Congress: గుజరాత్‌లో కాంగ్రెస్‌ది స్వయంకృతాపరాధమేనా ?

గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ విధ్వంసానికి గురైంది. అగ్ర నేతల స్వయంకృతాపరాధంతోనే కాంగ్రెస్ దారుణ పరాజయం

  • Written By:
  • Updated On - December 9, 2022 / 09:52 AM IST

గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ విధ్వంసానికి గురైంది. అగ్ర నేతల స్వయంకృతాపరాధంతోనే కాంగ్రెస్ దారుణ పరాజయం పాలైందా? గత ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తుందనే అభిప్రాయం కలిగించిన హస్తం పార్టీ ఈసారి ఎందుకిలా తయారైంది. వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న పార్టీ అని కాంగ్రెస్ గురించి చెబుతారు. కాని దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీని తిరిగి లేవకుండా అణచివేస్తున్నారు. ఇక్కడ మోదీ గొప్పతనం అని చెప్పేకంటే..కాంగ్రెస్ చేతగాని తనం అనే చెప్పవచ్చంటారు రాజకీయ విశ్లేషకులు. అధికారం పోయిన వెంటనే పార్టీలు మార్చేసే నాయకులు ఎక్కువై కాంగ్రెస్‌ను రోజు రోజుకూ ధ్వంసం చేస్తున్నారు. 2017 ఎన్నికల్లో 41 శాతం ఓట్లతో 77 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పటి ఎన్నికల్లో 20 సీట్లు కూడా తెచ్చుకోలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. బీజేపీ రాష్ట్ర నాయకులకంటే అక్కడ మోదీ, షాలే గుజరాత్‌లో కనిపిస్తారు. వారికి తగ్గ నాయకులు కాంగ్రెస్‌లో కనిపించరు. గతంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటే అహ్మద్ పటేల్‌ మరణంతో ఒకరకంగా గుజరాత్‌ కాంగ్రెస్ అనాథ అయిందనే చెప్పాలి.

గుజరాత్‌లో కాంగ్రెస్ ఇంత విధ్వంసానికి గురి కావడం వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్‌ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి కమలం పార్టీలో చేరిపోయారు. దీంతో పట్టీదార్లంతా కాంగ్రెస్‌కు దూరమయ్యారనే చెప్పాలి. రాష్ట్రంలో నాయకత్వ లోపం, కేంద్ర నాయకత్వం పట్టించుకోకపోవడం, అగ్రనేతగా చెప్పుకునే రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికలను నిర్లక్ష్యం చేసి భారత్ జోడో యాత్రలో ఉండిపోవడం, పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తనకు సంబంధం లేదన్నట్లుగా సైలంట్‌గా ఉండిపోవడం వంటి అనేక కారణాలు కాంగ్రెస్ ఓటమికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు.

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడి పడేయడం బీజేపీ థంపింగ్ మెజారిటీ మరింతగా పెరిగిపోయింది. రాజస్థాన్‌లో ఏదో అద్భుతాలు సృష్టిస్తున్నాడని చెప్పుకుంటూ అక్కడి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించడం కూడా ఏమాత్రం కలిసిరాలేదు. మోదీ గుజరాత్‌ మోడల్, ఆప్ ఢిల్లీ మోడల్, గెహ్లాట్ రాజస్థాన్ మోడల్‌ అక్కడ పోటీ పడ్డాయి. మోదీ గుజరాత్‌ మోడల్ విజయం సాధించింది. 2012, 2017లో సీట్లు పెరిగాయి. కాని ఈసారి మరీ తీసికట్టుగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. పార్టీలో అంతర్గత కలహాలు, అందరినీ ఏకం చేసి ముందుకు నడిపించే నాయకుడు లేకపోవడం, బీజేపీ అర్థ, అంగ బలం ముందు హస్తం పార్టీ వెల వెల బోయింది. 27 సంవత్సరాలుగా అధికారంలో లేని కాంగ్రెస్ గుజరాత్‌లో పటిష్ట నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయింది. పటిష్టమైన యంత్రాంగం.. సిద్ధాంత బలం..హిందుత్వ వాదం ప్రబలంగా వినిపించగల సామర్థ్యం ఉన్న కాషాయ సేన ముందు కాంగ్రెస్ ఆయుధాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. అందుకే ముందుగానే కాంగ్రెస్ నాయకులు అస్త్ర సన్యాసం చేశారు .