Tirumala: శతాబ్దాలుగా తిరుమలలో అన్న ప్రసాద వితరణ

హిందువులకు అత్యంత పవిత్రమైనది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ). రాష్ట్రం, దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు, యాత్రికులు శతాబ్ధాలుగా శ్రీవెంకటేశ్వరుని దర్శించుకుని తరిస్తున్నారు.

  • Written By:
  • Updated On - October 21, 2022 / 10:03 AM IST

హిందువులకు అత్యంత పవిత్రమైనది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ). రాష్ట్రం, దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు, యాత్రికులు శతాబ్ధాలుగా శ్రీవెంకటేశ్వరుని దర్శించుకుని తరిస్తున్నారు. స్వామివారికి కానుకలు కూడా భారీ స్థాయిలోనే వస్తూనే ఉన్నాయి. పెరుగుతున్న భక్తుల తాకిడిని, రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం పాలక మండలి కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. వాటిలో దర్శనానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చేందుకు అల్పాహారం, అన్నప్రసాదం అందించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రోజుకు ఎన్నివేల మంది భక్తులు వచ్చినా అన్నదాన ట్రస్టు ద్వారా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని టీటీడీ నిరాఘాటంగా కొనసాగిస్తోంది.

తొలినాళ్లలో భక్తులు తిరుమలలో స్వామివారి దర్శనానికి ఎన్నో వ్యయప్రయాసలకోర్చివచ్చేవారు. పూర్తిగా దట్టమైన అడవి మధ్యన ఉండే ఆలయానికి వచ్చే భక్తుల ఆకలిని తీర్చడానికి ఎంతోమంది భూరి విరాళాలు అందించారు.శతాబ్ధాల క్రితం ఎందరో రాజులు, చక్రవర్తులు, ఆ తరువాత జమిందారులు, పారిశ్రామికవేత్తలు స్వామివారి నైవేద్యానికి భారీస్థాయిలో విరాళాలు ఇస్తూ వచ్చారు. అదే కొనసాగుతూ వస్తోంది. అయితే, ఎందరు ఎన్ని చేసినా భక్తుల కోసమే ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ చేసిన ఘనత మాత్రం తరిగొండ వెంగమాంబకే దక్కుతుంది.

శ్రీ వెంకటేశ్వరుడికి పరమభక్తురాలైన వెంగమాంబ చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండ గ్రామంలో కానాల మంగమాంబ, కృష్ణయామాత్యులనే బ్రాహ్మణ దంపతులకు 1730లో జన్మించారు. ఆమె తెలుగులో మంచి కవయిత్రి. 17వ శతాబ్దంలోనే ఆమె తిరుమలలో భక్తులకు అన్నపసాద వితరణ చేశారు. ఏటా వైశాఖమాసంలో తిరుమలలో ఆమె నృసింహజయంతి జరిపేవారు. పది రోజుల పాటు అన్నప్రసాద వితరణ,చలివేంద్రాలు ఏర్పాటుచేసేవారు. ఈ అన్నప్రసాద కార్యక్రమానికి ఆనాటి రాజులు ఎందరో భూదానాలు చేసినట్లు శాసనాలు కూడా ఉన్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన మూడు దశాబ్దాల తరువాత 1933లో అతి తక్కువ ధరలకే అల్పాహారాన్ని అందించే ఓ హోటల్‌ను ప్రారంభించారు. 1965కు పూర్వం ప్రస్తుతం అఖండ హరినామసంకీర్తన జరిగే మండపంలో దీనిని ఏర్పాటుచేశారు. అప్పట్లో ఇడ్లీ 10 పైసలు, వడ 15 పైసలు, టీ, కాఫీలు 25 పైసలు, మసాలా దోశ 40 పైసలు, భోజనం రూపాయి పావలా ఉండేవి.
1970 నుంచి 1980వరకు ఏఎన్‌సి ప్రాంతంలోని ఓ కాటేజీలో ఎస్వీసీసీ పేరుతో శ్రీవేంకటేశ్వర క్యాంటీన్‌ కాంప్లెక్స్‌ ప్రారంభించారు. ఇక్కడ కూడా తక్కువ ధరలకే ఆహారపదార్థాలు విక్రయించేవారు. తరువాత 1971 మార్చి 31న ప్రముఖులు, భక్తుల కోసం ఎస్వీ గెస్ట్‌ హౌస్‌ను ప్రారంభించారు.ఇందులో టీటీడీ వారు ప్రత్యేకంగా క్యాంటీన్‌ను ఏర్పాటుచేశారు. తక్కువ ధరలకు అల్పాహారం, భోజన అందించేవారు. 1981 నుంచి 1984వరకు ఆర్టీసీ బస్టాండ్‌లోని టీటీడీ సెంట్రల్‌ క్యాంటీన్‌ ఏర్పాటుచేశారు. అక్కడ ప్లేట్‌మీల్స్‌ రూపాయి 75పైసలకు, ఫుల్‌మీల్స్‌ మూడు రూపాయలకు విక్రయించేవారు.

ఈ క్రమంలో పాత అన్నప్రసాద భవనాన్ని 1980 జూన్‌ 5న ప్రారంభించారు. ఈ భవనంలో ప్లేట్‌ మీల్స్‌ రూపాయి 75 పైసలు, ఫుల్‌మీల్స్‌ మూడు రూపాయలు, స్పెషల్‌ భోజనం 4.50 రూపాయలు ఉండేవి.అప్పట్లో ప్రతి రోజూ ఐదువేల భోజనాలను అమ్మేవారు. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఎల్వీ రామయ్య అనే భక్తుడు ఇచ్చిన పది లక్షల రూపాయల విరాళంతో ఉచిత అన్నప్రసాద కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు.

అప్పట్లో శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే ఉచిత భోజనం టోకెన్లు ఇచ్చేవారు. తొలుత రెండు వేల మందికి, తరువాత 14 వేల మందికి ఇచ్చేవారు. అలా 20 వేల మందికి పెరిగింది. క్రమంగా భక్తుల సంఖ్య రోజుకు లక్షకు పెరిగిన నేపథ్యంలో టీటీడీ 2008లో సర్వభోజన పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి తిరుమలకు వచ్చిన భక్తులందరికీ ఎంతమంది వచ్చినా సంఖ్యతో సంబంధంలేకుడా అన్నప్రసాద వితరణను ఉచితంగా కొనసాగిస్తోంది. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌తోపాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్ -1,2, పీఏసీ-2లలో నాలుగు చోట్ల అన్నప్రసాదాలు తయారు చేస్తారు.

అన్నప్రసాదాల తయారీకి ప్రతిరోజూ దాదాపు 10 నుండి 12 టన్నుల బియ్యం, 7 నుండి 8 టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నారు. ఇక్కడ శ్రీవారి సేవకులే కూరగాయల తరగడం, సరుకులను శుభ్రం చేయడం, యాత్రికులకు ఆహారం అందించడం తదితర సేవలు చేస్తుంటారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో రోజుకు 55 వేల నుండి 60 వేల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. పర్వదినాలు, రద్దీ రోజుల్లో ఈ సంఖ్య లక్ష వరకు ఉంటుంది. అన్నదాన ట్రస్టులో ప్రస్తుతం రూ.1,502 కోట్ల నిధులు ఉన్నాయి. 2018లో ఈ ట్రస్టు స్వయంసమృద్ధి సాధించింది. దాంతో టీటీడీ వారు గ్రాంటు ఇవ్వడం ఆపేశారు.

భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు అందించే ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదం వడ్డిస్తారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుండి రాత్రి 11.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తారు. గరుడసేవ రోజు రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాదం అందిస్తారు. ఈ విధంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం దినదిన ప్రవర్ధమానమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది.