Success Story: నేను కాదు.. అమ్మనే విజేత!

ఇది ఓ యువ ఐపీఎస్‌ అధికారి కథ. విజేతగా ఆయనను పరిచయం చేసే ముందు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలి.

  • Written By:
  • Publish Date - May 17, 2022 / 03:38 PM IST

ఇది ఓ యువ ఐపీఎస్‌ అధికారి కథ. విజేతగా ఆయనను పరిచయం చేసే ముందు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలి. ఆమె పేరు పద్మావతి. నల్గొండ జిల్లా జంగారెడ్డిగూడెం దగ్గరలోని పిళ్లాయిపల్లి స్వస్థలం. బాగా చదువుకుని జీవితంలో ఏదో సాధించాలన్నది ఆమె కల. అయితే చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి చేశారు. అయితేనేం తన పిల్లలు ఉన్నత స్థితికి రావాలన్నది ఆమె తపన. ఆ తపనే ఇవాల తన కుమారుడిని ఐపీఎస్‌ను చేసింది. నేనున్నానంటూ ఆ అమ్మ ఇచ్చిన భరోసాయే అతడిని విజేతగా నిలిపింది. అచీవర్స్‌ స్టోరీస్‌ సగర్వంగా అందిస్తున్న యువ ఐపీఎస్‌ ఎడ్మ రిషాంత్‌ రెడ్డి సక్సెస్‌ స్టోరీ..

రిషాంత్‌ రెడ్డి.. చెరగని చిరునవ్వు. గర్వం తెలియని వ్యక్తిత్వం. ఇట్టే కలిసిపోయే మనస్తత్వం. గలగలా మనస్ఫూర్తిగా మాట్లాడతారు. ఉన్నతంగా ఆలోచిస్తారు. మధ్య తరగతి కుటుంబాల కష్టాలు తెలిసిన వ్యక్తి. సున్నితమైన మనస్తత్వం. అయితేనేం జీవితం అంటే కిక్‌ ఉండాలని అంటాడు ఈ కుర్రాడు. నవ్వు, బాధ, ఆవేదన, కన్నీరు, ప్రేమ, బాధ్యత.. ఇలా ఉగాది పచ్చడిలా అన్నీ ఉంటేనే జీవితం అని అంటారాయన.

మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలో ఓ వ్యవసాయ కుటుంబంలో రిషాంత్‌ పుట్టారు. తల్లి పద్మావతి, తండ్రి గోపాల్‌రెడ్డి. పెద్ద చదువులు చదవాలి, ఉన్నతంగా ఉండాలన్న లక్ష్యంతో పిల్లలను హైదరాబాద్‌లో చదివించారు. వీరి కోసం చైతన్యపురిలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇద్దరు అక్కలతో కలిసి రిషాంత్‌ ఉండేవారు. ఏ లోటు లేకుండా కావాల్సినవన్నీ రిశాంత్ నాన్న సమకూర్చేవారు. 9వ తరగతి నుంచే హైదరాబాద్‌లో ఆయన చదువు మొదలైంది. వారం వారం తల్లిదండ్రులు భాగ్యనగరి వచ్చి వెళ్తుండేవారు. ఇంటర్‌ పూర్తి అయ్యాక ఐఐటీ చేయాలని రిషాంత్‌ భావించారు. ఇందుకోసం రామయ్య ఐఐటీ సెంటర్లో శిక్షణ కోసం రాసిన ఎంట్రన్స్‌లో ఫెయిల్‌ అయ్యారు. మరో కోచింగ్‌ సెంటర్‌లో చేరారు. అమ్మ, నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో కసిగా చదివారు. ఐఐటీ ముంబైలో 2004లో సీటు సంపాదించారు.

చదువు పూర్తి కాగానే 2008లో ఫ్యూచర్స్‌ ఫస్ట్‌ అనే కంపెనీలో చేరారు. కొన్నాళ్లు పని చేశాక ఫ్లాగ్‌స్టోన్‌లో జాయిన్‌ అయ్యారు. నెల జీతం రూ.1.25 లక్షలకు చేరింది. అయినా మనసులో ఏదో ఓ వెలితి. జీవితం అన్నాక ఓ పర్పస్‌ ఉండాలి. గూగుల్‌లో వెతికితే పేరు కనపడాలి. గౌరవం పొందే ఉద్యోగం చేయాలి అని ఆయన భావించారు. ఇందుకు సివిల్స్‌ ఒక్కటే పరిష్కారం అని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అమ్మకు ఫోన్‌ కలిపారు. తన మనసులో మాట బయట పెట్టారు. జాబ్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నానని చెప్పారు. ‘సివిల్స్‌ చేయాలని మనసులో ఉందా? అని అమ్మ నుంచి వచ్చిన ప్రశ్న. అవును అనగానే ఆమె ఓకే చెప్పేశారు. నాన్న సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కుటుంబానికి ఆసరాగా ఉన్న సమయంలో జాబ్‌ వదులుకోవడం అంటేనే పెద్ద రిస్క్‌. పైగా రిషాంత్‌ కుటుంబంలోగానీ, బంధువుల్లోగానీ ఎవరూ సివిల్స్‌ చేయలేదు. ఏటా ఆరు లక్షల మంది రాసే పరీక్షలో విజయం సాధించకపోతే ఎలా అన్న ప్రశ్నలూ ఆయనలో తలెత్తాయి. అయితే ఫెయిల్యూర్స్‌ గురించి ఆలోచిస్తే విజయం సాధించలేం అన్న భావనతో వెనక్కి చూడకుండా రంగంలోకి దిగారు. ఏం చదవాలో తెలియదు. పరిచయాలూ లేవు. మొదటి ప్రయత్నంలో మెయిన్స్‌లో ఫెయిల్‌ అయ్యారు. ఏం చేయాలో తోచని స్థితిలో అమ్మ భుజం తట్టారు. ఢిల్లీ వెళ్లి ప్రిపేర్‌ కావాలని సూచించారు. రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ దాకా వెళ్లినా ఫలితం దక్కలేదు. 2015లోనూ ప్రయత్నించారు. ఇంటర్వ్యూలో ఫెయిల్‌ అయ్యారు.

సివిల్స్‌ పోయింది. ఇప్పుడేం చేయాలి అన్న ప్రశ్న మళ్లీ పునరావృతమైంది. వైఫల్యాలు సహజం అంటూ అమ్మ, నాన్న ఇచ్చిన భరోసాతో నాల్గవ ప్రయత్నం మొదలు పెట్టారు. ఇప్పుడు లేదా ఎప్పుడూ కాదు అని గట్టిగా నిర్ణయించుకున్నారు. వైఫల్యాలను బేరీజు వేసుకున్నారు. అలుపెరుగని ప్రయాణం సాగించారు. ఇంకేముంది 2016 మే 10న వచ్చిన సివిల్స్‌ ఫలితాల్లో 180వ ర్యాంకుతో ఐపీఎస్‌ సాధించారు. ప్రస్తుతం నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు ఎంపికయ్యారు.

కన్నీళ్లు కార్చిన గదిలోనే ఆనంద బాష్పాలు రాల్చానని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు రిషాంత్‌. ‘2015లో చేసిన మూడో ప్రయత్నం ఫెయిల్‌ అవగానే గుండె అవిసేలా ఏడ్చాను. జీవితం అయిపోయింది అని బాధపడ్డాను. సివిల్స్‌ సాధించాక అదే గదిలో ఎమ్మెల్యే, సివిల్‌ సర్వెంట్స్, స్నేహితులు నన్ను అభినందించారు. ఆరోజు కూర్చున్న సోఫాలోనే రిపోర్టర్లు నన్ను ఇంటర్వ్యూ చేయడం మర్చిపోలేని అనుభూతి. అమ్మ నా నుదుట ముద్దు పెట్టుకున్న ఫోటోతో సాక్షి పేపర్లో ఫోటో వచ్చింది. నాకు కిక్‌ ఇచ్చిన రోజు అది. అమ్మా నాన్నకు నేను ఇంత కంటే ఏం బహుమానం ఇస్తాను. ఇవాల వారి ఆశలను నిలబెట్టాను’ అని అన్నారు.

‘ఎనమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కు నడిచి వెళ్లి అమ్మ చదువుకుంది. బాగా చదువుకోవాలన్నది ఆమె కోరిక. అందుకే మమ్మల్ని బాగా చదివించింది. ఆరాటం ఉన్నచోట పోరాటం ఉంటుంది. మా కోసం అమ్మానాన్న చాలా కష్టపడ్డారు. లగ్జరీ తెలియకుండా పెరిగాం. ఢిల్లీలో సివిల్స్‌ ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు షికార్లకు వెళ్లేవాడిని కాదు. ఆ సమయంలో అమ్మానాన్న కష్టం గుర్తొచ్చేది. చిన్ననాటి పరిస్థితులే నన్ను స్ట్రాంగ్‌గా చేశాయి. ఆ రోజులు ఎప్పుడూ మర్చిపోలేను. ఇక్కడో విషయం చెప్పాలి. రిస్క్‌ తీసుకునేవారు ఉన్నారు. అయితే విఘ్నాలు ఎదురుకాగానే వెనక్కి వచ్చేస్తారు. సమస్యలకు ఎదురొడితేనే ఎవరికైనా విజయం వరిస్తుంది. రిస్క్‌ని చాలెంజ్‌గా తీసుకున్నాను కాబట్టే ఇవాళ ఇక్కడున్నాను. ఇక అక్కలు శిరీష రెడ్డి, హరీశ రెడ్డి మాస్టర్స్‌ పూర్తి చేసి ప్రస్తుతం యూఎస్‌లో స్థిరపడ్డారు’ అని చెప్పారు.

‘ఆకలి అంటే నాకు తెలుసు. రైతులు కారుస్తున్న చమట విలువా తెలుసు. పల్లెలో పుట్టాను. నాకూ మనసుంది. రైతులు ఎప్పుడు బాగుపడతారో అని చిన్ననాటి నుంచి నా మనసు తొలిచేది. సమాజంలో సివిల్‌ సర్వెంట్లు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారు కాబట్టే ఈ రంగాన్ని ఎంచుకున్నాను. పోలీసింగ్‌ నోబుల్‌ జాబ్‌. బలవంతుడి నుంచి బలహీనుడిని కాపాడడం గొప్ప విషయం. బాధితులకు నేను ఉన్నాననే భరోసా ఇచ్చేవారే పోలీసు. ఈ సమాజంలో నావంతుగా ప్రభావితం చేస్తాను. విజేతల వెనకాల ఎందరో కనపడని అమ్మలు ఉన్నారు. నా విషయంలోనూ అంతే. నేను విజేతను కాను. అమ్మదే ఈ సక్సెస్‌ స్టోరీ’ అని తన మనసులో మాట చెప్పారు.

అచీవర్స్‌ స్టోరీస్‌ స్పందన: నాలాంటి విజేతల వెనకాల కనపడని అమ్మలు ఎందరో ఉన్నారు. మా గురించి రాస్తే వారి శ్రమ ఈ ప్రపంచానికి తెలియదు అని రిషాంత్‌ అన్న మాటలు మమ్మల్ని కదిలించాయి. అందుకే ఈ విజేతలిద్దరినీ పరిచయం చేశాం.

Source from : Facebook Page