Paddy E-Auction : వడ్ల కొనుగోలుపై తెలంగాణ సర్కారు ఆగమాగం.. కొత్త ప్లాన్ ఏంటో తెలుసా?

వడ్ల కొనుగోలు అంశం.. బీజేపీతో పాటు టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ మొదటివారంలోపు కోతలు పూర్తయితే ఆ పంటంతా మార్కెట్ కు వచ్చేస్తుంది.

  • Written By:
  • Publish Date - March 30, 2022 / 11:11 AM IST

వడ్ల కొనుగోలు అంశం.. బీజేపీతో పాటు టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ మొదటివారంలోపు కోతలు పూర్తయితే ఆ పంటంతా మార్కెట్ కు వచ్చేస్తుంది. అప్పటికి కాని కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు చేయకపోతే రైతుల నుంచి నిరసన తప్పదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. అందుకే మరో కొత్త ఆలోచన చేసింది. మరి అది వర్కవుట్ అవుతుందా?

ధాన్యం కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి వస్తే ఏం చేయాలి అన్నదానిపై యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, కొనుగోలుకు కావలసిన ఏర్పాట్లు.. అన్నింటి గురించి ఆలోచిస్తోంది. ఇప్పటికే కేంద్రం నుంచి నిరాశ తప్పలేదు. మళ్లీ అడిగితే ఫలితముంటుందో లేదో తెలియదు. ఉగాది తరువాత వరికోతలు పెరుగుతాయి. ఆలోపే నిర్ణయం తీసుకోవాలి.

తెలంగాణలో యాసంగిలో చేతికొచ్చిన పంటకు ఎండవేడి తప్పదు. దీనివల్ల ధాన్యంలో తేమ శాతం తగ్గిపోతుంది. అందుకే మిల్లింగ్ సమయంలో నూకల శాతం పెరుగుతుంది. దీంతో యాసంగి ధాన్యాన్ని మిల్లర్లు ఉప్పుడు బియ్యంగా మార్చేస్తారు. కానీ ఉప్పుడు బియ్యాన్ని కొనబోమని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. అందుకే రైతులకు ఏ సమస్యా రాకుండా చూడడానికి మిల్లర్లతో కొనిపించాలా వద్దా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఇప్పటికే ఎమ్మెల్యేల స్థాయిలో మిల్లర్లతో చర్చలు జరుగుతున్నాయి. కానీ మిల్లర్లు వ్యాపారస్తులు. అందుకే మద్దతు ధరను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేశారు. లెవీ విధానం ఎత్తేశాక.. ప్రభుత్వం ఇచ్చే ధాన్యంతోనే తప్ప సొంత పెట్టుబడితో వ్యాపారం చేయడం లేదు. పైగా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు ఏ గ్రేడ్ ధాన్యం అయితే రూ.1980, మామూలు రకం అయితే రూ.1960 ఉంది. కానీ తెలంగాణలో కొన్ని చోట్ల క్వింటాకు కేవలం రూ. 1500 మాత్రమే ఇస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఈ సీజన్ లో సాగైన 60 లక్షల ఎకరాలకు గాను 70 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది. ఈ మొత్తాన్ని కొని అమ్మాలంటే.. ఈ-వేలం పద్దతి ఎంతవరకు అక్కరకు వస్తుందా అని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. ఛత్తీస్ గఢ్ సర్కారు ఇప్పటికే ఇలాంటి విధానాన్ని అనుసరిస్తోంది. మధ్యప్రదేశ్ రూటు కూడా ఇదే. అందుకే బియ్యంగా మార్చి అమ్మితే వచ్చే భారం కన్నా.. ఈ-వేలం ద్వారా ధాన్యంగా అమ్మడమే మేలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మరి ఇప్పుడు ఏ రూటును ఎంచుకుంటుందో చూడాలి.