Pegasus Software: రాష్ట్ర ప్రభుత్వాలు పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేయవచ్చా?

ఏపీలో అసెంబ్లీలో పెగాసస్ మంటలు రాజుకున్నాయి. వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ ను టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందా అనే ప్రశ్నలతో వివాదం నడుస్తోంది.

  • Written By:
  • Publish Date - March 25, 2022 / 08:47 AM IST

ఏపీలో అసెంబ్లీలో పెగాసస్ మంటలు రాజుకున్నాయి. వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ ను టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందా అనే ప్రశ్నలతో వివాదం నడుస్తోంది. చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రచ్చ మొదలైంది. తాము పెగాసస్ కొనుగోలు చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో పెగాసస్ ను ఉపయోగించలేదన్నది వంద శాతం నిజమని అప్పటి నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తేల్చేశారు. వైసీపీ హయాంలోనే డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ కూడా ఏపీలో పెగాసస్ వాడలేదని ఎప్పుడో స్పష్టం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే…ఈ అంశాన్ని స్పీకర్ తమ్మినేని సీతారం సభా సంఘానికి అప్పగించారు. పెగాసస్ ను అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేయలేదని..చంద్రబాబు వ్యక్తిగతంగా కొన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం. పెగాసస్ ను ఎవరి పడితే వారు కొనుగోలు చేయవచ్చా.? ప్రభుత్వాలకు ఈ అవకాశం ఉంటుందా…?

పెగాసస్ అంటే…
పెగాసస్ అనేది ఫోన్లపై డిజిటల్ నిఘాపెట్టే అత్యాధునిక సాఫ్ట్ వేర్ ఇది. ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సంస్థ దీనిని రూపొందించింది. పెగాసస్ అనేది స్పైవేర్. ఫోన్ తో పాటుగా ఇతర డివైస్ లోకి చొరబడే స్పైవేర్ ను ఆ కంపెనీ ఉత్పత్తి చేసింది. ఫోన్ లో ఇన్ స్టాల్ అయిన తర్వాత పెగాసస్ కంట్రోల్లోకి ఫోన్ వెళ్తుంది. ఫోనులో ఉన్న ప్రతి అంశాన్ని గమనిస్తుంది. డేటా విశ్లేషణ చేసి కావాల్సిన సమచారాన్ని తీసుకుంటుంది. మామూలు ఫోన్లే కాదు..యాపిల్ ఫోన్ కూడా దీనికి మినహాయింపు కాదు. వాయిస్ కాల్స్, వాట్సప్, ఎస్ఎంఎస్, ఈ మెయిల్స్, కాల్ లిస్టు, కాంటాక్ట్ అన్నికూడా ట్రాన్స్ ఫర్ అవుతాయి. డబ్బులున్న ప్రతి ఒక్కరూ దీన్ని కొనుగోలు చేయలేరు. కేవలం ప్రభుత్వాలు, ప్రభుత్వ పరిధిలోని నిఘా విభాగాలు, సైన్యానికి మాత్రమే ఈ స్పైవేర్ ను విక్రయిస్తారు.

2016లో మొదటిసారిగా పెగాసస్ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటికీ…ఆ తర్వాత 2019లో వార్తల్లోకి రావడంతో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. 2021 జులైలో ఈ పెగాసస్ స్పైవేర్ భారత్ ను మరోసారి కుదిపేసింది. జర్నలిస్టులు, ప్రతిపక్షనాయకులు, మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి, పలువురు వ్యాపారవేత్తలు హ్యాక్ చేసినట్లు తేలింది . తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వాడివేడి రగిలినట్లయ్యింది. పెగాసస్ స్పైవేర్ తో ప్రత్యర్థులు, వీవీఐపీల ఫోన్లను హ్యాక్ చేసి వివరాలు తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు, ప్రముఖులు ఫోన్లను ట్యాప్ చేసి తర్వాత వ్యూహ రచన చేస్తున్నారన్న వాదన లేకపోలేదు. ఇక 2017లోపెగాసస్ సాఫ్ట్ వేర్ ను భారత ప్రభుత్వం 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనం ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే.

రాష్ట్ర స్థాయిలో పెగాసస్ ఉపయోగించవచ్చా…?
పెగాసస్ ను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి ఉపయోగించవచ్చా? ప్రతి ఒక్కరూ ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించలేరు. ప్రభుత్వ పరిధిలోని నిఘా విభాగాలు, సైన్యానికి మాత్రమే ఈ స్పైవేర్ ను విక్రయిస్తారు. కేవలం చట్టబద్ధంగా మాత్రమే ఉపయోగించడానికి వీలుంటుంది. పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కేవలం ఉగ్రవాదులు, నేరస్తులపైన్నే ఉపయోగిస్తారు. పౌరులు, రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం ఉపయోగించమన్న హామీ ఇవ్వాలి. అయితే ఇప్పటి వరకు పెగాసస్ ను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.

2019 నవంబర్ లో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం రాష్ట్ర నిర్వాసితులపై పెగాసస్ ను ఉపగయోగించిదన్న ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ జారీ చేసిన ఉత్తర్వుల్లో…బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో స్పైవేర్ ఎన్ఎస్ఓ గ్రూప్ ఛత్తీస్ గఢ్ పోలీసులకు ప్రజేంటేషన్ ఇచ్చినట్లుగా ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. అయితే రెండేళ్లు గడిచినా…విచారణకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఇదే విధమైన ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు దీనిపై స్టే విధించింది. కాగా పెగాసస్ ను తమ స్థానిక చట్టాల అమలు సంస్థలకు విక్రయించడానికి ఎన్ఎస్ఓ గ్రూప్ తమను సంప్రదించినట్లు పలువురు రాష్ట్ర నాయకులు వ్యాఖ్యలు చేసినప్పటికీ…రాష్ట్ర ప్రభుత్వాలు స్పైవేర్ ను ఉపయోగించినట్లు ఎక్కడా ఖచ్చితమైన ఆధారాలు వెలువడలేదు.

పెగాసస్ ను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొనుగోలు చేయవచ్చు కానీ దీనిపై వారి స్థాయిలో నిర్ణయం తీసుకుంటే సరిపోదని..ఈ ప్రతిపాదనను ముందు కేంద్ర హోంశాఖకు పంపించాల్సి ఉంటుందని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపర్ గుప్తా అన్నారు. అంతర్గత భద్రతా విభాగంతోపాటు, నిఘా విభాగం నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాతే..కేంద్రం విధాన నిర్ణయం తీసుకోవాలి. అంతా సక్రమంగా ఉందనుకుంటేనే కేంద్రం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.

ఏపీ విషయానికొస్తే..పెగాసస్ ను చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం కొనుగోలు చేసిందనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవన్నారు. భారత్ లో పెగాసస్ ప్రకంపనలు రేగినప్పుడు..ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాలకు లేఖ రాసింది. చాలామంది ప్రముఖులు హ్యాకింగ్ కు గురయ్యారని హైలైట్ చేసింది. అంతేకాదు విచారణ కమీటి ఏర్పాటు చేసిన సాక్ష్యం చెప్పేందుకు బాధితులు, డేటా గోప్యత రంగంలో నిపుణులను అనుమతించి…ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని IFFరాష్ట్రాలను కోరింది.

అయితే ఈ పెగాసస్ సాఫ్ట్ వేర్ సమస్యపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అపార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఆయన ఎండగట్టారు. ఏదైనా అంశంపై దర్యాప్తు జరపాలంటే పారదర్శకతతో ముందుకు సాగలేవన్నారు. రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తుల కంటే రాజకీయ ప్రత్యర్థులపైనే నిఘా ఏర్పాటు చేస్తుందన్నారు.