Singareni Coal Production: సింగరేణి బొగ్గు తవ్వకాలకు రష్యా యుద్ధం సెగ.. అంటే కరెంటు బిల్లులకు రెక్కలొస్తాయా!

  • Written By:
  • Updated On - March 14, 2022 / 10:04 AM IST

రష్యా-ఉక్రెయిన్ దేశాలు ఏ ముహూర్తంలో యుద్ధాన్ని మొదలుపెట్టాయో కాని.. అవి నష్టపోవడంతోపాటు ప్రపంచంలో అన్ని దేశాలనూ కష్టాలను ఎదుర్కొనేలా చేస్తోంది. ఇప్పుడా యుద్ధం సెగ తెలంగాణలోని సింగరేణిని తాకింది. అసలు ఆ యుద్ధానికి, సింగరేణికి ఏమిటి సంబంధం అనుకోవచ్చు. కానీ సంబంధం ఉంది. ఎందుకంటే.. మన దేశానికి వచ్చే అమ్మోనియం నైట్రేట్ ఎక్కువగా ఈ రెండు దేశాల నుంచే వస్తుంది. ఇప్పుడు యుద్ధం వల్ల వాటి సరఫరా తగ్గింది. దీంతో బొగ్గు గనుల తవ్వకాలపై ఎఫెక్ట్ కనిపిస్తోంది.

సింగరేణిలో బొగ్గు గనుల నుంచి బొగ్గును తీయాలంటే భారీ పేలుళ్లు తప్పవు. ఎందుకంటే ముందు మట్టిని తొలగిస్తే కాని బొగ్గును వెలికితీయలేరు. దీనికోసం భారీగా పేలుళ్లు జరపాల్సిందే అంటున్నారు అధికారులు. దాదాపు ఏడు టన్నుల మట్టిని తొలగిస్తే కాని ఒక టన్ను బొగ్గును వెలికితీయడం సాధ్యం కాదు. నిజానికి మన దేశంలో కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు గనుల తవ్వకాల కోసం పేలుడు పదార్థాలు కావాలి. దాదాపు 11.50 లక్షల టన్నుల అమ్మోనియం నైట్రేట్ కావాలి. కానీ ఇందులో 3 లక్షల టన్నులకు పైగా దిగుమతులు ద్వారా రావాల్సిందే. పైగా దీనిలో రష్యా, ఉక్రెయిన్ నుంచి వచ్చేదే ఎక్కువ. ఇప్పుడు యుద్ధం వల్ల ఈ రెండు దేశాల నుంచి సరిపడా స్టాక్ రావట్లేదు.

సింగరేణిలో మట్టి పేలుళ్లకు రోజూ ఎలా లేదన్నా 750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ కావాల్సిందే. ఇందులో ఆ సంస్థే సొంతంగా 150 టన్నులను తయారుచేసుకున్నా మిగిలినదానికి ప్రైవేటు సంస్థలపై ఆధారపడుతోంది. వాళ్లు రోజూ దాదాపు 300 టన్నులు సరఫరా చేస్తున్నారు. అంటే ఈ 450 టన్నులుపోగా ఇంకా 300 టన్నులు కావాలి. ఇప్పుడదే కొరతగా ఉంది. సరఫరా పెంచమని ప్రైవేటు సంస్థలను కోరినా ఫలితం లేదు. ఎందుకంటే యుద్ధం వల్ల సప్లయ్ తగ్గిందంటున్నారు.

సింగరేణి ప్రస్తుత బొగ్గు ఉత్పత్తి టార్గెట్.. 6.80 కోట్ల టన్నులు. కానీ అమ్మోనియం నైట్రేట్ కొరతతో పేలుళ్లు జరపలేకపోవడం వల్ల 30 లక్షల టన్నుల మేన ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ఇదే జరిగితే.. బొగ్గు సరఫరా తగ్గిపోతుంది. పైగా దాని ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. అంటే సింగరేణి కూడా బొగ్గు ధరను పెంచుతుంది. అధిక ధరకు బొగ్గును కొంటే.. కరెంటు ధరలను పెంచకుండా విద్యుదుత్పత్తి కేంద్రాలు ఊరుకుంటాయా! అలా ఎక్కువ రేటుకు కొన్నప్పుడు ఆటోమేటిగ్గా ఆ భారాన్ని వినియోగదారులపైకే నెట్టేస్తాయి. సో.. అటు తిరిగి ఇటు తిరిగి.. యుద్ధం ప్రభావం సామాన్యుడి ఇంటి వెలుగుపై పడిందన్నమాట.