Journalists are Terrorists? : జర్నలిస్టులు ఉగ్రవాదులా…?

జర్నలిస్టులు (Journalists) కూడా ఉగ్రవాదులు అయిపోయారా? లేక అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడడమే ఉగ్రవాద కార్యకలాపాల కింద జమ కట్టడం జరుగుతుందా?

  • Written By:
  • Updated On - October 4, 2023 / 11:16 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Did Journalists are Terrorists? : ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికారంలో ఉన్న పెద్దలకు బీపి పెరుగుతోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ దాకా పాలకులు తమ బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ప్రత్యర్థుల మీద కొత్త కొత్త చట్టాలను ఉపయోగించి వారి నోళ్లు మూయించే ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూస్ క్లిక్ మీడియా సంస్థకు చెందిన అభిసార్ శర్మ, ఉర్మిలేష్, అనింద్యో చక్రవర్తి, భాషా సింగ్ వంటి ప్రముఖ జర్నలిస్టుల ఇళ్ళల్లో సోదాలు చేసి, వారి లాప్ టాప్ లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, వారిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నలు గుప్పిస్తున్నట్టు వచ్చిన వార్తలు చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

వీరి మీద చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA )ఉపా కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జర్నలిస్టులు (Journalists) కూడా ఉగ్రవాదులు అయిపోయారా? లేక అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడడమే ఉగ్రవాద కార్యకలాపాల కింద జమ కట్టడం జరుగుతుందా? ఒక చట్టం ఒకేలా అందరికీ వర్తించాలి. కానీ ఒకరికి ఒకలా మరొకరికి మరోలా ఒకే చట్టాన్ని ఉపయోగించడం అనే వింత పరిణామాల వింత వింత పోకడలు ఇప్పుడు దేశంలో చూస్తున్నాం.

ఎవరికైనా బీపి పెరిగితే కారణాలు తెలుసుకుంటాం. లేదా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ సలహా మేరకు మందులు వాడతాం. బీపీ ఎక్కువగా పెరుగుతుంటే తీసుకునే ఆహారం పట్ల, రోజువారి మనం చేస్తున్న వ్యవహారాల పట్ల, శారీరక వ్యాయామం పట్ల మనం ఎలా ఉన్నామో సరిచూసుకొని, ఒకవేళ బీపీ పెరుగుదలకు మన ఆహార వ్యవహారాలలో లోపాలుంటే సరిచేసుకొని బీపీని అదుపులో పెట్టుకుంటాం. పాలకులు కూడా వాస్తవానికి చేయాల్సింది ఇదే.

We’re now on WhatsApp. Click to join.

ఎన్నికలు దగ్గర పడుతుంటే బీపీ పెరగడం సహజమే. దానికి కారణం ఏమిటి? తమ ప్రత్యర్థులా లేక తాము ఇంతకాలం చేసిన పనులా అనేది పాలకులు సరిచూసుకోవాలి. తమ పరిపాలనా కాలంలో తాము చేసిన పనులేంటి? ప్రజలకు అవి ఎంతవరకు ఉపయోగపడ్డాయి? ఇచ్చిన వాగ్దానాలు ఏమిటి?, వాటిలో నెరవేర్చినవి ఏమిటి? ఇంకా మిగిలిపోయినవి ఏంటి, ఇంకా తాము ఏం చేయాలి? ప్రజల నుండి విమర్శలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి.. ఇవన్నీ ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటే పాలకులకు ఎలాంటి బీపీ పెరగదు. కానీ తమ బీపీ పెరగడానికి కారణం ప్రత్యర్థులేనని ఒక కంక్లూజన్ కి వచ్చి వారి మీద లేనిపోని చట్టాలను ప్రయోగించి కసి తీర్చుకునే ధోరణి మంచిది కాదన్నదే పెద్దలు చెప్పే నీతి.

న్యూస్ క్లిక్ అనే స్వతంత్ర మీడియా సంస్థ చాలాకాలంగా పనిచేస్తోంది. ఈ సంస్థ అధికారంలో ఉన్న వారి పనితీరు మీద ప్రశ్నలు సంధిస్తుంది. జరిగిన, జరుగుతున్న అనేక ఘటనలను తమదైన శైలిలో రిపోర్టింగ్ చేస్తుంది. ఇది అధికారంలో ఉన్నవారికి కంటగింపుగా ఉంది. ఇప్పటికే బడా బడా మీడియా సంస్థలు అధికారంలో ఉన్న వారి పాదాక్రాంతమైపోయాయి. ‘ మా చెప్పుచేతల్లోకి వస్తే మీకు రాచ మర్యాదలుంటాయి, మేము చెప్పిన మాట వినకపోతే మీరు కటకటాల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే.’ ఇలాంటి ద్వంద్వ నీతిని అధికారంలో ఉన్న వారు పాటిస్తూ ఉంటారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల మాట అలా ఉంచి, ఈ నీతిని ఇప్పుడు జర్నలిస్టుల మీద కూడా ప్రయోగిస్తున్నారు.

న్యూస్ క్లిక్ సంస్థలో జర్నలిస్టులుగా (Journalists) పని చేస్తున్న అభిసార్ శర్మ, అనింద్యో చక్రవర్తి, భాషా సింగ్, ఉర్మిలేష్ మొదలైన వారు తమ తమ విశ్లేషణలు, రిపోర్టింగ్ లు వగైరా తమదైన శైలిలో సాగించేవారు. వీరు ప్రభుత్వ పక్షాన కాకుండా ప్రజల పక్షాన నిలబడి తాము జర్నలిజం చేస్తున్నామని అంటారు. అదే ప్రభుత్వానికి నచ్చని పని. అందుకే వీరి మీద ఉపా చట్టం కింద కేసులు నమోదయ్యాయి. దానికి కారణంగా ఎక్కడో న్యూయార్క్ టైమ్స్ లో ఒక చిన్న వార్త వచ్చిందని, అందులో వీరికి చైనా నుంచి ఫండింగ్ అందుతుందన్న వార్త వచ్చిందని చెప్తున్నారు. ఎక్కడ ఇండిపెండెంట్ జర్నలిస్టులు (Journalists), ఎక్కడ చైనా, ఎక్కడ చైనా ఫండింగ్.. ఇదంతా ఏమిటి? మనకి అర్థం కాదు. ఏలిన వారు తలుచుకుంటే ఏమైనా జరగవచ్చు. అస్మదీయులకు ఒకనీతి, తస్మదీయులకు ఒకనీతి. ఇదే ఈ కాలపు పాలకుల రీతి.

Also Read:  Nara Bhuvaneswari : అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది.. రాజ‌ధాని రైతుల‌తో నారా భువ‌నేశ్వ‌రి

ఇలా జర్నలిస్టులను భయపెట్టడం ద్వారా మిగిలిన వారందరినీ నోళ్లు మూయించవచ్చు. రానున్న ఎన్నికలలో తమకు వ్యతిరేకంగా ఎవరూ రాయడానికి గాని, మాట్లాడడానికి గాని సాహసం చేయకుండా కట్టడి చేయవచ్చు. అందుకే ఇలా ఇప్పుడు అర్జెంటుగా న్యూస్ క్లిక్ సంస్థ వంటి ఇండిపెండెంట్ జర్నలిజం మీద దాడి ప్రారంభమైనట్టుగా కనిపిస్తోందని పలువురు మేధావులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.

విదేశీ సంస్థలు వెల్లడి చేసే విషయాలను ఆధారంగా చేసుకుని మనం చర్యలు ప్రారంభిస్తే వాస్తవానికి అదానీ వ్యాపార సంస్థ మీద ఎప్పుడో దాడి చేయాలి. అదానీ కంపెనీ షేర్ మార్కెట్ లావాదేవీల వెనుక ఒక చైనీయుడి హస్తం ఉందని విదేశీ దర్యాప్తు సంస్థ ఒకటి వెల్లడి చేసింది. మరి గౌతమ్ అదానీ మీద , అతని సోదరుడు మీద ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వారి కార్యాలయాల మీద ఎలాంటి దాడులూ జరగలేదు. ఈ విషయం మీద పార్లమెంట్లో రాహుల్ గాంధీతో సహా అనేకమంది ప్రతిపక్ష నాయకులు అనేకసార్లు ప్రశ్నలు సంధించినా ఎలాంటి చర్యలూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అతి కీలకమైన పాత్ర పోషిస్తున్న అదానీ సంస్థలో ఒక చైనా వ్యాపారి కీలకమైన హస్తం ఉందని తెలిసినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కానీ ఎక్కడో ఏదో ఒక పత్రిక ఒక మాట రాసిందని, దాన్ని పట్టుకొని ఇప్పుడు జర్నలిస్టుల మీద దాడులు చేసి వారిని ఉపా చట్టం కింద అరెస్టులు చేసి విచారణ సాగిస్తున్నారు. ఇది ఎక్కడ నీతి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలకు జవాబు రాదు. ఏలిన వారి ఇష్టానుసారం పనులు జరుగుతాయి అంతే.

పరిపాలకులను ప్రశ్నించే వాళ్ళను కూడా ఉగ్రవాదుల జాబితాలో జమ కట్టడం ఎంత వరకూ సబబు? ఇక ఎవరైనా స్వేచ్ఛగా జర్నలిజాన్ని నిర్వహించగలరా అని ఎవరైనా బీపీ పెంచుకుంటే అది వారి సమస్య అని పాలకులు తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఇక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మరెన్ని చోద్యాలు చూడాలో..!

Also Read: Trudeau: భారత్ తో వివాదం మాకు ఇష్టం లేదు.. కెనడా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు