M.S. Swaminathan : స్వామినాథన్.. నీకు దేశమే రుణపడింది

ఎం.ఎస్. స్వామినాథన్ (M.S. Swaminathan) మరణం భారతదేశానికి, యావత్ ప్రపంచానికి, వ్యవసాయ రంగంలో జరిగే పరిశోధనలకి తీరని లోటు.

  • Written By:
  • Updated On - September 29, 2023 / 12:02 PM IST

By: డా. ప్రసాదమూర్తి

M.S. Swaminathan : కొందరు వ్యక్తులుగానే పుడతారు. ప్రభుత్వాలే చేయలేని మహత్తర కృషి చేసి మహా శక్తులుగా ఎదుగుతారు. పుటుక నీది చావు నీది.. బతుకంతా దేశానిది అన్నట్టు వారు బతుకుతారు. అలాంటి మహనీయుడే ఎం.ఎస్.స్వామినాథన్. పాల విప్లవానికి కొరియన్ ఎంతటి వాడో, హరిత విప్లవంలో స్వామినాథన్ అంతటి వాడు. మన దేశం జోలె పట్టుకుని ప్రపంచ దేశాల ముందు ఆహారం కోసం నిలబడే దుస్థితి నుంచి తన అపారమైన పరిశోధనా శక్తితో కాపాడిన ఘనుడు. ఎం.ఎస్. స్వామినాథన్ (M.S. Swaminathan) మరణం భారతదేశానికి, యావత్ ప్రపంచానికి, వ్యవసాయ రంగంలో జరిగే పరిశోధనలకి తీరని లోటు. అయితే కాలానికి ఎంతటి వారైనా లొంగ వలసిందే కదా. నూరేళ్ల జీవితానికి అతి చేరువుగా వెళ్లి 98 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు. కానీ వ్యవసాయ రంగంలో ఆయన చేసిన కృషి, పరిశోధన భారతదేశానికి చేసిన దిశా నిర్దేశం.. కాలం ఉన్నంతకాలం గుర్తుపెట్టుకోవాల్సిందే. భారతదేశానికి చెందిన ఈ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, వ్యవసాయ రంగానికి చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. అంతులేని పుస్కారాలు పొందారు. అయితే పురస్కారాల ద్వారా వచ్చిన మొత్తాన్ని తన పరిశోధనా రంగానికే వినియోగించిన విశిష్ట వ్యక్తి స్వామినాథన్.

WE ARE ON WHATSAPP CHANNEL: FOLLOW US

స్వామినాథన్ 1931లో తమిళనాడులోని తిరునల్వేలిలో జన్మించారు. ఆయన 1953లో హర్యానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. ఆ తర్వాత, ఆయన కేంద్ర వ్యవసాయ మరియు అనుబంధ రంగాల పరిశోధనా మండలి (ICAR)లో చేరారు. ఆయన 1986లో ICAR యొక్క డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. స్వామినాథన్ (M.S. Swaminathan) భారతదేశ వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలను ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన “హరిత విప్లవం” కార్యక్రమం భారతదేశంలో పంట ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. ఆయన రూపొందించిన “బహుళ పంట వ్యవస్థ” భారతదేశంలో పంట వివిధతను పెంచడంలో సహాయపడింది.

స్వామినాథన్ వ్యవసాయ రంగంలో చేసిన కృషికి అనేక అవార్డులు మరియు గౌరవాలను అందుకున్నారు. పద్మశ్రీ (1967), రామన్ మెగసెసే (1971) పద్మభూషణ్ (1972), పద్మవిభూషణ్ (1989), వరల్డ్ పుడ్ ప్రైజ్ (1987), ఇందిరా గాంధి శాంతి పుస్కారం (1999), ఇందిరాగాంధి జాతీయ సమైక్యతా పుస్కారం (2013), ఇలాంటి దేశీయ పురస్కారాలతో పాటు అమెరికన్ సైన్స్ అకాడెమీ ఫెలోషిప్, వరల్డ్ అగ్రికల్చర్ సైన్స్ అవార్డ్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వ్యవసాయ సాంకేతిక అవార్డ్, ఇలా అనేకానేక అవార్డులను ఆయన కైవశం చేసుకున్నారు.

స్వామినాథన్ (M.S. Swaminathan) చేసిన కృషి ప్రభావం

స్వామినాథన్ వ్యవసాయ రంగంలో సాగించిన కృషి భారతదేశం మీదే కాదు, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఆయన చేసిన కృషి కారణంగా, భారతదేశం ఆహార భద్రతను సాధించడంలోనూ వ్యవసాయ రంగంలో అభివృద్ధిని స్వావలంబనను సాధించడంలో విజయం సాధించింది. స్వామినాథన్ కృషి చూపిన కొన్ని ప్రధాన ప్రభావాలు తలుచుకుంటే వాటిలో అతి కీలకమైనవిగా వీటిని చెప్పుకోవచ్చు. భారతదేశంలో పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.భారతదేశం ఆహార భద్రతను సాధించింది.వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించింది.రైతుల ఆదాయం పెరిగింది.వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్వామినాథన్ భారతదేశ వ్యవసాయ రంగానికి మార్గదర్శకుడిగా కలకాలం మన దేశ చరిత్రపుటల్లో నిలిచిపోతారు. ఆ మహనీయునికి ఘన నివాళి.

Also Read:  TDP : చంద్రబాబు అరెస్ట్ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్ర‌భుత్వం