Delimitation: దక్షిణాదికీ ఉత్తరాదికీ మధ్య డీలిమిటేషన్ చిచ్చు

పాలక బిజెపి ప్రభుత్వం మరో కొత్త ఎత్తు వేసినట్టు తెలుస్తోంది. ఆ వ్యూహమే డీలిమిటేషన్ (Delimitation). అదే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ.

  • Written By:
  • Updated On - September 26, 2023 / 08:32 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Delimitation: ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య ఘర్షణ ఈనాటిది కాదు. చరిత్ర పొడవునా ఉత్తరాది పాలకులు దక్షిణాదిలో ఉన్న మూలవాసులను అణచివేసి తమ పెత్తనాన్ని పదిలం చేసుకోవడానికి సాగించిన యుద్ధాలు, కుట్రలు, రక్తపాతాలు ఎన్నో. ఆర్య, అనార్య సంఘర్షణ మొత్తం ఇదే. ఆధునిక కాలంలో కూడా ఉత్తరాది వారు ఏదో ఒక రకంగా దక్షిణాదిపై తమ పెత్తనాన్ని ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అది హిందీ భాష పరంగా కావచ్చు, లేదా కేంద్రంలో పరిపాలించే పార్టీలుగా కావచ్చు, ఆ పార్టీల్లో నాయకత్వాన్ని పొందే వ్యక్తులుగా కావచ్చు, తరతరాలుగా ఇదే జరుగుతూ వస్తుంది. ఇప్పుడు పాలక బిజెపి ప్రభుత్వం మరో కొత్త ఎత్తు వేసినట్టు తెలుస్తోంది. ఆ వ్యూహమే డీలిమిటేషన్ (Delimitation). అదే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ.

తాజాగా లోక్ సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావడానికి జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అది 2021లో చేపట్టాల్సింది. కోవిడ్ కారణంగా ఆగిపోయింది. బిజెపి పాలనలో జనగణన జరగలేదు. ఇటీవల పార్లమెంట్లో హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ప్రకారం, 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాతే జనాభా లెక్కల ప్రక్రియకు శ్రీకారం చుడతారు. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఎంత సమయం పట్టినా, అది పూర్తయిన తర్వాతనే డీ లిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుంది.

దాని ఆధారంగా మహిళా రిజర్వేషన్ అమలు ప్రక్రియ సాగుతుంది. ఇదంతా సరే. మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అమలు కావడానికి జనాభా లెక్కల ప్రక్రియ, దాని తర్వాత జరిగే డిలిమినేషన్ ప్రక్రియ అనే రెండు కీలకమైన ఘట్టాలు పరిసమాప్తి కావలసి ఉన్నప్పటికీ, అది కేవలం మహిళా రిజర్వేషన్ కి మాత్రమే పరిమితమైంది కాదు. డిలిమిటేషన్ అంటే రాష్ట్రాల వారిగా జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజన చేస్తారు. దీని ప్రకారం ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Also Read: CBN : చంద్రబాబు క్వాష్ పిటిషన్‍పై నేడు సుప్రీంకోర్టులో ప్రస్తావన

తాజాగా ఇండియా టుడే గ్రూప్ సంస్థ చేసిన సర్వే ప్రకారం, ఇతర సంస్థలు చేసిన సర్వే ప్రకారం వివిధ రాష్ట్రాల్లో జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున నియోజకవర్గాల సంఖ్య కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ విషయం మీద ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎప్పుడో హెచ్చరించారు. నిన్న తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాలను విభజిస్తే తెలుగు రాష్ట్రాలు ఒక్కొక్కటి 8 స్థానాలు కోల్పోతాయట. అలాగే తమిళనాడు కేరళ కూడా 8 స్థానాలు కోల్పోయే అవకాశం ఉందట. ఇదే క్రమంలో ఉత్తరాది నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

ఇదే జరిగితే పార్లమెంటులో ఉత్తరాది ప్రభావం పెరిగి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఘోరంగా పడిపోతుంది. ఇప్పటికే అనేక విధాలుగా దక్షిణాదిపై అణచివేతను, ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఉత్తరాది నాయకుల పెత్తనం మరింత బలపడుతుంది. ఇది రానున్న కాలంలో, క్రమంగా దేశానికి దిశా నిర్దేశం చేసే చట్టపరమైన, పాలనాపరమైన, న్యాయపరమైన, సామాజికపరమైన అంశాలలో కీలకపాత్రను ఉత్తరాది వారే పోషిస్తారు. దక్షిణాది వారికి తగిన ప్రాతినిధ్యం ఉండదు. వారి అభిప్రాయాలకు గాని నమ్మకాలకు విశ్వాసాలకు సిద్ధాంతాలకు సూత్రాలకు ఎలాంటి విలువ లేకుండా పోతుంది.

ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల నాయకులలో తీవ్రమైన ఆందోళన కలిగించడానికి కారణమైంది. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకొని దక్షిణాదిని కబళించడానికి కేంద్రంలో ఉన్న ఉత్తరాది నాయకులు కొత్త ఎత్తులు పన్నుతున్నారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్న స్థానాలు కోల్పోయి దేశంలో పాలనా రంగంలో, శాసన వ్యవస్థలో దక్షిణాది వారి భాగస్వామ్యం ఘోరంగా పడిపోతే అది ఉత్తరాది దక్షిణాది మధ్య భయంకరమైన యుద్ధంగా పరిణమించవచ్చు. అలా జరగకుండా రెండు ప్రాంతాల మధ్య సమతుల్యతను పాటించి, అందరి ప్రాతినిధ్యానికీ సమాన అవకాశాలు ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే. అందుకే దక్షిణాది నాయకులు ఇప్పటినుంచే కేంద్రానికి హెచ్చరికలు చేస్తున్నారు.