CM Revanth Reddy : 30 రోజుల పాలన ఎలా ఉంది..?

  • Written By:
  • Updated On - January 7, 2024 / 12:06 PM IST

ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని..’ చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నెల రోజులు అయ్యింది. ఈ నెల రోజుల్లోనే పాలనలో కొత్త మార్పు కనిపిస్తుంది. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండే తనదైన మార్క్ కనపరుస్తూ వస్తున్నాడు. నిర్ణయాల్లో నిక్కచ్చితనం..పని తీరులో పరిణితి, వ్యవహారాల్లో కలివిడితనం, ప్రతిపక్షాలతో పలకరింపులు, ప్రత్యేక టీమ్ ను ఎంపిక చేసి ప్రజా పాలన ను ప్రజల వద్దకు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తూ వెళ్తున్నారు.

నేటికీ తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా నెల రోజులు పూర్తి అయ్యింది. ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది..? సీఎం గా రేవంత్ ఎలా వ్యవహరిస్తున్నాడు..? ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఫై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా..? అనేది చూద్దాం.

డిసెంబర్ 07 తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన రోజు. సీఎం గా రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి గా భట్టి విక్రమార్క తో పాటు మరో పదిమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఈరోజుతో సరిగ్గా నెల రోజులు పూర్తి చేసుకుంది. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్..ప్రజా పాలన మొదలుపెట్టాడు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే మంత్రుల సమావేశం ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీల హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు సచివాలయంలోకి ఎవరికీ అనుమతి ఉండదనే ఫీలింగ్ లో ఉన్న ప్రజలకు భరోసా కలిపిస్తే మొదటిరోజే సచివాలయ తలుపులు తెరిచారు. ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెలు తొలగించారు. అంతే కాదు ప్రగతి భవన్ ను కాస్త ప్రజా దర్బార్ గా పేరు మార్చేశారు. అధికారంలోకి వచ్చిన రెండో రోజే ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజలు సమస్యలు తెలుసుకునే పని చేపట్టారు సీఎం రేవంత్. ఆ తర్వాత ప్రజా దర్బార్ ను ప్రజా వాణి గా మార్చేశారు. దానికి ఓ ఐఏఎస్ అధికారిని కూడా నియమించారు సీఎం. మంగళవారం , శుక్రవారం ప్రజల సమస్యలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరిస్తూ వస్తున్నారు.

ఇక అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీ హామీల్లో కీలకమైన ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల్లో నమ్మకం పెంచారు. ఇదే క్రమంలో ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలనీ బిఆర్ఎస్ ఒత్తిడి తెచ్చింది. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కి సంబదించిన శ్వేతా పత్రాన్ని రిలీజ్ చేయాలనీ భావించింది. దీనికి సంబదించిన డేటాను కలెక్ట్ చేసి..అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పెట్టింది. బిఆర్ఎస్ పాలన లో జరిగిన అవకతవకలు, లోటుపాట్లు ఇవ్వని బయటపెట్టింది. రాజకీయంగా బిఆర్ఎస్ ను శ్వేతా పత్రం పేరుతో కొంతవరకు కట్టడి చేయగలిగింది.

ఇక పరిపాలన ఫై తనదైన ముద్ర వేసేందుకు ట్రై చేసారు. హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లకు సీపీల నియామకం చేపట్టారు. నిబంధనలను సరిగ్గా పాటించే వారిని పోస్టింగ్ లో వేశారని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అదే విధంగా IAS లను మారుస్తూ ఆచితూచి అడుగులేశారని అంత భావించారు. అలాగే చాల నెలలుగా పనిలేని అధికారులకు పని అప్పగించి వారిని బిజీ చేసారు రేవంత్. అలాగే ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి కూడా అటు ఇటుగా ఉన్న అధికారులందర్నీ కూడా లూప్ లైన్లో లోకి పడేసారు. ఇక ఆరు గ్యారెంటీలకు సంబధించి కూడా ప్రభుత్వం నడుం బిగించింది.

ఇక కాంగ్రెస్ పార్టీ లో నేతలమంది అంతరగ్తా విభేదాలు అనేవి ఈనాటివికావు..నిత్యం కార్యకర్తలను ఇబ్బందికి గురి చేస్తూ..పక్క పార్టీలకు ప్లస్ చేస్తూ ఉంటుంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ఈ నెల రోజుల్లో ఎలాంటి విభేదాలు లేకుండా మంత్రులంతా ఎవరి పనిలో వారు బిజీ అయిపోయారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులను మాట్లేడేందుకు ఢిల్లీకి సీఎం రేవంత్ , ఉప ముఖ్యమంత్రి భట్టి వెళ్లి..కేంద్ర మంత్రులతో , ప్రధాని మోడీ తో మాట్లాడారు.

నిరుద్యోగుల కోసం తీసుకున్న నిర్ణయాలు :

గత పదేళ్లుగా ఏవిధమైన పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలను నిర్వహించక పోవడంతో యువతలో ఏర్పడ్డ తీవ్ర నిరాశ, నిస్పృహకు తొలగించటానికి జాబ్స్ క్యాలెండర్ ను ప్రకటిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో సహా సీనియర్ అధికారులను స్వయంగా ఢిల్లీ లోని యూపీఎస్సి కి వెళ్లి అక్కడ అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్న పోటీ పరీక్షల విధానాన్ని అధ్యయనం చేసారు. రెండు లక్షల ఉద్యోగాల నియామాలను చేపట్టడానికి తమ అధికారులకు తగు శిక్షణ నివ్వడానికి సవీకరించాల్సిందిగా యూ.పి.ఎస్.సి. చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు.

అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి డీ.ఎస్.సి ని కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పైగా, రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయితీలోనూ, గిరిజన తండాలోనూ తప్పనిసరిగా కనీసం ఒక్క ప్రాథమిక పాఠశాల ఉండేవిధంగా చర్యలు చేపట్టారు. దీనివల్ల అదే గ్రామాలోని పాఠశాల ఈడు పిల్లలు చదువులకు గాను ఇతర గ్రామాలు, పట్టణాలకు వెళ్లకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఇలా ప్రతి వూరిలో ఒక పాఠశాల ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. టాటా టెక్నాలజీస్ లాంటి దిగ్గజ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐ లలో దాదాపు ఒక లక్ష మంది విద్యార్థులకు శిక్షణ అందించి పలు పరిశ్రమలో ఉద్యోగాలు పొందే విధంగా తగు శిక్షణ అందించడానికి ముందడుగేసింది.

రాష్ట్రంలో పది స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం. రాష్ట్రంలో ప్రారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యంగల ఉద్యోగాలను సాధించేవిధంగా ఈ స్కిల్ యూనివర్సిటీ లుండాలని, ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే సమర్థవంతంగా నడుస్తున్న ఈ యూనివర్సిటీల పనితీరును అధ్యయనం చేయాలని కూడా సి.ఎం ఆదేశించారు.

మెట్రో విషయంలో కీలక నిర్ణయం :

పాతబస్తీ కి మెట్రో రైల్ ప్రాజెక్టు ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా గత కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తిరిగి, పాతబస్తీ మీదుగా మెట్రో రైల్ నిర్మాణాన్నీ చేపడుతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ మెట్రో రైలును పాత బస్తీ మీదుగా ఎయిర్ పోర్ట్ వరకు, నాగోల్ నుండి చాంద్రాయణ గుట్ట మీదుగా ఫలక్ నామ వరకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు, మియాపూర్ వరకు విస్తరించే ప్రణాళికలను కూడా స్పష్టమైన రీతిలో
సీఎం ప్రకటించారు.

ఫార్మా పరిశ్రమల విషయంలో తీసుకున్న నిర్ణయాలు :

నగరంలో కాలుష్య కారకాలుగా ఉన్న ఫార్మా పరిశ్రమలను నగర శివారులో ఫార్మా సిటీ పేర ఏర్పాటు చేసి మళ్ళి మరో కాలుష్యానికి తెరతీసే విధానాన్ని వ్యతిరేకించారు. ఔటర్ రింగ్ రోడ్ కు వెలుపల నగరానికి దూరంగా పది ఫార్మా విలేజ్ లను ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపించారు. దీనికి తోడు, ప్రతీ ఉమ్మడి జిల్లాలలో నిరుపయోగంగా ఉండి, అక్కడి భూ యజమానులకు ఏవిధమైన నష్టం వాటిల్లకుండా కనీసం వంద ఎకరాలు సేకరించి పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకో నున్నట్టు రేవంత్ స్పష్టం చేశారు.

ఓవరాల్ గా ఈ నెల రోజుల్లో రేవంత్ ఫై పాజిటివ్ తో పాటు కాస్త నెగిటివ్ కూడా వస్తుంది..అదే మహిళల ఫ్రీ పథకం విషయంలో..ఈ ఫ్రీ పథకం వల్ల తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు , క్యాబ్ డ్రైవర్స్ తో పాటు ఇతర ప్రవేట్ వాహనాలు నడిపే వారు ప్రభుత్వం ఫై కాస్త వ్యతిరేకత కనపరుస్తున్నారు. వీరి విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది..అంతే తప్ప రేవంత్ నెల రోజుల పాలనలో ఎలాంటి విమర్శలు లేవు.

Read Also : BRS – MLC Elections : ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి బీఆర్ఎస్ దూరం.. ఎందుకు ?