Rajasthan Election 2023 : రాజస్థాన్ లో ఏం జరుగుతోంది? ఇప్పుడు అందరి దృష్టీ అటే

ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ (Congress), బిజెపి (BJP) ప్రచార రంగంలో ఒకరికొకరు అత్యంత తీవ్రంగా తలపడ్డారు. ఇప్పుడు మిగిలిన రాజస్థాన్ (Rajasthan), తెలంగాణ (Telangana) ఎన్నికల మీద అందరూ దృష్టి సారించారు.

డా. ప్రసాదమూర్తి

Rajasthan Election 2023 : ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు గాను మూడు రాష్ట్రాల్లో పోలింగ్ దశ ముగిసింది. చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో హోరాహోరీ ప్రచారం, పథకాలు, వాగ్దానాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతి విమర్శలు ఇలా అనేక విధాలుగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి ప్రచార రంగంలో ఒకరికొకరు అత్యంత తీవ్రంగా తలపడ్డారు. ఇప్పుడు మిగిలిన రాజస్థాన్ (Rajasthan), తెలంగాణ (Telangana) ఎన్నికల మీద అందరూ దృష్టి సారించారు. ఈ రెండింటిలో తెలంగాణ కంటే రాజస్థాన్లోనే పోలింగ్ కొన్ని రోజులు ముందు ముగుస్తుంది. అందుకే ప్రధాన పక్షాలైన బిజెపి, కాంగ్రెస్ రాజస్థాన్ (Rajasthan) మీద తమ దృష్టిని కేంద్రీకరించారు. ఏ రాష్ట్రంలోనూ లేని ఒక రాజకీయ చారిత్రక పరంపర రాజస్థాన్లో ఉంది. అక్కడ ఇప్పటివరకు ఏ పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేదు. ఒక ఎన్నికల్లో ఒక పార్టీ, మరో ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ.. ఇలా ఐదు సంవత్సరాలకు ఒక సర్కార్ మారుతూ వస్తోంది. ఇప్పుడు కూడా రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ పడిపోతుందా, దాని స్థానంలో బిజెపి తన ప్రభుత్వాన్ని నెలకొల్పుతోందా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. అలవాయితీ ప్రకారం అలాగే జరగాలి. అయితే ఈసారి ఈ పరంపరకు బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు పలు రాజకీయ వర్గాలు, సర్వేలు, విశ్లేషకుల అంచనాల ద్వారా తెలుస్తోంది. దీనికి కారణం అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలే అని పలువురు భావిస్తున్నారు.

ప్రతిష్టగా తీసుకున్న బిజెపి:

ఒకపక్క ఛత్తీస్ గఢ్ లో, ఎంపీలో తమ గెలుపు అంత ఈజీ కాదని బిజెపి గమనించింది. ఇప్పుడు రాజస్థాన్లో కూడా ఓటమిపాలైతే అది కేంద్రంలో మరోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలకు గండి కొట్టవచ్చు అని బిజెపి భయంతో కూడిన అభిప్రాయంలో ఉంది. అందుకే బిజెపి అగ్ర నాయకులు రాజస్థాన్ (Rajasthan) లో తిష్ట వేశారు. సామ దాన భేద దండోపాయాలన్నీ వినియోగించి రాజస్థాన్లో హస్తం పార్టీ నుంచి అధికారాన్ని తమ హస్తగతం చేసుకోవాలని బిజెపి వారు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటిలో ఆరోగ్య పథకం అత్యంత కీలకమైందిగా రాజస్థాన్లో సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు. ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి ఉచితంగా వైద్య సదుపాయాన్ని అందించడంలో గెహ్లోట్ ప్రభుత్వం పూర్తి విజయం సాధించినట్లుగా అక్కడి ప్రజల మాటలు వింటుంటే తెలుస్తుంది. అనేక మీడియా సంస్థలు చేస్తున్న సర్వేలలో ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం కూడా ఆరోగ్య రంగంలో ప్రభుత్వం చేసిన ఈ గొప్ప పని గురించే. దీన్ని రాహుల్ గాంధీ కూడా దేశానికే ఒక నమూనాగా ప్రచారం చేస్తున్నారు. విదేశాల యూనివర్సిటీల్లో ఈ పథకాన్ని గురించి ఆయన ఘనంగా చెప్పుకుంటున్నారు. దానికి తోడు చిరంజీవి పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకు వచ్చింది. అన్నింటిని మించి ఎంతో అనుభవంతో, అవినీతి రహితమైన ప్రభుత్వాన్ని గెహ్లోట్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా చోటుచేసుకుంది. అందుకే ఇక్కడ పథకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించడం సాధ్యం కాదని బిజెపి హిందూ ముస్లిం కార్డును బయటకు తీసింది.

We’re Now on WhatsApp. Click to Join.

నసీర్ జునైదుల హత్య తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద, మేవాత్ హింసాత్మక ఘటనల నేపథ్యం మీద బిజెపి వారు దృష్టి ఎక్కువగా సారించి రాజస్థాన్లో హిందూ ముస్లిం అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత సంవత్సరం ఉదయపూర్ లో జరిగిన కన్హయ్యా లాల్ హత్య విషయంలో రాజస్థాన్ (Rajasthan) సర్కార్ కఠినంగా వ్యవహరించలేదని, హంతకులపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని, రాష్ట్రాన్ని నేరపూరిత రాజ్యంగా కాంగ్రెస్ వారు మార్చి వేశారని అమిత్ షా ఇటీవల విరుచుకుపడ్డారు. ఈ విషయంలో రాజస్థాన్ ప్రజలు మతం కార్డుకు ఓటు వేస్తారా లేక సంక్షేమం పట్ల రాష్ట్ర అభివృద్ధి పట్ల సానుకూలంగా తమ అభిమతాన్ని వ్యక్తం చేస్తారా అనేది చూడాలి.

దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న మహా నాయకుడు అశోక్ గెహ్లోట్ రాజస్థాన్లో తన ప్రభుత్వాన్ని చీల్చడానికి బిజెపి చేసిన రణతంత్రాన్ని ఫలించనివ్వలేదు. కర్ణాటకలో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బిజెపి వ్యూహాలు ఫలించాయి. కానీ రాజస్థాన్లో సచిన్ పైలెట్ ను అడ్డం పెట్టుకొని ఈ విభజన రాజకీయాలు నడపాలని బిజెపి ఎంత ప్రయత్నాలు చేసినా గెహ్లోట్ రాజకీయ చతురత, ఆయన అనుభవ విజ్ఞత ఆ ప్రయత్నాలను అడ్డుకున్నాయి. అందుకే అశోక్ గెహ్లోట్ తిరిగి రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీని అధికారం దిశగా నడుపుతారని పలువురు భావిస్తున్నారు. అక్కడ ప్రజలు కూడా గెహూ పట్ల మెజారిటీ సంఖ్యలో సానుకూలంగా ఉన్నట్లు పలు అంచనాల ద్వారా అర్థమవుతుంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ తిరిగి అధికారం నెలకొల్పితే, గెహ్లోట్ రానున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా రాజస్థాన్లో సంక్షేమం గెలుస్తుందా.. కులాల మధ్య మతాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనే వ్యూహం గెలుస్తుందా అనేది ఇంకొన్ని రోజులలోనే మనం తెలుసుకోబోతున్నాం.

Also Read: Liquor Sales : ఎన్నికల టైం.. అయినా లిక్కర్ సేల్స్ డౌన్