Site icon HashtagU Telugu

Xi Jinping – Nehru : నెహ్రూపై జిన్‌పింగ్ ప్రశంసలు.. పంచశీల సూత్రాలు గొప్పవని కితాబు

Xi Jinping Nehru

Xi Jinping – Nehru : చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మాజీ భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను కొనియాడారు. ఆయన హయాంలో ప్రతిపాదించిన పంచశీల సూత్రాలు ఎంతో గొప్పవని కితాబిచ్చారు. భారత్ – చైనా మధ్య స్నేహసంబంధాలు బలోపేతం కావడానికి నేటికీ ఆ సూత్రాలు దోహదపడతాయని జిన్‌పింగ్(Xi Jinping – Nehru) చెప్పారు. అలీన ఉద్యమ భావన నుంచి ఉద్భవించిన పంచశీల ప్రణాళికతో చైనా-భారత్ బంధం మరింత  బలోపేతం కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలను ఎదుర్కొని నిలబడి.. చైనా, భారత్ వంటి దేశాలతో కూడిన ‘గ్లోబల్ సౌత్‌’ బలమైన శక్తిగా ఎదిగేందుకు పంచశీల సూత్రాలు సరైన మార్గాన్ని చూపిస్తాయన్నారు.

We’re now on WhatsApp. Click to Join

1954 జూన్ 28న నాటి చైనా అధ్యక్షుడు చౌ ఎన్ లై భారత్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన భారత ప్రధానమంత్రి నెహ్రూతో కలిసి పంచశీల ప్రణాళికపై సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఆనాడు జరిగిన ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని చైనా రాజధాని బీజింగ్‌లో శుక్రవారం రోజు ఒక సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్  పంచశీల ఒప్పందాన్ని కొనియాడారు. చైనా, భారత్ ప్రజల శాంతియుత సహజీవనానికి పంచశీల ప్రణాళికలోని ఐదు సూత్రాలు నేటికీ పనికొస్తాయన్నారు. ‘‘సార్వభౌమాధికార పరిరక్షణ పట్ల పరస్పర గౌరవం, ప్రాదేశిక సమగ్రత పట్ల పరస్పర గౌరవం,  దురాక్రమణ పూరిత విధానాలను పరస్పరం విడనాడటం,  ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు పరస్పరం జోక్యం చేసుకోకపోవడం, సమానత్వం- పరస్పర ప్రయోజనం, శాంతియుత సహజీవనం అనే పంచశీల సూత్రాలు ఇప్పటి పరిస్థితులకు కూడా వర్తిస్తాయి. వాటిని చైనా, భారత్‌లు మహత్తర మాధ్యమాలుగా వాడుకోవచ్చు’’ అని జిన్‌పింగ్ పేర్కొన్నారు.

భారత్‌లో పుట్టి.. ప్రపంచస్థాయికి ఎదిగి..

‘‘పంచశీల సూత్రాలు భారత్‌లో పుట్టాయి. కానీ అవి అనతి కాలంలోనే ప్రపంచ స్థాయికి ఎదిగాయి. అన్ని దేశాలకు చేరాయి.  అంతర్జాతీయ సంస్థలు కూడా వాటిని గౌరవించాయి. పంచశీల ప్రణాళికలపై 1955 సంవత్సరంలో ఇండోనేషియాలోని బాండుంగ్ నగరంలో నిర్వహించిన సదస్సులో 20కి పైగా ఆసియా, ఆఫ్రికా దేశాలు హాజరయ్యాయని షి జిన్‌పింగ్ గుర్తు చేశారు. పంచశీల సూత్రాలు అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ చట్టాల కోసం ఒక చారిత్రాత్మక బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేశాయన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నడుమ జరుగుతున్న ఘర్షణలకు కూడా ఈ పంచశీల సూత్రాలు పరిష్కారాన్ని చూపగలవన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీందా రాజపక్సే  కూడా పంచశీల సూత్రాల ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు.

Also Read :Margani Bharat Ram : వైసీపీ మాజీ ఎంపీ భరత్‌రామ్‌ ప్రచార రథాన్ని తగలబెట్టిన దుండగులు