Congress vs BJP : బిజెపి ‘పద్మ’వ్యూహాన్ని కాంగ్రెస్ ఛేదించగలదా..?

ఇక్కడ అధికార పార్టీ బీఆర్ఎస్ తో ఢీకొంటూనే బిజెపిని కూడా అడ్డుకునే ద్విముఖ పోరాటం చేయవలసి ఉంటుంది కాంగ్రెస్ (Congress) పార్టీకి.

  • Written By:
  • Updated On - October 25, 2023 / 03:28 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Telangana Congress vs BJP Strategy : కమలనాథులు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ని కట్టడి చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకునే అన్ని అవకాశాలనూ బిజెపి అన్వేషిస్తుంది. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో కాంగ్రెస్ పార్టీ బిజెపితోనే డైరెక్ట్ ఫైట్ లో ఉంటుంది. తెలంగాణకు వచ్చేసరికి పోటీ ముక్కోణమైంది. ఇక్కడ అధికార పార్టీ బీఆర్ఎస్ తో ఢీకొంటూనే బిజెపిని కూడా అడ్డుకునే ద్విముఖ పోరాటం చేయవలసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. ఒకపక్క సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఫలితాలు, పరిశీలనలను వెల్లడిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ (Congress) కి చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా ఉండడం సహజమే. కానీ ఓట్ షేరింగ్ లో అధికార బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా కనిపించడం లేదు. దీనికి తోడు గత ఎన్నికల కంటే చాలా ఎక్కువగా ఇప్పుడు బిజెపి సాధించబోయే ఓట్ షేరింగ్ దాదాపు 17 శాతం ఉంటుందని అంచనా వేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే మనం భావించాలి. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్ తో తలపడితేనే సరిపోదు. రంగంలో ఉన్న బిజెపికి కూడా ఓట్లు ఎక్కువ శాతం రాకుండా కట్టడి చేయాల్సి ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ఎంత సమర్ధంగా ఎదుర్కోవాల్సి ఉంటుందో బిజెపిని అంతే సమర్థంగా ఏకకాలంలో ఎదుర్కోవాలి. అంటే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టాలంటే, తమ చుట్టూ బిజెపి పన్నిన పద్మవ్యూహాన్ని ముందుగా ఛేదించాల్సి ఉంటుంది.

బిజెపి వర్సెస్ కాంగ్రెస్ (BJP vs Congress):

ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపి బలాబలాలు ఏమిటి.. వాటి బలహీనతలు ఏమిటి అనే చర్చ ముందుకు వస్తుంది. బిజెపి దేశవ్యాప్తంగా తమ అధినాయకుడు నరేంద్ర మోడీ అని ఏకైక నాయకత్వ మంత్రాన్ని జపిస్తుంది. ఆ మంత్రాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ (Congress) పార్టీ ఒక వ్యక్తిని ముందుకు పెట్టడానికి ఇంకా ముందుకు రావడం లేదనే చెప్పాలి. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్ దేశవ్యాప్తంగా అద్భుతంగా పెరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, మణిపూర్ హింసకాండ కావచ్చు, అదాని వివాదం కావచ్చు, బీసీ రిజర్వేషన్ అంశం కావచ్చు ఇలా అనేక విషయాలు మీద ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ తీసుకున్న స్పష్టమైన వైఖరి, ఆయన మాట్లాడుతున్న తీరు రాహుల్ గ్రాఫ్ ని బాగా పెంచిందని చెప్పాలి. కానీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి దీటుగా పోటీ ఇచ్చే సమర్ధుడైన నాయకుడు ప్రతిపక్షం నుంచి కనిపించడం లేదనేది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

తెలంగాణలో కూడా కాంగ్రెస్ (Congress) పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఇంతవరకు తేల్చలేదు. అలాగే పార్టీ పూర్తి అభ్యర్థుల జాబితా ఇంకా విడుదల చేయనేలేదు. పార్టీలో సీనియర్లు ఎక్కువగా ఉన్న కారణంగా వారందరినీ సంతృప్తి పరచడం అనే కసరత్తు జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ కి తెలంగాణలో ఉన్న ఈ ప్రధానమైన అడ్డంకి బిజెపికి లేదు. అయితే బిజెపి విషయంలో గానీ కాంగ్రెస్ విషయంలో గానీ కేంద్ర నాయకత్వం పటిష్టంగానే ఉంది. బిజెపి వారు మోడీని చూపించి ఓటు వేయమని అడుగుతారు. కాంగ్రెస్ వారు రాహుల్ ని చూపించి ఓటు వేయమంటారా లేక సోనియా గాంధీ ని చూపించి, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అని ఆమెను ముందు పెట్టి ఓటు అడుగుతారా లేక తమ పథకాలనే ప్రధాన ఆస్త్రాలుగా చేసి ప్రచారం సాగిస్తారా ఇవన్నీ కాంగ్రెస్ ముందు ఉన్న ప్రశ్నలు.

తెలంగాణలో తాము అధికారంలోకి రాలేమని బిజెపి ఎన్నడో గ్రహించింది. కానీ దేశవ్యాప్త రాజకీయాల దృష్టిలో చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ (Congress) గెలవడం అనేది బిజెపికి సార్వత్రిక ఎన్నికలలో అత్యంత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అందుకే ఇక్కడ కాంగ్రెస్ ను ఓడించడమే బిజెపికి అతి ముఖ్యమైన విషయం. కాబట్టి అభ్యర్థుల ఎంపికలో బిజెపి ఆచితూచి వ్యవహరిస్తోంది. తాము రెండో స్థానంలో ఉన్నా, మూడో స్థానంలో ఉన్నా అక్కడ గణనీయంగా ఓట్లు సంపాదించాలనేది బిజెపి వ్యూహం. ఫలిస్తే దాని దెబ్బ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ మీదే ఎక్కువగా పడుతుంది. ఈ వ్యూహాన్ని కాంగ్రెస్ ఎలా ఛేదించగలదు అనేది రానున్న రోజుల్లోనే స్పష్టం కాగలదు.

రెండు పార్టీల సోషల్ ఇంజనీరింగ్:

కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ స్లోగన్ పట్టుకుంది. దీన్ని ఎదుర్కోవడానికి బిజెపి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కార్డును బయటకు తీసింది. ఇది కూడా ఒకరకంగా కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టే వ్యవహారమే. మరి బిజెపి ఇప్పుడు పన్నిన బీసీ వ్యూహాన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుంది? సోషల్ ఇంజనీరింగ్ అనేది నినాదం మాత్రం కాదు ఆచరణలో రుజువు చేయాలి. తన అభ్యర్థుల జాబితా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో దానిమీద సోషల్ ఇంజనీరింగ్ విషయంలో బిజెపితో పోరాటం ముడిపడి ఉంటుంది. అలాగే ఆంధ్ర సెట్లర్ల ఓట్లను ఆకర్షించడానికి పవన్ కళ్యాణ్ ద్వారా, చంద్రబాబు ద్వారా ప్రయత్నాలను ముమ్మరం చేసింది బిజెపి. చంద్రబాబు అరెస్టు తరువాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల బిఆర్ఎస్ పార్టీకి ఆంధ్ర సెట్లర్ల ఓట్లు, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన సానుభూతిపరుల ఓట్లు దక్కే అవకాశం లేదు. వాటిని దక్కించుకోవడానికి బిజెపి కంటే మెరుగైన స్థితిలో కాంగ్రెస్ ఉండాలి. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ బిజెపితో గట్టిగా తలపడాల్సి వస్తుంది.

మైనారిటీ ఓట్లు కీలకం:

మిగిలిన విషయాలతో పాటు తెలంగాణలో ముస్లిం మైనారిటీ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంటుంది. పాత బస్తీలో ఎలాగూ ఎంఐఎం పార్టీ ఎక్కువ సీట్లు సాధించుకుంటుంది. కానీ తెలంగాణలో మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతంలో ఆ ఓట్లను కాంగ్రెస్ పూర్తిగా దక్కించుకోవాలి. మజిలిస్ పార్టీ మద్దతు ఉన్న బీఆర్ఎస్ మైనారిటీ ఓట్లను రాబట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. బిజెపి వ్యతిరేక మైనారిటీ ఓటు మజిలీస్ పార్టీ సాయంతో బీఆర్ఎస్ కైవసం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటివరకు జరిగింది అదే. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఒక బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. ఇక్కడ బిజెపికి తగిన పోటీ ఇచ్చేది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే ఒక నమ్మకాన్ని మైనారిటీ వర్గానికి కలిగించినట్లయితే ఆ ఓట్లు కాంగ్రెస్ కే పడతాయి.

ఈ విషయంలో మజిలిస్ పార్టీ నాయకుల మద్దతు కాంగ్రెస్ కు లేదు, కనుక మజిలిస్, బిజెపి, టిఆర్ఎస్.. ఈ మూడు పార్టీలను వెనక్కి నెట్టి మైనారిటీ ఓటర్లను కాంగ్రెస్ సంపూర్ణంగా ఆకర్షించుకోగలగాలి. ఇది కూడా తెలంగాణలో కాంగ్రెస్ కు కత్తి మీద సాము లాంటిదే. ఈ మొత్తం కారణాలతో తెలంగాణలో బీఆర్ఎస్ తో గెలుపు అంటే అది బిజెపిని చిత్తుగా ఓడించినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వీలవుతుందని అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ చుట్టూ ఉన్న ‘పద్మ’వ్యూహాన్ని ఆ పార్టీ ఎలా ఛేదిస్తుందో దాని మీదే కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి అని చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది పోల్ మేనేజ్మెంట్. ఈ విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి గాని చాలా బలంగా ఉన్నాయి. వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందో చూడాలి.

Also Read:  CM KCR: కేసీఆర్ దూకుడు.. గెలుపే లక్ష్యంగా రేపట్నుంచి సుడిగాలి పర్యటన