Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ ను మొదటిలోనే ఇలా గుర్తించండి..

మహిళలలో వయసు పెరుగుతున్నకొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. ఒక అధ్యయనం ప్రకారం 30 నుంచి 39 ఏళ్ల మహిళల్లో ప్రతి 233 మందిలో ఒకరికి రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని తేలింది.

  • Written By:
  • Updated On - January 23, 2022 / 10:39 AM IST

మహిళలలో వయసు పెరుగుతున్నకొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. ఒక అధ్యయనం ప్రకారం 30 నుంచి 39 ఏళ్ల మహిళల్లో ప్రతి 233 మందిలో ఒకరికి రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని తేలింది. రొమ్ముక్యాన్సర్‌కు అనేక అంశాలు కారణమవుతాయి. అయితే మొదటిలో కన్పించే లక్షణాలతో బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తిస్తే.. పెద్ద ముప్పు నుంచి బయటపడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యంగా బ్లెడ్ రిలేషన్ ఉన్నవారిలో ఎవరికైనా ఉంటే మిగిలిన వారికి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడేవారికి తిరిగి అదే రొమ్ములోకాని, మరో పక్కకానీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సాధారణంగా ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ రొమ్ముకణాలను ఉత్తేజపరుస్తుంది. అయితే ఈస్ట్రోజెన్‌ స్రావాలు సుధీర్ఘకాలంపాటు కొనసాగితే కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.
గర్భం రావడం, చిన్నారికి తల్లిపాలు పట్టించడం వంటి అంశాలు పీరియడ్స్ సంఖ్యను తగ్గిస్తాయి. దీనిద్వారా క్యాన్సర్‌ ముప్పు కూడా తగ్గుతుంది. ముప్ఫయి ఏళ్లు పైబడేవరకు గర్భం ధరించని మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్నిసార్లు మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి తగిన జాగ్రత్తలు తీసుకున్నా కూడా రొమ్ముక్యాన్సర్‌ రావచ్చు.
సాధారణంగా బ్రెస్ట్‌క్యాన్సర్‌ .. రొమ్ములో కణితుల రూపంలో బయటపడుతుంది. ఈ కణితులు నొప్పి లేకుండా, గట్టిగా ఉంటాయి. మరికొన్నిసార్లు మెత్తగా, సమానంగా కూడా ఉండవచ్చు. కాబట్టి రొమ్ముల్లో ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లడం మంచిది.

రొమ్ముక్యాన్సర్‌ సోకినప్పుడు కనిపించే మార్పులు..

రొమ్ముల్లో వాపు, ఇరిటేషన్, నొప్పి, చనుమొనల్లో నొప్పి, చనుమొనలు లోపలివైపునకు కృంగినట్లుగా అయిపోవడం, ఎరుపెక్కడం, చనుమొనల నుంచి పాలు కాకుండా ఇతర ద్రవాలు స్రవించడం, చంకల కిందిభాగంలో గడ్డలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. అయితే అన్ని రకాల గడ్డలూ క్యాన్సర్‌ కాకపోవచ్చు. కాబట్టి అది క్యాన్సరా, కాదా అని నిర్ధారణ చేసుకోవడం మంచిది. క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత సులువుగా చికిత్స చేయవచ్చు.
ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి..
ఇరవై ఏళ్ల వయసు దాటిన మహిళలు ప్రతినెలా రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవాలి. 20 నుంచి 40 ఏళ్ల వయసు మహిళలు ప్రతి మూడేళ్లకోసారి డాక్టర్‌ ఆధ్వర్యంలో మామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి.
40 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి ఏడాదీ పరీక్ష చేయించుకోవాలి. అలాగే 40 నుంచి 49 ఏళ్ల మహిళలు ప్రతి రెండేళ్లకోసారి డిజిటల్‌ మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. 50 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి ఏడాదీ డిజిటల్‌ మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి.
ఈ పరీక్షల సహాయంతో రొమ్ముక్యాన్సర్‌ లేదని నిర్ధారణ అయితే నిశ్చింతగా, నిర్భయంగా ఉండవచ్చు. ఒకవేళ ఉందని తేలితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ వద్ద చికిత్స తీసుకోవాలి. బ్రెస్ట్ కు సంబంధించిన ఏ సమస్య వచ్చినా సిగ్గు పడకుండా.. రొమ్ముక్యాన్సర్ లక్షణాలపై అవగాహన పెంచుకోవాలి. ఎక్కువ బరువున్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డైలీ వ్యాయామం చేయడంతో పాటు హెల్దీ ఫుడ్ తీసుకుని బరువును అదుపులో ఉంచుకోవాలి. మహిళల్లో ఆల్కహాల్ అలవాటు ఉంటే దానికి దూరంగా ఉండాలి.