Paddy Politics: వడ్ల రాజకీయంలో టీఆర్ఎస్, బీజేపీల్లో ఎవరి ఉచ్చులో ఎవరు చిక్కుకున్నారు?

తెలంగాణలో వడ్ల రాజకీయం క్లైమాక్స్ ని దాటింది. ఇప్పుడా కథ సుఖాంతం అయ్యింది. వడ్లను తెలంగాణ ప్రభుత్వమే కొంటుంది అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

  • Written By:
  • Updated On - April 13, 2022 / 12:19 PM IST

తెలంగాణలో వడ్ల రాజకీయం క్లైమాక్స్ ని దాటింది. ఇప్పుడా కథ సుఖాంతం అయ్యింది. వడ్లను తెలంగాణ ప్రభుత్వమే కొంటుంది అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరి ఇందులో ఎవరిది పైచేయి? కేంద్రంలో ఉన్న బీజేపీదా? కడవరకు పోరాడి ఓడినా.. రైతుల్లో పట్టు సాధించిన టీఆర్ఎస్ దా? ఈ రెండు పార్టీలు ఎన్ని తిట్టుకున్నా, కొట్టుకున్నా తమ ధాన్యాన్ని మద్దతు ధరకే అమ్ముకోగలిగిన రైతన్నదా?

బీజేపీ పన్నిన వ్యూహంలో కేసీఆర్ చిక్కుకున్నారని కొందరంటారు. టీఆర్ఎస్ బిగించిన ఉచ్చులో బీజేపీ ఇరుక్కుందని మరికొందరు అంటారు. నిజానికి ఇదేమీ ఇప్పుడిప్పుడే మొదలైన పోరు కాదు. ఇప్పుడప్పుడే తేలే లెక్కా కాదు. రాష్ట్ర రైతాంగం దృష్టిలో హీరోగా నిలబడి.. పొలిటికల్ ఇమేజ్ ను, మైలేజ్ ను పెంచుకోవడానికి టీఆర్ఎస్ స్కెచ్ వేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. రైతుల కోసం ఆల్రెడీ చాలా సంక్షేమ పథకాలు పెట్టిన తమకు వడ్లను కొనడానికి డ్రామాలు ఆడాల్సిన పని లేదని టీఆర్ఎస్ అంటోంది. మరి వీరిలో ఇప్పుడు ఎవరు గెలిచినట్టు?

ఏ రాజకీయపార్టీకైనా గెలుపు అంటే ఓట్లు, సీట్లే ప్రాతిపదిక. అందుకోసం వివిధ వర్గాల వారినీ దగ్గర చేసుకోవడానికి రకరకాల తాయిలాలు ఇస్తాయి. చాలా పార్టీలు అక్కడితో ఆగిపోతాయి. కానీ కేసీఆర్ స్టైల్ అది కాదు. తాయిలాలు ఇవ్వడంతోపాటు ఒకరకమైన ఎమోషన్ ను క్రియేట్ చేసి దానిని క్యాష్ చేసుకోవడంలో దిట్ట. అందుకే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీని బోనులో నిలబెట్టి దోషిగా చూపే ప్రయత్నాన్ని ఢిల్లీ దీక్ష ద్వారా సక్సెస్ ఫుల్ గా చూపించారని విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీ మాత్రం ఫుల్ ఖుషీగా ఉంది. కేంద్రం పరంగా చూస్తే.. కేసీఆర్ దే పైచేయి. రాష్ట్రం పరంగా చూస్తే.. కేసీఆర్ తో వడ్లు కొనిపిస్తున్న ఘనత తమదే అని ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కానీ బీజేపీ, టీఆర్ఎస్ లో ఎవరు విజయం సాధించారు అన్నది వచ్చే ఎన్నికల్లోనే తేలుతుంది. అప్పటివరకు ఎవరి లెక్కలు వారివి.