By: డా. ప్రసాదమూర్తి
Election Season : చైనాలో ఒక సామెత ఉంది. “ఆకలితో ఉన్న వాడికి చేపలు పెట్టడం కాదు, చేపలు పట్టడం నేర్పాలి“. ఈ సామెతకు సంపూర్ణ అర్థం చైనా వారు తెలుసుకున్నారు. కాబట్టే అక్కడ సగటు పౌరుని ఆదాయం ప్రపంచ దేశాల్లో అత్యంత మెరుగైన స్థితిలో ఉంది. కానీ మన వాళ్లు ఎప్పుడు తెలుసుకుంటారనేది అతిపెద్ద ప్రశ్నార్థకం. ఎన్నికలు (Election) వస్తే చాలు మన నాయకులు పోటా పోటీలుగా వాగ్దానాలు కురిపిస్తారు. పథకాలు ప్రకటిస్తారు. మేనిఫెస్టోలు రచిస్తారు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ప్రజలను ఊరించడంలో ఒకరిని మించి ఒకరు కసరత్తులు చేస్తుంటారు. నిన్న తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రజలకు అనేక వాగ్దానాల వర్షం కురిపించారు.
ఇంతకుముందే చాలా రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు ఆరు పథకాలతో ఆశ చూపించింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ చేసిన వాగ్దానాల కంటే మరింత మెరుగైన వాగ్దానాలు చేయడానికి ముందుకు వచ్చింది. ఇకిప్పుడు మేమంటే మేము అని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారు. మా పథకాలను కాపీ కొట్టారని ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వాస్తవానికి అంకెలలో కొంచెం అటూ ఇటూ మార్పే గాని, రెండు పార్టీలూ ప్రకటించిన పథకాలు మాత్రం ఒకటే. ముందు ప్రకటించిన కాంగ్రెస్ కంటే ప్రతి పథకానికి కొంత మొత్తాన్ని అధికం చేసి ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక (Election Sechedule) విడుదల చేసింది. కాంగ్రెస్ వారు మహాలక్ష్మి పేరిట మహిళలకు ప్రతినెల 2,500 ప్రకటిస్తే బీఆర్ఎస్, గృహలక్ష్మి పేరు మీద నెలకు 3000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది. కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని హామీ ఇస్తే, బీఆర్ఎస్ 400 కే ఇస్తామని చెప్తోంది. ఇదే వరుసలో కాంగ్రెస్ పార్టీ చేయూత పథకం కింద నెలకు రూ. 4000 పెన్షన్ ప్రకటిస్తే, బీఆర్ఎస్ వారు ఇంకొంచెం ముందుకు వెళ్లి నెలకు 5000 దాకా ఆసరా పథకాన్ని ప్రకటించారు.
ఇది మొదటి సంవత్సరం 3000 తో మొదలై ఐదవ సంవత్సరం వచ్చేసరికి 5000 రూపాయలు తుంది. అలాగే రైతుబంధు పథకం కింద పదివేల తో మొదలై ఐదేళ్లలో 16 వేలకు చేరుకుంటుంది. ఇలా ఆరోగ్యశ్రీ పథకం, దళిత బంధు పథకం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.. రకరకాల పథకాలను బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ పథకాలన్నీ తాము ప్రజలకు హామీ ఇచ్చినవేనని, కర్ణాటకలో ఎప్పటికే అమలు చేస్తున్నామని, తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ వారు అంటున్నారు.
ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు. ఒకరిని చూసి మరొకరు సంక్షేమ పథకాల జోరు సాగిస్తున్నారు. ఈ పథకాల అమలుకు వేలాది కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఆపదలోనూ అవసరంలోనూ ఉన్న ప్రజలను ఆదుకోవడం పాలకుల బాధ్యత. అది నిజమే కానీ, ప్రజలకు సంవత్సరానికి ఎంతో కొంత ముట్టజెప్పి అంతటితో తమ కర్తవ్యం ముగిసిందని పాలకులు భావించే వాతావరణాన్ని ఇప్పుడు దేశంలో ప్రతి చోటా నెలకొల్పుతున్నారన్న విమర్శ కూడా నిజమే అని గమనించాలి. ఇలాంటి ఉచిత పథకాల వల్ల బడ్జెట్ మీద తీవ్ర ప్రభావం ఉంటుందని, రాష్ట్రాల్లో గాని దేశంలో గాని ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు కొరత ఏర్పడుతుందని, కేంద్రంతో సహా అత్యున్నత న్యాయస్థానంతో సహా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: BRS Manifesto: బీఆర్‌ఎస్ మేనిఫెస్టోకు విలువ లేదు
ఒక పార్టీ నుంచి మరొక పార్టీ ఇలా ఉచిత పథకాల వేటలో పడి కొట్టుకుపోతుంటే రాష్ట్రాలకు, దేశానికి అత్యవసరమైన అభివృద్ధి పనులు పూర్తిగా వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, నెలకోసారి.. సంవత్సరానికోసారి ప్రభుత్వం విదిల్చే చిన్న చిన్న మొత్తాలకు సంతృప్తిపడి, ప్రజలు స్వావలంబన, స్వయంసమృద్ధి వైపు అడుగులు వేయడం మానుకుంటారు. అది క్రమక్రమంగా దేశంలో ప్రజల స్వీయాభివృద్ధికి పెను విఘాతంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్న విషయం కూడా ఇదే.
సంక్షేమ పథకాలు అంటే ప్రజలకు ఉచితంగా ప్రభుత్వాలు చేసే దానం లాంటిదే. కానీ ప్రజలకు కావలసింది సొంత కాళ్ళ మీద నిలబడి స్వయం శక్తితో స్వావలంబన సాధించడం. దాన్ని మన ప్రభుత్వాలు, పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతేకాదు విద్యా వైద్య ఉద్యోగ రంగాలలో మెరుగైన వసతుల కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి అటు దిశగా అడుగులు వేయడం కోసం బడ్జెట్ కేటాయింపులు రానురాను కుదించుకుపోతున్నాయి. ఇది ఒక దేశ అభివృద్ధికి పెను ప్రమాదం లాంటిది. పార్టీలు ప్రకటిస్తున్న ఈ పథకాలు మొత్తం పరిశీలిస్తే అందులో ఎక్కడా ప్రజలకు దీర్ఘకాలం ప్రయోజనాలు కలిగించే ఉద్యోగ అవకాశాల విషయంలో గానీ, పారిశ్రామిక అభివృద్ధి విషయంలో గాని, వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పుల కోసం, రైతుల ఆత్మ నిర్భరత కోసం, శాస్త్ర సాంకేతిక నైపుణ్యంతో అధిక దిగుబడుల కోసం.. ఎవరు ఏం చేస్తారనేది ఏ మ్యానిఫెస్టోలోనూ మనకు కనిపించదు.
కేవలం ‘ మీరు చేతులు చాపండి మేము మీ దోసిట్లో మాకు తోచింది ఏదో విసిరేస్తాం. మీరు మాకు ఓట్లు వేయండి ఐదేళ్ళూ మీరు మా వైపు ఇలాగే ఎదురు చూస్తూ ఉండండి’ అన్నట్టుగా ఉంది మన రాజకీయ పార్టీల మేనిఫెస్టోల వాగ్దానాల సారాంశం. ఉచితాలు అవసరమే గాని అవి హద్దు మీరి అనుచితాలుగా మారిపోతే తాత్కాలిక ప్రయోజనాలతో సంబరపడిపోయే ప్రజలు దీర్ఘకాలిక ప్రమాదాల లోయల్లో కూరుకుపోతారని గుర్తించాలి. నేను పైన చెప్పిన సామెత మరొకసారి గుర్తు చేస్తాను. ఆకలితో ఉన్న వాడికి చేపలు పెట్టడం కాదు, చేపలు పట్టడం నేర్పాలి.
Also Read: Manifesto Politics: కాంగ్రెస్ మేనిఫెస్టోని చిత్తు కాగితంలా తీసిపడేసిన కవిత