Meditation Benefits: ధ్యానం చేస్తే జీర్ణ వ్యవస్థ ఇక పవర్ ఫుల్!

  • Written By:
  • Publish Date - January 26, 2023 / 08:00 PM IST

ధ్యానం (మెడిటేషన్) గురించి.. దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అయితే అది మన జీర్ణ వ్యవస్థ పై ఎంతమేరకు ఎఫెక్ట్ చూపిస్తుంది ? ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది ? అనేది తెలుసుకునేందుకు చైనాలోని షాంఘై జియావో టోంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని షాంఘై మెంటల్ హెల్త్ సెంటర్‌ శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. డాక్టర్ జింగ్‌హాంగ్ చెన్ నేతృత్వంలో జరిగిన ఈ స్టడీలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.

అధ్యయనం విశేషాలు ఇవీ..

ధ్యానం అనేది వేల సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉంది. దీనికి పట్టుకొమ్మ ఎక్కడ ఉంది అంటే టిబెట్ లో అని చెప్పొచ్చు. ధ్యానం చేయడం వల్ల మానసిక , శారీరక ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. షాంఘై మెంటల్ హెల్త్ సెంటర్‌ శాస్త్రవేత్తలు
అధ్యయనంలో భాగంగా టిబెట్ లోని కొన్ని బౌద్ధ దేవాలయాలను సందర్శించారు. అక్కడ ప్రతిరోజూ గంటల కొద్దీ ధ్యానంలో ఉండే 37 మంది బౌద్ధ సన్యాసులను ఎంచుకున్నారు. వారి జీర్ణ వ్యవస్థపై
ధ్యానం ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నించారు. ధ్యానం వల్ల వారి జీర్ణాశయంలోని గట్ మైక్రోబయోమ్‌ సానుకూలంగా ప్రభావితం అవుతోందని గుర్తించారు. ఇక ఇదే సమయంలో శాస్త్రవేత్తలు ధ్యానం చేయని మరో 19 మంది టిబెట్ వాసులను కూడా ఎంపిక చేశారు. వారి గట్ లో ఎటువంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి? 37 మంది బౌద్ధ సన్యాసుల గట్ కు, 19 మంది సాధారణ ప్రజల గట్ కు ఉన్న తేడాను విశ్లేషించారు. ఇందులో ఒక ఆశ్చర్యకరమైన తేడాను గుర్తించారు. ధ్యానం చేసే గ్రూప్ లోని వాళ్ల గట్ లో ప్రివోటెల్లా, బాక్టీరాయిడ్స్ అనే రెండు బ్యాక్టీరియా జాతులను కనుగొన్నారు. వీటివల్ల మానసిక ఆరోగ్యం చేకూరుతోందని చెప్పారు. బౌద్ధ సన్యాసుల్లో నిరాశ , ఆందోళన స్థాయిలు చాలా తక్కువగా ఉండటానికి ఇవే కారణమని వివరించారు.

ఏమిటీ గట్?

గట్ ను తరచుగా ‘రెండవ మెదడు’ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ విస్తృతమైన నెట్‌వర్క్ మన మెదడులోని కొన్ని ప్రత్యేక రసాయనాలు, కణాల సిగ్నల్స్ ను వాడుకొని మనకు ఆహారం జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియలో ఏదైనా తప్పుగా ఉన్నప్పుడు మెదడును అప్రమత్తం చేస్తుంది. ఈవిధంగా గట్-మెదడు మధ్య బలమైన కనెక్షన్ ఉంటుంది. ఈ రెండింటి నెట్‌వర్క్ మన శరీరంలోని జీవక్రియ, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి.