే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తున్నాం. వాళ్ళను 6 నుంచి 9 నెలల శిక్షణ తర్వాత విధుల్లోకి తీసుకుంటాం” అని 2019లోనే ఎం.ఎం.నరవనే వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ స్వల్పకాలిక సైనిక నియామక సర్వీసును తీసుకొస్తే.. కేవలం ఆర్మీ ఆఫీసర్స్ భర్తీ కోసమే వినియోగించాలని తొలుత భావించారు. అయితే దీనివల్ల ఇప్పటికే ఆర్మీ ఆఫీసర్ల భర్తీకి చేపడుతున్న నియామక ప్రక్రియకు విఘాతం కలుగకూడదని యోచించారు. ఇందుకు అనుగుణంగా ఒక పైలట్ ప్రాజెక్టును అమలు చేసేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను కూడా 2019లోనే రూపొందించారు.

తొలుత వ్యతిరేకించిన బిపిన్ రావత్..

అయితే ఈ ప్రతిపాదనలను నాటి త్రివిధ దళాధిపతి ( చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ తొలుత వ్యతిరేకించారు. “ఒక అభ్యర్థిని ఆర్మీ ఆఫీసర్ పోస్ట్ కోసం రిక్రూట్ చేసుకొని.. ఏడాది ట్రైనింగ్ ఇచ్చి.. నాలుగేళ్ళలోనే అతడిని వదులుకోవడం ఎంతవరకు సమంజసం ? దాని వల్ల సమతూకం కొనసాగుతుందా ?” అని అప్పట్లో బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారట. అయితే కొంత కాలానికే బిపిన్ రావత్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట. స్వల్పకాలిక సైనిక నియామక సర్వీస్ ద్వారా ఆర్మీ ఆఫీసర్లను కాకుండా.. పర్సన్ బిలో ఆఫీసర్ ర్యాంక్ (పీబీఓఆర్) పోస్టుల భర్తీకి అభ్యంతరం లేదని ఆయన చెప్పారట. ఈ తరహా రిక్రూట్మెంట్ ను ప్రారంభిస్తే దీర్ఘకాలంలో భారత రక్షణ శాఖ పై ఆర్మీ పెన్షన్ల చెల్లింపు భారం భారీగా తగ్గుతుందని జనరల్ రావత్ ఆనాడే అభిప్రాయపడ్డారని అంటున్నారు.

వందల గంటల మీటింగ్స్..

తద్వారా ప్రస్తుతం 32 సంవత్సరాలుగా ఉన్న సైనికుల సగటు వయసు .. రానున్న ఏళ్లలో సగటున 26 ఏళ్లకు తగ్గించేందుకు బాటలు పడతాయని రక్షణ శాఖ భావించింది. ఈక్రమంలోనే దీనిపై 2019 నుంచి ఇప్పటివరకు భారత సైన్యంలో అంతర్గతంగా 500 గంటల పాటు 150 మీటింగ్ లు జరిగాయి. రక్షణ శాఖ కూడా 150 గంటల పాటు 60 మీటింగ్ లు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం కూడా మేధోమథనం చేసింది. ఇవన్నీ జరిగిన తర్వాతే అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక సైనిక నియామక సర్వీస్ పై ఈనెలలో ప్రకటన చేసింది.