Belly Fat Diet: బెల్లీ ఫ్యాట్ తగ్గించే ఫుడ్స్, జ్యూస్ లు ఇవే..

పొత్తి కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోయే సమస్యను "బెల్లీ ఫ్యాట్" ప్రాబ్లమ్ అంటారు.

పొత్తి కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోయే సమస్యను “బెల్లీ ఫ్యాట్” (Belly Fat) ప్రాబ్లమ్ అంటారు. ఈ రోజుల్లో ఊబకాయం ఎంత కామన్ గా మారిందో బెల్లీ ఫ్యాట్ కూడా అంతేకామన్ అయిపోయింది. శరీరంలో కొవ్వు విపరీతంగా పేరుకుపోవడం వల్ల “బెల్లీ ఫ్యాట్” ప్రాబ్లమ్ వస్తుంది. వ్యాయామం లేకపోవడం, ఇష్టారీత్యా ఏది పడితే అది తినడం వల్లే ఇలా బెల్లీ ఫ్యాట్ (Belly Fat) వస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని ఫుడ్స్ తింటే, జ్యూస్ లు తాగితే బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్యాబేజీ జ్యూస్

క్యాబేజీ జ్యూస్ బరువు తగ్గడానికి, శరీరంలోని కొవ్వును కరిగించటంలో సహాయ పడుతుంది. క్యాబేజీ అనేది పొటాషియం, విటమిన్ సి మరియు సల్ఫర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు క్యాబేజీ జ్యూస్ ద్వారా A, B, E, C, K, కాల్షియం, అయోడిన్, పొటాషియం, సల్ఫర్‌లు శరీరానికి అందుతాయి. క్యాబేజీ జ్యూస్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యాబేజీ రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే దీనిని బరువు తగ్గించే పానీయంగా పరిగణిస్తారు. ఒక కప్పు క్యాబేజీ రసంలో 22 కేలరీలు, అతితక్కువ కొవ్వు ఉంటుంది. క్యాబేజీ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరంలో సెల్-డ్యామేజింగ్ ఫ్రీ రాడికల్స్ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రేగులలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నింటినీ తొలగించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్యాబేజీ జ్యూస్ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి అనేక కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

క్యాబేజీ జ్యూస్ తయారీ ఇలా..

క్యాబేజీని తీసుకుని కొంత బాగాన్ని కోసుకుని పక్కన పెట్టుకోవాలి. జ్యూస్ రుచికరంగా ఉండాలంటే ఇతర కూరగాయలు లేదా అల్లం మరియు ఆపిల్ వంటి పండ్లను దీనికి చేర్చుకోవచ్చు. ఆ ముక్కలను నీళ్లతో కలిపి నాలుగైదు నిమిషాలు ఉడకబెట్టాలి. ఇప్పుడు ఉడికించిన ముక్కలను తీసుకుని బ్లెండ్ చేయాలి. ఒక గ్లాసు తీసుకుని అందులో జ్యూస్ పోసి అందులో కాస్త నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇంతే క్యాబేజీ జ్యూస్ సిద్ధమైనట్లే!

అంజీర్

అంజీర్ మన శరీర బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిలో ఐరన్, కాల్షియం, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో అంజీర పండ్లను తినడం వల్ల పొట్టలోని కొవ్వును వేగంగా తగ్గిస్తుంది. ఎందుకంటే వీటిని ప్రతి రోజు తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఫిసిన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ అంజీర్‌ పండులో లభిస్తుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ వేగంగా తగ్గిస్తుంది.

పసుపు, పుదీనాతో చేసిన టీ

పసుపు, పుదీనాతో చేసిన టీని తాగితే బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పసుపులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉండే పసుపు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. పసుపు కేలరీలను కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇకపోతే పుదీనాలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కూడా పొత్తికడుపు కొవ్వును ఇట్టే తగ్గిస్తాయి. దీని కోసం ముందుగా ఒక కప్పు నీటిని  తీసుకుని మరిగించండి. దానిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొన్ని పుదీనా ఆకులను వేయండి. 4-5 నిమిషాల పాటు బాగా కలపండి. ఆ తర్వాత వడకట్టి తాగండి. అయితే మీరు కావాలనుకుంటే దీనిలో కొద్దిగా తేనెను కూడా కలుపుకుని తాగొచ్చు.

చియా విత్తనాలు, నిమ్మకాయ నీరు

చియా విత్తనాలు, నిమ్మకాయ నీరు ఈ రెండు మీరు సులువుగా బరువు తగ్గడానికి సహాయ పడతాయి. లెమన్ వాటర్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ డ్రింక్ ను ఎలా తయారుచేయాలంటే.. ముందుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. రుచి కోసం మీరు ఒక చెంచా తేనెను కూడా దీనిలో కలపొచ్చు. దీనికి కొద్దిగా చియా సీడ్స్ ను జోడించండి. దీనివల్ల ఆకలి తగ్గుతుంది. ఫ్యాట్ కూడా కరుగుతుంది.

జీలకర్ర నీళ్లు

జీలకర్ర నీళ్లు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ముందుగా ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి కలపండి. ఈ నీటిని రాత్రంతా అలాగే నానబెట్టండి. ఉదయాన్నే పరగడుపున తాగితే బెల్లీ కొన్ని రోజుల్లోనే కరిగిపోతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కెఫిన్ కంటెంట్ ఉండదు. ఈ గ్రీన్ టీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి, బరువును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. అందుకే వెయిట్ లాస్ కావాలనుకునేవారు గ్రీన్ టీని రెగ్యులర్ గా తాగండి.

Also Read:  Chicken: రోజూ చికెన్ తినొచ్చా? తినకూడదా? నిపుణులు ఏమంటున్నారు?