Site icon HashtagU Telugu

Women’s Reservation Bill: మహిళా బిల్లు చుట్టూ మడత పేచీ..!

Women's Reservation Bill

pawan kalyan about women's reservation bill

By: డా. ప్రసాదమూర్తి

Women’s Reservation Bill: పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు (Women’s Reservation Bill) విషయంలో దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయ పరిణామాలు నాటకీయంగా సాగుతున్నాయి. ఇక ఇదిగో ఇప్పుడు మహిళా బిల్లు వచ్చేస్తుంది చూసుకోండి అన్నట్టుగా హడావిడి చేస్తుంటారు. అంతలో అది అంతుచిక్కని రహస్యంతో ఆగిపోతుంది. ఎవరి కారణాలు వారికున్నా.. ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఇక మహిళా బిల్లు వెలుగు చూస్తుందని, లోక్ సభలోనూ రాష్ట్రాల శాసనసభల్లోనూ మహిళలకు 33% కోటా అమల్లోకి వస్తుందని రెండు రోజులుగా దేశమంతా కోడై కూస్తోంది.

లేటయినా ఏముందిలే బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నట్టు మొత్తానికి ఇన్నేళ్ల చీకటి బంధనాల నుంచి మహిళా బిల్లు విముక్తి చెందుతుందని అందరూ సంతోషించారు. కానీ ఆ ఆనందం కొన్ని గంటలు కూడా నిలవలేదు. ఏలినవారు ఈ బిల్లును తీసుకొచ్చే అదృష్టం మాకే దక్కిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. మహిళా బిల్లును అమలు చేసే మహత్తర కార్యానికి దేవుడు తననే ఎంచుకున్నాడని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా అద్భుత వాక్చాతుర్యంతో ప్రకటించారు. కాంగ్రెస్ వారు ఈ బిల్లు మాదే అని, దీన్ని అనేక సందర్భాల్లో చట్టం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశామని, ఈ ఆలోచన రాజీవ్ గాంధీ మనసు నుంచి పుట్టిందని, ఈ బిల్లు చట్టమైతే ఆ క్రెడిట్ తమదేనని చెప్పుకోవడానికి సాధికారంగానే సముచితంగానే ప్రయత్నిస్తున్నారు. అదెలా కుదురుతుంది? మీరు పెట్టిన బిల్లు ఎప్పుడో కాలం చెల్లి కాలగర్భంలో కలిసిపోయిందని, ఈ క్రెడిట్ మాదేనని అధికార పార్టీ వారు ఆర్పాటంగా వాదిస్తున్నారు. మాదంటే మాది అని వాద ప్రతివాదనలు జోరుగా సాగుతున్నాయి. ఇక మీడియా వారికి సాయంకాలపు చర్చా గోష్టులకు కొదవే లేదు. అంతా పండగే పండుగ.

తీరా చూస్తే ఏముంది బిల్లులో? అధికార బిజెపి, కాంగ్రెస్ లాంటి ఇతర కొన్ని పక్షాల మద్దతుతో ఈ బిల్లును పాస్ చేయవచ్చు. కానీ అమలు మాత్రం అప్పుడే చేయలేరు. ఇదే మడత పేచీ. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందినా, అది చట్టం చేయబడినా అమలు కావడానికి కొన్ని అవరోధాలను బిల్లులోనే ఆచితూచి పక్కా వ్యూహంగా పెట్టారు. దీని ప్రకారం ఈ బిల్లు ప్రస్తుతం పార్లమెంట్లో పాసైనా అమలు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ప్రస్తుతం ఆ లెక్కలు వేసుకునే పనిలో దేశం పడిపోయింది. అదే పాలక ప్రభువుల అంతరార్థం కూడా.

Also Read: Women Reservation Bill: మహిళ బిల్లుపై బీజేపీ నేత ఉమాభారతి అసంతృప్తి

బిల్లు అమలు కావడానికి జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కావాలి. దాని ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి కావాలి. జనాభా లెక్కల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్న తీరుతెన్నులు చూస్తే మరో రెండు మూడేళ్లు పట్టవచ్చు. ఆ తరువాత దాని ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి మరో మూడు నాలుగేళ్ళు పట్టవచ్చు. ఈ తతంగం అంతా పూర్తయ్యేసరికి వచ్చే ఎన్నికలు కాదు కదా, ఆ పైన వచ్చే ఎన్నికలకన్నా ఈ చట్టం అమలులోకి వస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

మరి ఇది ఏదో ఇప్పుడే పార్లమెంట్లోకి 33 శాతం మంది మహిళలు అడుగుపెడుతున్నట్టు పాలకులు ఇంత హంగామా చేస్తున్నారేంటి? పదేళ్లలో ఎప్పుడూ ఈ బిల్లు పట్ల నిబద్ధత, నిజాయితీ ప్రదర్శించని వారికి, మరికొన్ని నెలలలో ఎన్నికలు వస్తున్నాయనగా ఇప్పుడే అకస్మాత్తుగా ఎందుకు గుర్తుకొచ్చింది? మహిళల పట్ల తమకే అత్యంత ప్రేమ, శ్రద్ధ, వారి అభివృద్ధి పట్ల అకుంఠితమైన దీక్షా ఉన్నాయని చాటి చెప్పుకునే అవకాశం గత తొమ్మిదిన్నర ఏళ్ళుగా ఎందుకు వదిలేశారు? ఇవన్నీ ప్రశ్నలు. అంటే.. ఇచ్చినట్టే ఇవ్వాలి. అది కాల పరీక్షకు వదిలేయాలి. ఇచ్చిన లబ్ధి తాము పొందాలి. పుచ్చుకున్న ఆనందం వారు పొందినా పొందకపోయినా దానితో తమకు పని లేదు.

అంతేకాదు, ఏలిన వారు ఏం పని చేసినా సొంత ప్రయోజనంతో పాటు కొంత ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టే చెలగాటం కూడా చేస్తారు. ఈ బిల్లులో కొన్ని ప్రతిపక్షాల వారు ఎంతో కాలం నుంచి ఓబిసి మహిళలకు సబ్ కోటా ఉండాలని పట్టు పడుతున్నారు. ప్రస్తుత బిల్లులో అలాంటిది లేదు. అంటే ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ కి, మహిళా బిల్లులో బీసీల కోటాను డిమాండ్ చేస్తున్న ఇతర పక్షాలకీ మధ్య తంటా పెట్టి తమాషా చూద్దామనే మహా ఉద్దేశం మన పాలకుల్లో కనిపిస్తున్నది. మొత్తానికి బిల్లునైతే తెచ్చారు కానీ, బిల్లును పాస్ చేయడం అయితే చేస్తారు గాని, అమలు చేసే పని ఇప్పుడు తమ చేతుల్లోకి తీసుకోలేదు. అందుకే ఈ బిల్లు పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మడత పేజీలో మతలబు అర్థం చేసుకోలేక జనాలు కొట్టుకు చస్తుంటారు పాపం.