Ind Vs SL 2nd Day: బ్యాట్‌తో అదగొట్టారు..బంతితో బెదరగొట్టారు

మొహాలీ టెస్టులో భారత్ పట్టుబిగించింది. తొలిరోజు జోరునే రెండోరోజూ కొనసాగిస్తూ లంకపై పూర్తి ఆధిపత్యం కనబిరిచింది.

  • Written By:
  • Updated On - March 5, 2022 / 10:46 PM IST

మొహాలీ టెస్టులో భారత్ పట్టుబిగించింది. తొలిరోజు జోరునే రెండోరోజూ కొనసాగిస్తూ లంకపై పూర్తి ఆధిపత్యం కనబిరిచింది. 357 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన భారత ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగే హైలెట్‌. లంక బౌలర్లను ఆటాడుకున్న జడ్డూ టెస్టుల్లో తన రెండో శతకాన్ని సాధించాడు. అశ్విన్‌తో కలిసి ఏడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జడ్డూ క్లాసిక్ షాట్లతో ఆకట్టుకున్నాడు. శతకం సాధించినప్పుడు.. 150 పరుగులు చేసినప్పుడు తనదైన బ్యాటుతో కత్తిని తిప్పుతూ సంబరాలు చేసుకున్నాడు. అశ్విన్ 61 పరుగులు చేయగా… జడేజా 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జడ్డూ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండగా.. డబుల్ సెంచరీకి చేరువలో రోహిత్‌శర్మ డిక్లేర్ చేయడం ఆశ్చర్యపరిచింది. చివరికి భారత్ ఇన్నింగ్స్‌ను 574 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో లక్మల్, ఫెర్నాండో , ఎంబుల్డెనియా రెండేసి వికెట్లు పడగొట్టారు.

తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంకకు ఓపెనర్లు తిరిమన్నే, కరుణారత్నే మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. వీరిద్దరినీ భారత స్పిన్నర్లు పెవిలియన్‌కు పంపారు. తర్వాత మాథ్యూస్ , డిసిల్వా కూడా ఔటవడంతో లంక 103 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. వరుస వికెట్లు కోల్పోయిన తర్వాత డిఫెన్స్‌లో పడిన లంక భారత బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడింది. రెండోరోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్లకు 108 పరుగులు చేయగా… నిస్సంక 26 , అసలంక 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. కరుణారత్నే 28, తిరిమన్నే 17, మాథ్యూస్ 22 , డిసిల్వా 1 పరుగుకు ఔటయ్యారు. ప్రస్తుతం లంక 466 పరుగులు వెనుకబడి ఉండగా..ఫాలోఆన్ తప్పించుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. బౌలింగ్‌లోనూ అదరగొడుతున్న రోహిత్‌సేన తొలి టెస్టులో గెలవడం ఇక లాంఛనమే. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓటమిని తప్పించుకోవాలంటే అసాధారణ రీతిలో పోరాడాల్సి ఉంటుంది.

Photo Courtesy- BCCI/Twitter