PM Security:ప్రధానికి రక్షణ కల్పించే ఎస్పీజీ ఎలా పనిచేస్తుంది? అసలు ఎస్.పి.జి అంటే ఏమిటి?

ప్రధానమంత్రి సెక్యూరిటీ అంటే ఆషామాషీ కాదు. దానికి చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. ఈ రక్షణ బాధ్యతలను ఎస్పీజీ.. అంటే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ చూస్తుంది. ఇందులో అత్యంత అధునాతన శిక్షణ తీసుకున్న మెరికల్లాంటి కమాండోలు ఉంటారు.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 08:35 PM IST

ప్రధానమంత్రి సెక్యూరిటీ అంటే ఆషామాషీ కాదు. దానికి చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. ఈ రక్షణ బాధ్యతలను ఎస్పీజీ.. అంటే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ చూస్తుంది. ఇందులో అత్యంత అధునాతన శిక్షణ తీసుకున్న మెరికల్లాంటి కమాండోలు ఉంటారు. ప్రధానికి దాదాపుగా 1000 మంది కమాండోలతో కూడిన సెక్యూరిటీ ఉంటుంది. మొత్తం ఐదు అంచెల్లో భద్రతను కల్పిస్తారు. ఇందులో ఒక్కో అంచెలో ఒక్కో భద్రతా సంస్థ సెక్యూరిటీ వ్యవహారాలను చూసుకుంటుంది.

ప్రధాని చుట్టూ ఫస్ట్ లేయర్ లో కమాండోలు సెక్యూరిటీగా ఉంటారు. వీళ్లందరికీ స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక రెండో అంచెలో ప్రధానమంత్రి పర్సనల్ సెక్యూరిటీ గార్డులు పహారా కాస్తారు. వీళ్లకూ ఎస్పీజీ అధికారుల స్థాయిలో శిక్షణ ఉంటుంది. థర్డ్ లేయర్ భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అధికారులు చూసుకుంటారు. నాలుగో అంచెలో పోలీసుల అధికారులు భద్రతను కల్పిస్తారు. ఈ టీమ్ లో వివిధ రాష్ట్రాల్లోని పోలీసు అధికారులను ఎంపిక చేస్తారు. ఐదో అంచెలో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన వాహన వ్యవస్థ ఉంటుంది. ఇందులో కూడా కమాండోలు, అధికారులతో కూడిన సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. ప్రధాని కాన్వాయ్ లో హైకెపాసిటీ ఉండే మిలటరీ ఆయుధాలు కూడా ఉంటాయి.

ప్రధాని ప్రయాణించే మార్గంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వరు. సెక్యూరిటీ అంత టైట్ గా ఉంటుంది. ఎందుకంటే పీఎం వెళ్లే రూటును మూడు రోజుల ముందే గుర్తిస్తారు. దానికి అనుగుణంగానే దారిపొడవునా ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ రోడ్డు మార్గంలో వెళితే.. ఆ మార్గమంతా పోలీసుల ఆధీనంలో ఉంటుంది. పోలీసు సెక్యూరిటీ ఉంటుంది. చుట్టుపక్కల బిల్డింగులపై స్నిప్పర్స్ ను ఉంచుతారు. అనుకోని ఘటనలు జరిగితే.. వీళ్ల సేవలను ఉపయోగించుకుంటారు.

ప్రధాని కాన్వాయ్ లో ఆయుధ సంపత్తితో కూడిన వ్యవస్థ ఉంటుంది. కెమికల్ దాడులు, బయోలాజికల్ దాడులు జరిగినా సరే వాటిని ఎదుర్కొనేలా సిస్టమ్ ఉంటుంది. ప్రధాని వాహనంతా బుల్లెట్ ప్రూఫ్ తో ఉంటుంది. ఇలాంటి వాహనాలే మరో రెండు కాన్వాయ్ లో ఉంటాయి. ప్రధాని కాన్వాయ్ లో పేలుళ్లను కూడా నియంత్రించేలా జామర్ వాహనం ఉంటుంది. అంటే వంద మీటర్ల పరిధిలో పేలుళ్లను నిరోధించే శక్తి వీటికుంటుంది. ప్రధానికి అత్యవసర వైద్యసేవలందించేందుకు వీలుగా పూర్తిస్థాయి హెల్త్ సిస్టమ్ తో కూడిన అంబులెన్స్ కూడా ఉంటుంది. ప్రధాని నడుచుకుంటూ వెళ్లాలనుకున్నా సరే.. ఆయన చుట్టూ మఫ్టీలో ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు.

ప్రధాని రక్షణ బాధ్యత ఎస్పీజీదే. పీఎం రాష్ట్రాల పర్యటనకు వెళ్లడానికి ముందే వివిధ విభాగాల అధికారులతో అది చర్చలు జరుపుతుంది. దానికి అనుగుణంగానే టూర్ కి సంబంధించిన సెక్యూరిటీ వివరాలతో బ్లూ బుక్ ని సిద్ధం చేస్తుంది. పైగా ప్రధానికి ఏఎస్ఎల్.. అంటే అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ ఉంటుంది. దీని వల్ల అదనపు భద్రతా చర్యలు ఉంటాయి. అంటే ప్రధాని ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగానే అక్కడ డ్రిల్ చేస్తారు. దీనివల్ల సెక్యూరిటీ లోపాలను ముందే గుర్తించడానికి వీలవుతుంది. ఇన్ని జాగ్రత్తలను తీసుకోవాలి కాబట్టే.. ప్రధాని ఒకరోజు భద్రతా ఖర్చు దాదాపు కోటిన్నర రూపాయిలు ఉంటుందని సమాచారం.