Udayanidhi Stalin : సనాతన ధర్మమా..? సామాజిక న్యాయమా..?

తమిళనాడు అధికార డిఎంకె యువ మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) దేశంలోనే ఒక పెద్ద చర్చ చెలరేగడానికి కారణమయ్యాడు.

  • Written By:
  • Updated On - September 5, 2023 / 12:47 PM IST

By: డా. ప్రసాదమూర్తి

తమిళనాడు అధికార డిఎంకె యువ మంత్రి ఉదయనిధి స్టాలిన్ దేశంలోనే ఒక పెద్ద చర్చ చెలరేగడానికి కారణమయ్యాడు. ఇటీవల తమిళనాడులో జరిగిన అభ్యుదయ రచయితల సమావేశంలో సనాతన ధర్మ నిర్మూలన మహానాడు కార్యక్రమం మీద ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు, కొత్తగా బలపడుతున్న ప్రతిపక్ష కూటమిని ఇరకాటంలో పడేశాయి. అదే సందర్భంలో ఆ వ్యాఖ్యలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి, దాని వెనుక ఉన్న ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ తదితర హిందుత్వ శక్తులకు ఒక కొత్త ఆయుధాన్ని అందించాయి. మీటింగ్ జరిగింది అభ్యుదయ రచయితల ఆధ్వర్యంలో. ఎజెండా సనాతన ధర్మం.

ఈ నేపథ్యంలోనే ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) సనాతన ధర్మం మీద తన అధునాతన భావాలను వ్యక్తం చేశాడు. సనాతన ధర్మం నిర్మూలన జరగాలని, దేశంలో ప్రజలను పట్టిపీడించే దీర్ఘరోగాలైన డెంగీ కలరా మలేరియా లాంటి వాటిని ఎలాగైతే నిర్మూలించాల్సిన అవసరం ఉందో, సనాతన ధర్మాన్ని కూడా వేళ్ళతో సహా సమూలంగా నిర్మూలించాలని అతను వ్యాఖ్యానించాడు.

ఉదయనిధి స్టాలిన్ రేపిన కందిరీగలు తుట్టె సామాన్యమైంది కాదు. అదేదో ఈరోజు పుట్టిందీ కాదు. ఈ ఆలోచనలు పురాతన భారతీయ సంస్కృతిలో పరంపరగా వస్తున్నవే. చార్వాకుల కాలం నుంచి, బుద్ధుడి నుంచి, ఫూలే, పెరియార్, అంబేద్కర్ వరకు మన భారతీయ సాంస్కృతిక పరంపరలో రెండు ఆలోచనా ధోరణుల మధ్య పరస్పర ఘర్షణ సాగుతూనే ఉంది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు తదితర గ్రంథాల్లోని అంశాలతో కూడిన సామాజిక నిర్మాణ పద్ధతి ఒకటి. దీనినే సనాతన ధర్మపరాయణులు సనాతన ధర్మం అని అంటారు.

ఈ పద్ధతిని అంటే ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించి హేతువుని, సామాజిక న్యాయాన్ని, భౌతిక వైజ్ఞానిక దృష్టిని పునాది చేసుకొని సాగే పద్ధతి ఒకటి. ఈ రెండు ఆలోచనా పరంపరల మధ్య ఘర్షణ వేల సంవత్సరాలుగా ఈ దేశంలో నెలకొని ఉంది. ఈ రెండో ఆలోచనా ధోరణికి సంబంధించిన వారసత్వానికి చెందిన వాడు ఉదయనిధి స్టాలిన్.

Also Read:  Amita Bachchan : చంద్రుడిపై కౌన్ బనేగా కరోడ్ పతి: అమితాబ్

తమిళనాడులో పెరియార్ రామస్వామి 20వ శతాబ్దంలో ఆర్య సంస్కృతి పెత్తనం మీద, ఆధిపత్యం మీద సాగించిన మహోద్యమం, ఈ దేశం మొత్తం మీద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా సాగే ఉద్యమాలకు, పోరాటాలకు గట్టి పునాది వేసింది. పెరియార్ వారసత్వాన్ని డీఎంకే అధినేత కరుణానిధి, ఆ తరువాత అతని కుమారుడు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అతని కుమారుడు ఉదయినిధి స్టాలిన్ (Udayanidhi Stalin) ఇలా నాలుగు తరాలుగా కొనసాగుతూ వచ్చింది.

తమిళనాడులో సనాతన ధర్మం మీద పోరాటం అంటే వర్ణధర్మం మీద పోరాటం. అంటే మనుస్మృతి ప్రకారం ఈ దేశంలో ఏ కులవ్యవస్థ అయితే అసమానతల పునాదుల మీద ఏర్పడిందో దానిమీద పోరాటం. కొన్ని వర్గాలకు ఆధిపత్య స్థానం, కొన్ని వర్గాలకు బానిసత్వ స్థానం నిర్దేశించినది వర్ణధర్మ వ్యవస్థ. దీన్ని శాసనబద్ధం చేసింది మనుస్మృతి. దీని వెనుక ఉన్నదే సనాతన ధర్మం. ఈ మనుస్మృతినే తగలబెట్టమన్నాడు అంబేద్కర్.

ఈ మనుస్మృతి వెనుకనున్న సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం అంటే బ్రాహ్మణాది అగ్రవర్ణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి సమాజంలో సమస్త వర్ణాల సమగ్ర అభివృద్ధిని కాంక్షించడం అని తమిళనాడులో పెరియారు వారసులుగా చెప్పుకుంటున్న వారి వాదన. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఏ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నాడో అది వర్ణవ్యవస్థ ధర్మానికి వ్యతిరేకంగా చెప్పినదే. తమిళనాడులో సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థను సమర్థించే ధర్మమే కనుక సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం అంటే కుల పరంగా జరిగే అన్ని రకాల దోపిడీలను వ్యతిరేకించడమే.

అంటే సామాజిక న్యాయం కోసం పోరాడడమే. ఇదే తన ఉద్దేశం అని ఉదయినిధి స్టాలిన్ (Udayanidhi Stalin) చెబుతున్నాడు. తమిళ ఆత్మగౌరవ పోరాటం వెనుక పెరియార్ నుంచి కరుణానిధి నుంచి ఇప్పటివరకు సాగిన సామాజిక సాంస్కృతిక ఉద్యమాల నేపథ్యం ఉంది. ఈ నేపథ్యానికి వారసునిగా ఉదయనిధి స్టాలిన్ ని చూడాలి. అదే విషయాన్ని మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కీర్తి చిదంబరం కూడా నొక్కి చెప్పాడు.

Also Read:  Mother Teresa Death Anniversary 2023 : మమతల తల్లి ‘మ‌ద‌ర్ థెరిస్సా ‘

అయితే ఇప్పుడిప్పుడే ఒక్కటవుతున్న ప్రతిపక్షాలు ఎక్కడ దొరుకుతాయా నొక్కి పారేయాలని తహతహలాడుతున్న బిజెపి, దాని వెనుక ఉన్న ఇతర హిందుత్వ శక్తులకు ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్య గొప్ప అస్త్రమైంది. దేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సనాతన ధర్మాన్ని తుడిచివేయాలని, భారతీయుల సాంస్కృతిక పరంపరను నాశనం చేయాలని ఆలోచిస్తున్న శక్తులన్నీ కలిసి ఇప్పుడు ప్రతిపక్ష కూటమిగా ఏర్పడ్డాయని, సరాసరి హోంమంత్రి అమిత్ షా నుంచి అనేకమంది బిజెపి నాయకులు మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు. ఇది రానురాను రగులుతూ రాజకీయ పోరాటం కాకుండా, సాంస్కృతిక పోరాటంగా మారే ప్రమాదం ఉంది.

ఇలా మారితే భారతీయుల మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టి, ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బకొట్టి, ఎన్నికల్లో ఇదే అదునుగా లబ్ధి పొందవచ్చునని అధికార బిజెపి ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీని పర్యవసానాలు, పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ అనేకానేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దేశం, ఇప్పుడు ఎక్కడో తమిళనాడులో ఒక యువ నాయకుడు చేసిన సాంస్కృతిక భావజాలానికి సంబంధించిన ఒక చిన్న అంశాన్ని పట్టుకొని ఎగిసి పడుతుందని, అదే అంశం మీద దేశమంతా ఎన్నికలకు వెళుతుందని నమ్మబలికేటంత అమాయకులు ఎవరూ లేరు.

మరి ఈ రగడను ఎంతవరకూ తీసుకువెళ్లి బిజెపి వారు ఆపుతారో, దీన్ని విపక్షాలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. ఉదయినిధి స్టాలిన్ (Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు అతని వ్యక్తిగతమైనవని, వాటితో తమకు సంబంధం లేదని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి వాళ్లు అంటున్నారు. కనుక దీన్ని పట్టుకొని బిజెపి ఊరేగితే అది కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్న సామెతగా మిగిలిపోవచ్చు.

Also Read:  Kavitha Letter: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు చారిత్రక అవసరం, అన్ని రాజకీయ పార్టీలకు కవిత లేఖ!