Site icon HashtagU Telugu

Chaitra Season: చైత్ర మాసం ప్రారంభం, ప్రకృతి శోభకు ప్రతీక ఉగాది

Beginning Of The Month Of Chaitra, Ugadi Symbolizes The Beauty Of Nature

Beginning Of The Month Of Chaitra, Ugadi Symbolizes The Beauty Of Nature

చాంద్రమానంలో వచ్చే మొదటి మాసమే చైత్ర (Chaitra) మాసం. పౌర్ణమి రోజున చంద్రుడు ‘చిత్త’ నక్షత్రంలో ఉండటం వలన ఈ మాసానికి చైత్రమాసమని పేరు. చైత్ర మాసాన్నే వసంతమాసం మధుమాసం అని కూడా పిలుస్తుంటారు. ఋతువులలో మొదటిదిగా చెప్పుకునే వసంతఋతువు ఈ మాసంలోనే మొదలవుతుంది. చైత్ర మాసపు తొలిరోజు నుంచే ‘శ్రీరామ నవరాత్రులు‘ మొదలవుతాయి. శిశిరంలో ఆకులు రాల్చే చెట్లన్నీ చైత్రంలో చిగురిస్తాయి. ఈ మాసంలో ప్రకృతి అంతా కొత్తదనాన్ని సంతరించుకుని పచ్చదనంతో కళకళలాడుతూ కనిపిస్తుంది.

చైత్ర (Chaitra) శుద్ధ పాడ్యమి రోజునే యుగారంభం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే దీనిని ‘ఉగాది‘ గా జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి .. కొత్తబట్టలు ధరించి .. భగవంతుడిని పూజించి .. ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఆ రోజు సాయంత్రం ఆలయానికి వెళ్లి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొనాలి. చైత్ర మాసంలో ‘దవనం‘ తో దేవతార్చన చేయడం వలన, అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక ఈ మాసంలో చేసే మంచినీటి దానం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని స్పష్టం చేస్తున్నాయి. చాలా మంది ఈ మాసం మొదలు వేసవి కాలం పూర్తయ్యేంత వరకూ ‘చలివేంద్రాలు‘ ఏర్పాటు చేసి బాటసారుల దాహాన్ని తీర్చుతుంటారు.

ఈరోజు నుండి వసంత నవరాత్రులు ప్రారంభం వసంత నవరాత్రుల్లో చేయవలసిన పారాయణం.

ఉగాది వస్తుందనే విషయాన్ని ప్రకృతి ముందునుంచే తెలియజేస్తూ వుంటుంది. మామిడి పిందెలు.. వేపపూత.. చెరుకు పంట.. కొత్తగా అంగడిలోకి అడుగుపెట్టిన బెల్లం ఇవన్నీ కూడా ఉగాదికి తమ సంసిద్ధతని వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి. తెలుగుతనాన్ని అణువణువునా సంతరించుకుని, ఇటు ఆధ్యాత్మిక పరంగాను.. అటు ఆరోగ్యపరంగాను ప్రభావితం చేసేదిగా ఉగాది పండుగ కనిపిస్తుంది.

జీవితంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులను కలిసి పంచుకోవాలనే సందేశాన్ని ఉగాది ఇస్తుంటుంది. సంప్రదాయం.. సంతోషం కలగలసినదిగా కనిపించే ఉగాదిలో, మొదటి తొమ్మిది రోజులు ఎంతో విశిష్టతను సంతరించుకున్నవిగా చెప్పబడుతున్నాయి. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ గల ఈ తొమ్మిది రోజులనే ‘వసంత నవరాత్రులు‘ అని అంటారు. ఈ వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుడి ఆరాధన అత్యంత విశేషమైనదిగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ తొమ్మిది రోజుల్లో సాయంత్రపు వేళలో చల్లనిగాలి వీస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తూ వుంటుంది. దీనిని రాములవారి గాలి అనీ.. తిరునాళ్ల గాలి అని జనం వాడుకలో చెప్పుకుంటూ వుంటారు. ఈ తొమ్మిది రోజుల పాటు సీతారాములను పూజించడం వలన సమస్తపాపాలు.. దోషాలు పూర్తిగా నశిస్తాయి. అలాగే ఈ వసంత నవరాత్రులలో ‘రామాయణం‘ పారాయణ చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ధర్మాన్ని రాముడు అనుసరించి .. ఆచరించి చూపాడు. అంతిమంగా ధర్మమే విజయాన్ని సాధిస్తుందని చాటిచెప్పాడు. అలాంటి రాముడిని ధర్మస్వరూపంగా ఆవిష్కరించినదే రామాయణం. ఈ కావ్యాన్ని చదవడం వలన తమని తాము సరిదిద్దుకునే అవకాశం కలగడమే కాదు, విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది. అందువలన వసంత నవరాత్రులలో రామాయణాన్ని పారాయణ చేయాలని స్పష్టం చేయబడుతోంది.

Also Read:  Ugadi Day: ఉగాది రోజున ఏమి చేయాలి..?