Covid 4th Wave: కోవిడ్ నాలుగో దశ గురించి టెన్షన్ పడక్కరలేదా? సీసీఎంబీ ఏం చెప్పింది?

కరోనా రాక్షసి పేరు చెబితే ఇప్పటికీ ప్రపంచం వణికిపోతోంది. ఇది వెలుగుచూసి రెండేళ్లు గడిచినా ఇంకా కేసులు తగ్గడం లేదు.

  • Written By:
  • Updated On - May 2, 2022 / 12:47 PM IST

కరోనా రాక్షసి పేరు చెబితే ఇప్పటికీ ప్రపంచం వణికిపోతోంది. ఇది వెలుగుచూసి రెండేళ్లు గడిచినా ఇంకా కేసులు తగ్గడం లేదు. ఒక్కో వేవ్ చూపిస్తున్న ప్రభావంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. వచ్చే నెలలో నాలుగో వేవ్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో ప్రజల్లో భయం ఇంకా పెరిగింది. దానికి తగ్గట్టే కేసుల పెరుగుదలలో సగటు కూడా అలాగే ఉంది. ఏప్రిల్ 16న వారం రోజుల సగటును చెక్ చేస్తే.. 975 కేసులు ఉన్నాయి. ఇక కోవిడ్ తగ్గుతున్నట్టే అనుకున్నారు. కానీ ఆ తరువాత రెండు వారాలు గడిచాయో లేదో పెరిగాయి. ఆ సగటును సరిచూస్తే.. కేసుల సంఖ్య 3 వేలకు పెరిగింది.

కేసుల పెరుగుదల నిలకడగా ఉంటుందా లేక ఇంకా ఎక్కువవుతాయా అన్నది మరో టెన్షన్. కానీ శాస్త్రవేత్తలు చెప్పినదానిని బట్టి చూస్తే.. అది ప్రజల రోగనిరోధక శక్తిపైనే ఆధారపడి ఉంటుంది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెప్పేదీ ఇదే. ఇప్పటికైతే ఒమిక్రాన్ ఉపరకాలే వ్యాప్తిలో ఉన్నాయి. కొత్త వేరియంట్లు రాలేదు. ఇవేవీ ప్రజల ఆరోగ్యాన్ని సమూలంగా నాశనం చేసే స్థాయిలో లేవు.

ఆర్ఎన్ఏ వైరస్ లో కొత్త వేరియంట్లు పుట్టుకురావడం మామూలే. కాకపోతే అవన్నీ డేంజర్ అని చెప్పలేం. ఢిల్లీలో కేసుల పెరుగుదలకు కూడా బి.ఏ.2.12.1 కారణం. ఇది కూడా ఒమిక్రాన్ ఉపరకమే. కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో చూసినా వైరస్ లక్షణాలు తీవ్రంగా లేవు. ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు కనిపించడం లేదు. కాకపోతే ఫోర్త్ వేవ్ ను ముందే కనిపెట్టేందుకు వీలుగా ఇప్పటికీ సీసీఎంబీ శాస్త్రవేత్తలు మురుగునీటి నమూనాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఇక కేసులు పెరుగుతున్నాయి అని నాలుగైదు రోజుల ముందే తెలుసుకునే వీలుంటుందన్నారు నిపుణులు.