Kidambi Srikanth: ఇండియా థామస్‌ కప్‌ను గెలిచింది అంటుంటే గర్వంగా ఉంది: స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 సార్లు థామస్‌ కప్‌ ఛాంపియన్ ఇండోనేషియా ను ఇటీవల ఇండియా ఓడించి కప్ ను కైవసం చేసుకుంది.

  • Written By:
  • Updated On - May 16, 2022 / 04:20 PM IST

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 సార్లు థామస్‌ కప్‌ ఛాంపియన్ ఇండోనేషియాను ఇటీవల ఇండియా ఓడించి కప్ ను కైవసం చేసుకుంది. మన బ్యాడ్మింటన్ జట్టుకు విజయాన్ని అందించడంలో తెలుగు తేజం, గుంటూరు షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషించాడు. భారత చిరకాల వాంఛ అయిన థామస్‌ కప్‌ గెలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. థామస్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ తనదైన శైలిలో ప్రత్యర్థి ఇండోనేషియా ఆటగాడు, ఏషియన్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ జోనాటన్‌ క్రిస్టీని 21–15, 23–21 స్ట్రెయిట్‌ సెట్స్‌లో మట్టికరిపించి తెలుగోడి సత్తా చాటాడు. ఈనేపథ్యంలో కిడాంబి శ్రీకాంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశారు. “ఇది నా ఒక్కడి వల్లో.. టీమ్ లో ఏ ఒక్కరి వల్లో వచ్చిన విజయం కాదు. జట్టులోని 10 మంది ఆటగాళ్ళ కృషి వల్లే థామస్‌ కప్‌ మన సొంతమైంది. నేను కెరీర్ లోనే అత్యుత్తమ ఆటతీరును అక్కడ కనబరిచాను. శ్రీకాంతో.. ప్రణయో.. థామస్ కప్ గెలిచారు అని అందరూ చెప్పుకోరు. ఇండియా గెలిచింది అని అంటారు. ఆ మాటలోనే గొప్ప అనుభూతి ఉంది. దేశం కోసం కప్ సాధించినందుకు గర్వంగా ఉంది” అని కిడాంబి శ్రీకాంత్‌ పేర్కొన్నారు.

1983లో వరల్డ్ కప్ గెలిచినట్టే.. ఇది కూడా : గోపీచంద్

ఇదే అంశంపై ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడా దిగ్గజం పుల్లెల గోపీచంద్ కూడా స్పందించారు. “1983లో క్రికెట్ వరల్డ్ కప్ ను ఇండియా
తొలిసారి గెల్చుకోవడం ఎంత సంచలన విషయమో.. ఇప్పుడు థామస్ కప్ ను కైవసం చేసుకోవడం కూడా అంతే గొప్ప విషయం. థామస్ కప్ ను ఇండియా గెలుస్తుందని చెబితే.. అప్పట్లో చాలా దేశాల వాళ్లు నవ్వే వారు. ఇప్పుడు వారంతా ఇండియా సత్తాను తెలుసుకున్నారు.” అని గోపీచంద్ వ్యాఖ్యానించారు.