Mirabai Chanu : కట్టెలు మోసిన చేతులతో పతకాల వేట

  • Written By:
  • Updated On - July 31, 2022 / 12:48 PM IST

బరువులు ఎత్తడం అమ్మాయిల వల్ల ఏమవుతుంది.. అనే వారందరికీ ఆమె కెరీర్ ఓ ఉదాహరణ. 11 ఏళ్లకే వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ మొదలుపెట్టి ఎలాగైనా తమ ఊరి పేరును ప్రపంచం మొత్తం మారుమోగేలా చేయాలన్నది వారి కుటుంబం కలను సాకారం చేసింది. వంట కోసం దుంగలు మోసిన చేతులతోనే అంతర్జాతీయ క్రీడావేదికపై పతకాలు కొల్లగొడుతోంది. ఆమె ఎవరో కాదు మణిపూర్ మణిపూస మీరాబాయి చాను. సాధారణంగా తన కోసం, తన కుటుంబం కోసం లక్ష్యాలను నిర్థేశించుకుని చాలా మంది ముందకెళతారు. అయితే మీరాబాయి చాను మాత్రం తన ఊరి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగాలన్న లక్ష్యంతో ప్రయాణం మొదలుపెట్టింది.. ఆ దిశగా అడుగులు వేసి తన లక్ష్యాన్ని సాధించింది. కొండ‌కోన‌ల్లో పుట్టి పెరిగి.. క‌డుపు నింపుకోవ‌డానికి క‌ట్టెలు మోసిన చాను చిన్న‌త‌నం నుంచి కుటుంబం కోసం ఎంత క‌ష్ట‌ప‌డిందో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ కోసం కూడా అంత‌గానే క‌ష్ట‌ప‌డింది.

దుంగలు మోయడం ఆమె వెయిట్ లిఫ్టింగ్ కెరీర్ కు బీజం వేసింది. మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌ దగ్గర్లోకి నాంగ్‌పోక్‌ కక్చింగ్‌లో పుట్టింది మీరాబాయి చానుది మధ్యతరగతి కుటుంబం. వంట కలప కోసం వెళ్లిన టైంలో తన అన్న కంటే ఎక్కువ బరువుల్ని మోసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా చిన్న వయసులోనే చానులోని సామర్థ్యాన్ని ఆమె కుటుంబం గుర్తించింది. అటుపై ఎంత కష్టమైనా సరే శిక్షణ ఇప్పించింది. పదకొండేళ్ల ప్రాయం నుంచే లోకల్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది చాను. అయితే మీరాబాయి కెరీర్ లో ఫస్ట్‌ బ్రేక్‌ 2014 గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నుంచి వచ్చింది. ఆ గేమ్స్‌లో చాను సిల్వర్‌ మెడల్‌ సాధించింది.

2016లో రియో ఒలింపిక్స్‌ పోటీల కోసం నేషనల్‌ ట్రయల్స్‌లో సత్తా చాటి మీరాబాయి చాను అరుదైన ఘనత సాధించింది. ఏడుసార్లు ఛాంపియన్‌, తాను ఆరాధ్య గురువుగా భావించే కుంజారాణి దేవి రికార్డును మీరాబాయి చెరిపేసింది. 2016లో రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం పోటీ పడినప్పటికీ.. విఫలమైంది. నిరాశ పడకుండా తిరిగి పుంజుకుని 2017లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. తద్వారా రెండు దశాబ్దాల తర్వాత ఆ ఫీట్‌ను సాధించిన భారత వెయిట్‌లిఫ్టర్‌గా నిలిచింది. 2018 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం, 2019లో ఏషియన్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యంతో మెప్పించిన ఆమె.. అయితే 2019 వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మాత్రం నాలుగో పొజిషన్‌తో సరిపెట్టుకుంది. ఆపై 2020లో సీనియర్‌ నేషనల్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తన రికార్డును తానే బద్ధలు కొట్టి స్వర్ణంతో మళ్ళీ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది.

టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయ్‌ చానునే. అంతేకాదు ఏకైక మహిళా వెయిట్‌ లిఫ్టర్‌గానూ నిలిచింది. ఒలింపిక్స్‌ 49 కేజీల విభాగంలో మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. అయితేనేం రజతం ద్వారా భారత్‌ పతకాల వేట షురూ చేసింది. రియో ఒలింపిక్స్‌లో ఓటమి చెందినప్పుడేటోక్యోలో తానేంటో నిరూపించుకోవాలని అని మీరాబాయి చెప్పడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ మెడల్ సాధించేందుకు కుటుంబానికి దూరంగా కఠిన శిక్షణే తీసుకుంది. మీరాబాయి ఐదేళ్లలో కేవలం ఐదు రోజులే ఇంటి వద్ద ఉందంటే తన లక్ష్యం పట్ల ఆమె అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేం.

సాధారణంగా ఒలింపిక్ మెడల్ గెలిచిన తర్వాత చాలా పేరు వస్తుంది. అవార్డులు, రివార్డులూ వస్తాయి. ఇంతటితో చాల్లే అనుకునేవారు లేకపోలేదు. మీరాబాయి చాను మాత్రం ఒక ఒలింపిక్ మెడల్ తో సంతృప్తి చెందే వ్యక్తిని కాదని నిరూపిస్తోంది. తర్వాత ఫిట్ నెస్ తో పాటు ఆటనూ మెరుగుపరుచుకుంటూ ఇప్పుడు బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణం గెలుచుకుంది. కామన్ వెల్త్ గేమ్స్ లో చానుకు ఇది అత్యుత్తమ ప్రదర్శన. గతంలో రెండు సార్లు రజత పతకం గెలుపొందిన మీరాబాయి చాను.. తొలిసారి పసిడిని ముద్దాడింది. అడవి నుంచి వచ్చి అంతర్జాతీయ క్రీడావేదికపై పతకాల పంట పండిస్తున్న మీరాబాయి చాను ప్రస్థానం అందరికీ స్ఫూర్తినిచ్చేదే.