World Economic Crisis: లంకా దహనం ముప్పు.. మరో డజను దేశాల్లో!!

ఆర్ధిక సంక్షోభపు మంటలు లంకను దహిస్తున్నాయి. ఈ మంటలు వాస్తవానికి మరో డజను దేశాల్లోనూ ఉన్నాయి. కానీ ఒక్క శ్రీలంకలో మాత్రం బహిర్గతం అయ్యాయి.

  • Written By:
  • Updated On - August 7, 2022 / 11:42 AM IST

ఆర్ధిక సంక్షోభపు మంటలు లంకను దహిస్తున్నాయి. ఈ మంటలు వాస్తవానికి మరో డజను దేశాల్లోనూ ఉన్నాయి. కానీ ఒక్క శ్రీలంకలో మాత్రం బహిర్గతం అయ్యాయి. మిగితా దేశాల్లో ఆర్థిక సంక్షోభం చాపకింద నీరులా విస్తరిస్తోంది. అది ఏ క్షణాన అగ్నిపర్వతంలా బద్దలు అవుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఈ విధంగా నివురు గప్పిన నిప్పులా పెలుసుగా మారిన ఆర్ధిక వ్యవస్థల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియా, పాక్ కూడా..

లెబనాన్, సూరినామ్, జాంబియా, దేశాలు కూడా ఇప్పటికే దివాళా తీశాయి. బేలారస్ దేశం ఆర్థిక సంక్షోభపు అంచుల్లో కొట్టు మిట్టాడుతోంది. పాకిస్తాన్ పై imf అప్పుల భారం పెరిగి పోయింది. వాటిని సకాలంలో తిరిగి కట్టే స్థితిలో పాక్ లేదు. ఆ దేశం వద్ద మరో 5 వారాల ఎగుమతుల చెల్లింపులకు సరిపడా డాలర్ల నిల్వలు (9.8 బిలియన్ డాలర్లు) మాత్రమే ఉన్నాయి. ఈనేపథ్యంలో పాకిస్థాన్ కరెన్సీ విలువ కూడా భారీగా పతనమైంది. పాకిస్థాన్ కొత్త ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో దాదాపు 40 శాతం దాకా వడ్డీల చెల్లింపులకే సరిపోతోంది. ఇక మన ఇండియాలోనూ కరెన్సీ(రూపాయి) విలువ బాగా పడిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.80కి పెరగడం ఆందోళనకరం. ఈక్వేడార్, ఎల్ సాల్వేడార్, ఇథియోపియా, కెన్యా, ఈజిప్టు, ఘనా, నైజీరియా, ట్యునీషియా, ఉక్రెయిన్, అర్జెంటీనా దేశాలు కూడా ఆర్ధిక మందగమనంలో ఉన్నాయి.ఇవి మాత్రమే కాదు.. అగ్రదేశాలుగా పేరున్న అమెరికా, కెనడా, బ్రిటన్‌, జపాన్‌, ఐరోపా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు ఆర్థిక మాంద్యం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి.

3 కారణాలతో..

ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి మూడు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడమే. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆహార కొరత నెలకొన్నది. 2023లో తీవ్రమైన చమురు సంక్షోభం ముంచుకు రానున్నది. దీంతో స్థానికంగా పరిశ్రమలపై ప్రభావం చూపనున్నది. ఆర్థిక సంక్షోభానికి రెండో కారణం స్టాక్‌ మార్కెట్లు కుదేలవడమే. ఇప్పటివరకు భారీగా ఉన్న ఆస్తుల విలువలు ఉన్నట్టుండి పడిపోయాయి. పలు కంపెనీల స్టాక్‌ విలువలు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది కేవలం ఒక్క మే నెలలో మాత్రమే మదుపర్లు 11 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టపోయారు. 11 ఏళ్ల తరువాత ఇంతటి భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారు. ప్రపంచ దేశాలకు చెందిన గృహ, ప్రైవేటు, కంపెనీలు, ప్రభుత్వాల అప్పులు మొత్తం 305 లక్షల కోట్ల డాలర్లు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. 2000 సంవత్సరంలో ప్రపంచ దేశాల అప్పులు 83 లక్షల కోట్ల డాలర్లుగా ఉండేది. అది 2022 నాటికి 305 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. 2000 సంవత్సరం కంటే నాలుగు రెట్లు అదనంగా పెరిగింది. ఈ రుణాల చెల్లింపులో విఫలమైతే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి.

మూడోది ముఖ్యం..

ఆర్థిక మాంద్యానికి మూడో కారణం ఊహించని విధంగా ప్రపంచాన్ని కుదిపేసే సంఘటనలు జరగడమే వ్యూహాన్‌లో పుట్టిన వైరస్‌ ప్రపంచాన్ని వణికించింది అల్లకల్లోలం సృష్టించింది. వైరస్‌ నుంచి కోలుకుంటున్న తరుణంలో ఉక్రెయిన్‌‌పై రష్యా దాడి చేసింది.