Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల క్రికెట్ కిట్లు మాయం..

ఐపీఎల్ 2023 లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఐదు మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఇప్పటివరకు విన్నింగ్ ఖాతా తెరవకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు

Delhi Capitals: ఐపీఎల్ 2023 లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఐదు మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఇప్పటివరకు విన్నింగ్ ఖాతా తెరవకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా మరో సంఘటనతో ఢిల్లీ ఆటగాళ్లు నవ్వులపాలయ్యారు. జోకులు పేల్చుతున్నారు విమర్శకులు. ఢిల్లీ ఫ్యాన్స్ సైతం పెదవి విరుస్తున్నారు. అసలేం జరిగిందంటే…

ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు తమ బ్యాటింగ్ కిట్లను పోగొట్టుకున్నారు. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. గత శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అనంతరం మంగళవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరు నుండి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల బ్యాట్‌లు, ప్యాడ్‌లు మరియు ఇతర కిట్లు పోగొట్టుకున్నారు. దాదాపుగా 16 లక్షల విలువ చేసే సామాగ్రి కనిపించకుండాపోయింది. ఢిల్లీ సారథి డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ బ్యాట్లు కనిపించకుండా పొయ్యాయి. బెంగళూరు నుంచి ఢిల్లీకి వచ్చిన ఆటగాళ్లు బస చేసే హోటల్ రూమ్ లో ఈ విషయాన్ని గుర్తించారు. డేవిడ్ వార్నర్, ఫిల్ సాల్ట్ కు చెందిన చెరో మూడు బ్యాట్లు మిస్ అవ్వగా.. మిచెల్ మార్ష్ కు చెందిన రెండు బ్యాట్లు కనిపించలేదు. మిగిలిన ఆటగాళ్ల షూస్, గ్లోవ్ లు కూడా చోరీకి గురయ్యాయి.. ఈ చోరీపై లాజిస్టిక్స్ కంపెనీకి, పోలీసులకు, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఫిర్యాదు చేసింది. కాగా.. విదేశీ ఆటగాళ్లకు సంబంధించి ఒక్కో బ్యాట్ ఖరీదు రూ.లక్ష ఉంటుందని సమాచారం.

ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయి IPL 2023 పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.

Read More: Vizag Capital : సెప్టెంబ‌ర్ లో విశాఖకు జ‌గ‌న్ కాపురం,మ‌ళ్లీ 3 రాజ‌ధానులు