Broom Manufacturing Business: చీపుర్ల తయారీ బిజినెస్ లో ఏడాది పొడవునా ఎనలేని డిమాండ్

Broom Manufacturing Business : మంచి బిజినెస్ ఐడియా కోసం వెతుకుతున్నారా ? గిరాకీ ఎప్పటికీ ఉండే బిజినెస్ కోసం అన్వేషిస్తున్నారా ? అయితే ఈ ఐడియా మీకోసమే.. ఎప్పటికీ మాంద్యం లేని వ్యాపారం ఒకటి ఉంది. అదే చీపురు కట్టల తయారీ. వీటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. సేల్స్ ఆగడం అనే ముచ్చటే ఉండదు. మన దేశంలో చీపురుల వినియోగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గడ్డి, కొబ్బరి, తాటి ఆకులు, మొక్కజొన్న పొట్టు మొదలైన వాటితో తయారు చేసిన చీపుర్లు (Broom) మార్కెట్లో సేల్ అవుతుంటాయి. ప్రతి రోజూ ప్రతి ఇంట్లో వినియోగించే వస్తువు ఏదయినా ఉందంటే అది చీపురే.

ఇంటి నుంచే..

చీపురు కట్టల తయారీ బిజినెస్ ను మీరు ఇంటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఈ పని చేయడానికి మీకు ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. మీకు 50 చదరపు మీటర్ల స్థలం చాలు. చీపురును అనేక విధాలుగా తయారు చేయొచ్చు. ముందుగా మీరు ఎలాంటి చీపురును తయారు చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. చీపురు హ్యాండిల్ క్యాప్, ప్లాస్టిక్ టేప్, స్ట్రాపింగ్ వైర్ మొదలైనవి సాధారణంగా ముడి పదార్థాలుగా అవసరమవుతాయి. వీటి ద్వారా చీపురు వాటి ఆకారం లభిస్తుంది.

మార్కెటింగ్ ఇలా.. సంపాదన ఆలా..

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కనీసం రూ.15 వేలు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ వ్యాపారం స్టార్ట్ చేసి మీ చీపుర్లు కొనేందుకు హోల్ సేల్ షాపుల వాళ్ళను సంప్రదించండి. వాళ్లకు ఏ క్వాలిటీలో.. ప్రతి నెలా ఎన్ని చీపుర్లు కావాలో అడిగి తెలుసుకోండి. ఇప్పటికే చీపుర్లు తయారు చేస్తున్న వారు హోల్ సేల్ షాప్స్ వాళ్లకు ఏ ధరకు ఇస్తున్నారో ఆరా తీయండి. ఆ తర్వాత మీకు గిట్టుబాటు అయ్యేలా ఒక ధరను ఫిక్స్ చేసుకోండి. మీరు హోల్ సేల్ షాపుల వాళ్ళ సంఖ్యను పెంచుకోగలిగితే నెలకు రూ.40 వేల వరకు సులభంగా సంపాదించవచ్చు. మీ చీపురు నాణ్యత ఎంత బాగా ఉంటే, అంత బాగా సంపాదించగలుగుతారు.

సక్సెస్ ఫుల్ కేస్ స్టడీ ఇదిగో..

ఆంధ్రప్రదేశ్ లోని సంతబొమ్మాళి మండలం సీతానగరం గ్రామం చీపుర్ల పరిశ్రమగా మారిపోయింది. ఇక్కడి మహిళలు ఇళ్లలోనే చీపుర్లు తయారు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. వీరికి స్వయం సహాయక సంఘాల రుణాలు, స్త్రీ నిధి రుణాలు కూడా లభిస్తున్నాయి. గ్రామంలో మొత్తం 280 కుటుంబాలు ఉండగా ప్రస్తుతం 70కు పైగా కుటుంబాల మహిళలు నిత్యం చీపుర్ల తయారీ చేస్తున్నాయి. ఒక చీపురు హోల్ సేల్ ధర డిజైన్ ఆధారంగా రూ.100 నుంచి 150 వరకు ఉంటుంది. రోజుకు ఐదు నుంచి పది చీపుర్లు సులువుగా కట్టి ఖర్చులుపోనూ రూ.800కు పైనే సంపాదిస్తున్నారు. వీరు తయారు చేసిన చీపుర్లను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రానికి ఎగుమతి చేస్తుంటారు.

టైగర్‌ గ్రాస్‌ కు భారీ డిమాండ్

కొన్నేళ్ల క్రితం వరకు ఇంటిని శుభ్రం చేయడానికి తాటి, ఈత పొరకలు (చీపుర్లు) వాడేవాళ్లు. క్రమంగా వాటి స్థానంలో కొబ్బరి పుల్లలతో చేసే చీపుర్లు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఎక్కడ చూసినా, మెత్తని టైగర్‌ గ్రాస్‌ పొరకలే కనిపిస్తున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అందరూ వినియోగిస్తున్నారు. దీంతో ఈ పొరకల తయారీకి వాడే టైగర్‌ గ్రాస్‌కు గిరాకీ పెరిగింది. సాగుకు పనికిరాని భూముల్లో టైగర్‌ గ్రాస్‌ను పెంచితే, మంచి ఆదాయం వస్తుందని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు.పొరకలు (చీపుర్ల) తయారీలో టైగర్‌ గ్రాస్‌ (కంచె గడ్డి)ను వాడుతున్నారు. ప్రస్తుతం ఈ గడ్డితో భారీ స్థాయిలో చీపుర్లు తయారు చేస్తుండగా, ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. స్థానికంగా ఉత్పత్తి లేకపోవడంతో ధర ఆకాశాన్నంటుతున్నది. పొరక తయారీదారులు అస్సాం, నేపాల్‌ నుంచి ఈ టైగర్‌ గ్రాస్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఈ తరహా గడ్డి పొదలు తెలంగాణలో ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్‌ పార్కులో దట్టంగా పెరిగి కనిపిస్తాయి. వీటి పూలు చీపురు పుల్లలా ఉంటాయి. విశాఖ ఏజెన్సీలోనూ ఇవి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ టైగర్‌ గ్రాస్‌ మొక్కలు నర్సరీల్లో లభ్యమవుతాయి. ఒక్కసారి నాటితే చాలు. ఇవి ఎప్పటికీ పెరుగుతూ, చుట్టూ విస్తరిస్తూ ఉంటాయి. ఈ పూల కాడలను కోసి, ఎండబెట్టి చీపుర్ల తయారీలో వాడుతారు.

Also Read:  Business Ideas: తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించే వ్యాపారం ఇదే..!