KGF Real Story: కేజీఎఫ్ రియల్ స్టోరీ ఇదే, ఒకప్పటి లిటిల్ ఇంగ్లాండ్ ఇప్పుడు ఎలా ఉందంటే..!!

KGF అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం. కర్నాటకలోకి కోలార్ బంగారు గనులకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. హరప్పా మొహెంజోదారో నాగరికత నాటికే ఆ గనుల నుంచి బంగారాన్ని వెలికితీసేవారు.

  • Written By:
  • Updated On - May 2, 2022 / 06:22 PM IST

KGF అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం. కర్నాటకలోకి కోలార్ బంగారు గనులకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. హరప్పా మొహెంజోదారో నాగరికత నాటికే ఆ గనుల నుంచి బంగారాన్ని వెలికితీసేవారు. టన్నల కొద్దీ బంగారాన్ని ఇచ్చాయి ఆ అద్బుతమైన గనులు. బ్రిటీష్ కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పట్టణం ఎంతో అభివృద్ధి చెందింది. అత్యుత్తమ సౌకర్యాలన్నీ కూడా ఉన్నాయి. విశాలమైన బంగ్లాలు, స్పోర్ట్స్ క్లబ్ లు, క్లబ్ హౌస్ లు, జింఖానాలు, ఉత్తమ విద్యాసంస్థలన్నీ కూడా ఇక్కడ ఉండేవి. ఈ పట్టణాన్ని లిటిల్ ఇంగ్లాండ్ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేజీఎఫ్ లేదు కేజీఎఫ్ నీడ మాత్రమే అక్కడ మిగిలింది.

కోలార్ జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కేజీఎఫ్ పట్టణం. ఈ ఊరికి సరైన పబ్లిక్ బస్సు సౌకర్యం లేదు. సమీపంలో ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉన్నా చివరి మైలు కనెక్టివిటీ లేదు. భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ లో టింబర్ మ్యాన్ గా పనిచేసి కేజీఎఫ్ లో నివాసం ఉంటున్న అల్బర్ట్ తమ పట్టణానికి ప్రభుత్వ బస్సులు లేవని చెబుతున్నారు.

మేము 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాబర్ట్ సన్ పేట వద్ద ఉన్న సమీప బస్టాండ్ కు ఆటోరిక్షాల ద్వారా వెళ్లాలి. ఆటోలకు 60 రూపాయలు ఖర్చు అవుతుంది. ఊరి బస్సు వస్తే మాకు ఖర్చు తగ్గేది. బెంగళూరుకు రైళ్ల ప్రీక్వెన్సీ బాగానే ఉంది. కానీ మేము అన్ని సమయాల్లో రైళ్లపై ఆధారపడలేము కదా అని ఓ కార్మికుడు వాపోయాడు. నీటి సౌకర్యాలు కూడా లేవు. ఇళ్లకు పైపుల ద్వారా నీరు అందుతుంది. కానీ ఆ నీళ్లు వంటకు, తాగేందుకు పనికిరావు. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా తాగునీటి కొనుగోలు చేస్తున్నాం. తాగునీటి కోసం ప్రతిరోజూ 20నుంచి 30 రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. ఒకవేళ ట్యాంకర్ రానట్లైతే…8కిలీమీటర్ల దూరంలో ఉన్న బాణగిరి గ్రామం వరకు వెళ్లాల్సివస్తోంది. పట్టణంలోని రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్ కొన్ని నెలలుగా పనిచేయడం లేదని చెబుతున్నారు.

ఇక పట్టణంలో బంగారు గనుల్లో పనిచేసే కూలీల కోసం అప్పట్లో వేలాది చిన్న ఇళ్లు నిర్మించారు. ఇప్పటికీ చాలా కుటుంబాలు ఆ ఇళ్లలోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఆ ఇళ్లకు షీట్ కప్పులు మాత్రమే ఉన్నాయి. ఒక్క ఇళ్లుకూ కాంక్రీట్ కప్పులు లేవు. వర్షాకాలం, వేసవి కాలంలో అందులో నివసించేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాము ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేక ఇక్కడే కాలం వెల్లదీస్తున్నామని తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. వర్షం కాలం చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. వర్షపు నీరంతా కూడా ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. బంగారు గనుల తవ్వకాలు నడుస్తున్నప్పుడు కేజీఎఫ్ కు శివసముద్రం స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా ఉండేది. ఇది 1902లోనిర్మించిన విద్యుత్ ప్లాంట్ ఆసియాలోనే మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి యూనిట్.

కానీ నేడు నివాసితులు తరచుగా విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నారు. భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ 2001లో మూసివేసినప్ప్పుడు 3500మంది ఉద్యోగాలు చేసేశారు. అందులో కొన్ని కుటుంబాలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. కేజీఎఫ్ కు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లయితే కోల్పోయిన వైభవం తిరిగి దక్కుతుందని అక్కడ నివాసం ఉంటున్నవారు చెబుతున్నారు.